పండగ వేళ పాత కథతో ‘ది రాజా సాబ్’


పండగ సీజన్ లో వచ్చే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటివారు నటించిన సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’తో థియేటర్లలో అడుగుపెట్టారు ప్రభాస్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించడంతో… ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని ఆయన ఎలా డీల్ చేస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. పైగా ప్రభాస్ ఫస్ట్ టైమ్ హార్రర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ని ట్రై చేశారు… తొలిసారి హారర్ జోనర్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్ని చాలావరకూ నిరాశకు గురిచేశారని అంతా భావిస్తున్నారు.

ఇదీ కథ:
ఈ లోకంలో అన్నింటికీ డబ్బు ప్రధానం అనుకునే కనకరాజు (సంజయ్ దత్) దేవనగర జమిందారిణి అయిన గంగా దేవి(జరీనా వాహెబ్)పై కన్నేస్తాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకుని రాజ్య సంపదనంతా దోచుకోవాలని పథకం రచిస్తాడు. బైరాగి సాయంతో క్షుద్ర శక్తులను అవపోసన పట్టి ఆమెను తన వశం చేసుకుంటాడు. ఆ తర్వాత రాజ్య సంపదనంతా అపహరించి పరారవుతాడు. ఆ తర్వాత కనకరాజు ఏమయ్యాడు, గంగాదేవిని రాజ్యం వదిలి సామాన్యురాలిగా ఎందుకు బతకాల్సి వచ్చింది, ఇందులో గంగరాజు (సముద్రఖని) పాత్ర ఏంటి, నాయనమ్మ కోరిక మేరకు తాతను వెతికేందుకు హైదరాబాద్ చేరుకున్న రాజు(ప్రభాస్)కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:
ఈ సినిమా కథంతా నర్సాపూర్ ఫారెస్ట్‌లోని కోట చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే కనకరాజుకి డబ్బంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకుని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికీ దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి. సెకండాఫ్‌లో సంజయ్ దత్‌కి ప్రభాస్‌ ఎదురుపడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వాళ్ల మధ్య మైండ్ గేమ్‌తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తుంది. చనిపోయి ఆత్మగా మారిన తర్వాత కూడా తన భార్యను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడన్నది ఉత్కంఠ ని కలిగిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన సన్నివేశాలతో అసలు కథని గాడి తప్పించారు దర్శకుడు మారుతి.

నటన:
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్‌‌ని చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకోవడం, బాగా వెటకారం కలగలిపిన ఆ క్యారెక్టర్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడిగా, ముగ్గురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రియుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతడిని ఎలాగైనా అంతమొందించాలన్న పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్కపెట్టక పోరాడటం వంటి సీన్స్‌లో ప్రభాస్ అలరించారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్, మేనరిజం, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభాస్‌ నుంచి వరుసగా వస్తోన్న యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టేసిందనుకుంటోన్న ప్రేక్షకులకి ఈ సినిమా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక కనకరాజుగా సంజయ్‌దత్ విశ్వరూపం చూపించారు. డైలాగులు తక్కువైనా, తన నటనతో మెప్పించారు. ప్రభాస్ నాయనమ్మగా నటించిన జరీనా వాహెబ్ సెంటిమెంటుతో పిండేసింది. సినిమా అంతా సాధారణ మహిళగా కనిపించినప్పటికీ, క్లైమాక్స్‌లో రాణిగా ఆమె ఎంట్రీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లకు కథలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ముగ్గురిలో మాళవికా మోహనన్‌కి కాస్త ఎక్కువ స్పేస్ ఇచ్చారు. సముద్రఖనిని సరిగ్గా వాడుకో లేదనిపిస్తుంది. వీ టీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య పెద్దగా నవ్వించలేకపోయారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ సైక్రియాటిస్ట్ పద్మభూషణ్‌గా కీలక పాత్రలో కనిపించారు.

కొత్తదనమేదీ?
‘ది రాజా సాబ్’ కథ పరంగా చూస్తే అంత కొత్తదనమేదీ కనిపించదు. కథ పాతదైనా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తోంది. సినిమా ప్రారంభంలోనే సత్య ఎపిసోడ్‌తో కాస్త ఉత్కంఠ కలిగించినా ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ చూపించి సుమారు గంట పాటు స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ చూపించాడు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలతో సెకండాఫ్‌లో విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకోగా అక్కడా నిరాశే ఎదురైంది. కోటలో ఇరుక్కున్న హీరో అసలు పని వదిలేసి హీరోయిన్లతో రొమాన్స్ చేయడం, అతడి కోసం ముగ్గురు భామలు పోటీపడే సీన్లు అంతగా మెప్పించవు. ప్రీ క్లైమాక్స్‌ యాక్షన్ సీన్లు ఫర్వాలేదనిపించగా, క్లైమాక్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. కొన్ని సీన్లలో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది. అయితే మొసలి ఫైట్ మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమా నిడివి ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉండటంతో కొన్ని సీన్లు ల్యాగ్ అయి చాలాచోట్ల బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇలా భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్లే అభిమానుల్ని మాత్రం రాజాసాబ్ కాస్త నిరాశపరచొచ్చు.

నటులు:ప్రభాస్,నిధి అగర్వాల్,మాళవిక మోహనన్,సంజయ్ దత్,రిద్ది కుమార్
దర్శకుడు:మారుతి

Scroll to Top