నవ్వులు పూయించే “గుర్రం పాపిరెడ్డి”

కామెడీ సినిమాలకు ప్రత్యేకంగా ప్రేక్షకులుంటారు. ఇంటిల్లపాదీ హాయిగా నవ్వుకోవడానికి ఈ సినిమాలు దోహదం చేస్తుంటాయి. అలాంటివాటిలో చెప్పుకోవాల్సిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. నరేష్ అగస్త్య హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. డార్క్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే…

కథ:
ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తాడు. తన స్నేహితులు మిలటరీ (కసిరెడ్డి రాజ్ కుమార్), చిలిపి (వంశీధర్ గౌడ్), గొయ్యి (జీవన్) లతో కలిసి చేసిన ఆ రాబరీ విఫలమవుతుంది. ఈ ఘటనలో ఉడ్రాజు (యోగిబాబు) నగలు, వజ్రాలతో పారిపోతే, పాపిరెడ్డి గ్యాంగ్ జైలుకు వెళ్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపిరెడ్డి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఇక ఈసారి చిన్న దొంగతనం కాదు… వేల కోట్ల ఆస్తిపై కన్నేసిన ఒక అతి పెద్ద స్కెచ్ వేస్తాడు. శ్రీశైలం అడవుల్లో ఉన్న ఒక శవాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, క్రిష్ణానగర్ శ్మశానవాటికలో కళింగ పోతురాజు సమాధిలో పూడ్చి, ఆ శవాన్ని ఆధారంగా చేసుకుని కళింగ వంశీయుల ఆస్తులపై కేసు వేయాలన్నది వీరి ప్లాన్. ఈ స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అయింది? గొయ్యిని కళింగ వంశీయుడిగా నిరూపించగలిగారా? ఈ వ్యవహారంలో జడ్జ్ పాత్రలో బ్రహ్మానందం ఎలా కీలకంగా మారాడు? చివరికి ఇదంతా ఎక్కడికి దారితీసిందన్నది మిగతా కథ.

విశ్లేషణ:
తెలుగు తెరపై డార్క్ కామెడీ చిత్రాలు అప్పుడప్పుడు వస్తున్నప్పటికీ, అన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. పేపర్‌పై బాగున్న ఐడియా, తెరపై అమలు చేసే సమయంలో తడబడటం చాలా సినిమాల్లో కనిపించింది. అయితే డార్క్ కామెడీ జోనర్‌లో ‘గుర్రం పాపిరెడ్డి’ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. సినిమా ప్రారంభంలోనే జడ్జ్ పాత్రలో బ్రహ్మానందం “స్టుపిడిటీ” గురించి చెప్పే మోనాలాగ్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్టుపిడిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాత్రలు చేసే క్రేజీ పనులే కథ మొత్తం ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లౌడ్‌గా, ఓవర్ స్టుపిడ్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చిరాకు కూడా తెప్పిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ అదే స్టుపిడిటీ కామెడీ గా మారి నవ్వులు పూయించడం మొదలుపెడుతుంది. బ్యాంక్ రాబరీ ఫెయిల్యూర్, శవం దొంగిలించే సన్నివేశాలు, ప్లాన్ అమలు చేసే క్రమంలో పాత్రల మధ్య వచ్చే గొడవలు హైలైట్. సెకండ్ హాఫ్‌లో కామెడీ మరింత సహజంగా వర్కౌట్ అవుతుంది. కోర్టు సన్నివేశాలు, సాక్షాల విషయంలో చేసే స్టుపిడ్ పనులు బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్‌లో నరేష్ అగస్త్య ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

నటీనటుల నటన:
నరేష్ అగస్త్య – పాపిరెడ్డి పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుంది. ఫరియా అబ్దుల్లా – సౌదామినిగా చురుకైన నటనతో మెప్పించింది. జీవన్ (గొయ్యి పాత్ర) – సినిమాకు పెద్ద ప్లస్. ఆద్యంతం నవ్వులు పూయిస్తాడు. బ్రహ్మానందం – చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి పాత్రలో కనిపించి నవ్వించారు. యోగిబాబు – చిన్న పాత్రైనా తన మార్క్ కామెడీతో నవ్వించారు. . కసిరెడ్డి రాజ్ కుమార్, వంశీధర్ గౌడ్ తమ టైమింగ్‌తో బాగా ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా:
కృష్ణ సౌరభ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచింది. అర్జున్ రాజా విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Scroll to Top