శ్రీ విష్ణు నట విశ్వరూపం..స్వాగ్


హీరో శ్రీ విష్ణు నటనలో ఎమోషనల్‌గా, కామెడీగా, సీరియస్‌గా ఇలా అన్ని పాత్రలను పోషించగలడు. అయితే శ్రీ విష్ణు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు స్వాగ్ అంటూ వచ్చాడు. ఐదారు పాత్రలను ఒకే సినిమాలో పోషించడం, వేరియేషన్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి శ్రీ విష్ణు ఇప్పుడు స్వాగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

ఎస్సై భవభూతి (శ్రీ విష్ణు) భార్య రేవతి (మీరా జాస్మిన్) గర్భవతిగా ఉన్నపుడు ఇంటి నుంచి వెళ్లిపోతోంది. భార్య దూరం కావడంతో ఎస్సై భవభూతి మొరటు మనిషిగా, స్త్రీ ద్వేషిగా మారుతాడు. రిట్టైర్మెంట్ ఏజ్‌లో ఉన్న అలాంటి భవభూతికి ఓసారి ఓ లేఖ వస్తుంది. శ్వాగణిక వంశ వారసుడివి అంటూ.. వంశ వృక్ష నిలయంకు వెళ్తే నిధి దొరుకుతుందని అందులో ఉంటుంది. దీంతో ఎస్సై భవభూతి వంశ వృక్ష నిలయంకు వెళ్తాడు. అక్కడి చిట్ట చివరి వారసుడైన యయాతి (శ్రీ విష్ణు) రూపమే భవభూతికి ఉంటుంది. కానీ ఇంటి పేరు, తండ్రి పేరు మాత్రం సరితూగదు. దీంతో తాను శ్వాగణిక వంశానికి చెందిన వాడే అని నిరూపించుకోవాలని అనుకుంటాడు. మరో వైపు సింగ (శ్రీ విష్ణు) తన తండ్రి ఎవరో తెలియని కారణంతో అవమానాలు ఎదుర్కొంటాడు. సింగకి కూడా ఓ లేఖ వస్తుంది. ఈ లేఖలన్నీ కూడా విభూతి (శ్రీ విష్ణు) పంపుతుంది. ఇక శ్వాగణిక వంశానికి సంబంధించిన ఓ పలక అనుభూతి (రీతూ వర్మ) ఇంట్లో దొరుకుతుంది. దీంతో అసలు వారసులు ఎవరు అనేది గందరగోళంగా మారుతుంది? అసలు రాజు భవభూతి (శ్రీ విష్ణు) మహారాణి రుక్మిణి (రీతూ వర్మ)ని ఎదురించి పితృస్వామ్య వ్యవస్థను ఎలా నిలబెట్టాడు? కింగ్ భవభూతి పెట్టిన శాపం ఏంటి? విభూతి ఎవరు? ఆ నిధికి అసలు వారసులు ఎవరు? చివరకు ఏం జరుగుతుంది? అన్నది కథ.

ఇలాంటి కథకు.. హసిత్ గోలి రాసుకున్న కథనం కొందరికి ఆసక్తికరంగా అనిపించొచ్చు.. ఇంకొందరికి గందరగోళంగా అనిపించొచ్చు.. మరికొందరికీ కొన్ని చోట్ల సిల్లీగా అనిపించొచ్చు. కానీ రైటర్, మేకర్‌గా హసిత్ గోలి మాత్రం మెప్పిస్తాడు. టెక్నికల్ టీంను బాగానే వాడుకున్నాడు. ప్రొడక్షన్ నుంచి సపోర్ట్ బాగానే వచ్చినట్టుంది.. పీపుల్స్ మీడియా ఇచ్చిన ఫ్రీడంతో ఈ మూవీని చాలా రిచ్‌గా, గ్రాండియర్‌గా తీశాడు. టీజీ విశ్వ ప్రసాద్ టేస్ట్ కూడా స్వాగ్ మీద కనిపిస్తుంది. ఇక వివేక్ సాగర్‌తో హసిత్ గోలి ర్యాపో బాగా కుదిరింది. పాటలు ఒకెత్తు అయితే.. ఆర్ఆర్ ఎంతో గ్రాండియర్‌గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ అయితే చాలా రిచ్‌గా ఉంటుంది. రాజుల కాలాన్ని, ప్రస్తుత కాలాన్ని బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ చూస్తుంటే నిర్మాతలు భారీ ఎత్తునే ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఇక హసిత్ గోలి మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. చాలా చోట్ల హసిత్ గోలి టైమింగ్, కామెడీ వర్కౌట్ అయింది.

గోపరాజు రమణ, రవిబాబు ట్రాక్.. భవభూతి ట్రాక్ ఇలా అన్నీ కూడా బాగుంటాయి. ఇంటర్వెల్‌కు ట్విస్ట్ అదిరిపోతుంది. శ్రీ విష్ణు మరో ఎంట్రీ బాగుంది. అలా సెకండాఫ్‌కు కథ పూర్తి ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంటుంది. అక్కడే కథ చాలా స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ శ్రీ విష్ణు మాత్రం తన భుజాల మీద ఈ చిత్రాన్ని మోశాడు. ఒక సినిమాలో ఇన్ని రకాల వేరియేషన్స్, ఇన్ని రకాల గెటప్పులతో కనిపించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, గోపరాజు రమణ, గెటప్ శ్రీను, రవి బాబు ఇలా అన్ని పాత్రలు కూడా మెప్పిస్తాయి.

Scroll to Top