సినిమా అంటే కథే కీలకం.. కానీ ఈ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాకి కథతో పాటు అన్నీ లోపాలే. రిషి (నిఖిల్), తార (రుక్మిణి వసంత్), తులసి (దివ్యాన్షి కౌశిక్) మధ్య ముక్కోణపు ప్రేమకథ లాంటి కథ ఇది. ఇందులో థ్రిల్లర్ డ్రామాని కూడా ఇరికించారు. రిషి రేసర్ కావాలని కలలు కంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగా.. తార ను తొలిచూపులోనూ చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది కానీ.. ఇద్దరి మధ్య మిస్ కమ్యునికేషన్ వల్ల ప్రపోజ్ లేకుండానే బ్రేకప్ అవుతుంది. ఆ బాధలో ఉన్న రిషి.. తన లక్ష్యం కోసం లండన్ వెళ్తాడు. అక్కడ మనోడికి తులసి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్తాడు. అయితే చివరి క్షణంలో ఆ పెళ్లిని తప్పించుకుని వెళ్లిపోతుంది తులసి. సీన్ కట్ చేస్తే.. రిషి, తారలు మళ్లీ లవ్ ట్రాక్‌లోకి వస్తారు. ప్రపోజ్ చేసుకునే టైంకి మళ్లీ తులసి ఎంట్రీ ఇస్తుంది. తార ముందే రిషికి ఐలవ్యూ చెప్పడంతో.. తార మళ్లీ రిషికి దూరం అవుతుంది.
ఇక తులసి.. రిషి గదిలో శవంగా కనిపిస్తుంది. ఆమె తులసి కాదు చుంబన అని తెలుసుకుంటాడు రిషి. ఆ చుంబన.. లండన్ డాన్ అయిన బద్రి నారాయణ (జాన్ విజయ్) దగ్గర ఐదొందల కోట్లు విలువ చేసే డివైస్‌ని కొట్టేస్తుంది. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్లీ రిషికి దగ్గరౌతుంది. అసలు తులసి ఎవరు? చుంబన ఎవరు? ఆ ఐదొందల కోట్లు విలువ చేసే డివైస్ ఎలా మిస్ అయ్యింది? అది ఎవరికి దొరికింది? చివరికి తార-రిషిలు ఏమయ్యారు అన్నదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అసలు కథ.
కథంతా అYఒమయంగా సాగుతుంది. హీరో నిఖిల్ అయితే ఒకే ఎక్స్ ప్రెషన్‌తో సినిమా మొత్తం లాక్కొచ్చేశాడు. నవ్వినా.. ఏడ్చినా.. యాక్షన్ సీన్ అయినా.. రొమాంటిక్ సీన్ అయినా.. తనకి వచ్చిన ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్స్‌తో చిరాకు తెప్పించాడు. మొహంలో ఏ మాత్రం హావభావాలు పలికించలేకపోయాడు. దర్శకుడు సుధీర్ వర్మ.. కథ ఏం చెప్పి ఒప్పించాడో ఏమో కానీ.. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కథ ఇదీ అని చెప్పడానికి లేకుండా పోయింది. సత్య, సుదర్శన్.. ఈ ఇద్దరు కమెడియన్లు కథ చెప్పడం మొదలుపెడతారు. రెండేళ్లు ముందుకూ.. నాలుగేళ్లు వెనక్కు అంటూ కథను చెప్పడంలోనే అటూ ఇటూ తిప్పుతుంటారు. ముందుకు వెళ్లిన వెనక్కి వెళ్లిన ఫలితం మాత్రం శూన్యం. అసలు కథ మొదలు పెడతాడా.. అని ఎదురుచూసేసరకే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది..
పోనీ సెకండాఫ్ అయినా ఆసక్తికరంగా ఉంటుందా అంటే.. చచ్చీ చెడీ.. రెండుగంటల రెండు నిమిషాలు నిడివి కాబట్టి.. ఆ నిడివికి తగ్గట్టుగా సీన్లను పేర్చుకుంటూ పోవాలి కాబట్టి అన్నట్టుగా ఏ మాత్రం కథ, కథనాలతో సంబంధం లేకుండా సీన్లను పోర్చుకుంటూ పోయారు. తలాతోకా లేని సీన్లతో చిరాకు తెప్పించారు. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. అసలు ఏం జరుగుతుందో.. ఏం చెప్పాలనుకుంటున్నార్రా బాబూ అనే గందరగోళంలో పడేశారు.
నిఖిల్ సినిమా మొత్తం సింగిల్ ఎక్స్ ప్రెషన్స్‌తోనే చిరాకు తెప్పించాడు. ఇక యాక్షన్ సీన్లలో అయితే మరీ దారుణం. ఓ ఫైట్ సీన్‌లో బెంచ్‌పై ఒక వ్యక్తి కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ పేపర్‌ని తీసుకుని.. గుడ్రంగా చుట్టి దాంతో విలన్లను ఎరిగిపడేట్టుగా కొట్టేస్తాడు హీరో. ఇంకోసీన్‌లో.. ఓ మహిళ మెడలో చైన్ లాక్కుని స్పోర్ట్స్ బైక్‌పై ఇద్దరు పారిపోతుంటే.. మన హీరో స్కూటీపై వెళ్లి వాళ్లను వెంటాడి పట్టేసుకుంటాడు. ఆ స్కూటీ కూడా హీరోయిన్‌దే. ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి.
దివ్యాన్షి కౌశిక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పర్వాలేదు. సత్య లాంటి ఎనర్జిటిక్ కమెడియన్ ఉన్నా.. ఉపయోగం ఏం లేదు అన్నట్టుగా సరిగా వాడుకోలేకపోయారు దర్శకుడు. లండన్‌లో డాన్‌గా జాన్ విజయ్‌ని విలక్షణ పాత్రలో చూపించాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. అతనికి నమ్మిన బంటుగా ఉన్న అజయ్.. మున్నా పాత్రలో కాస్తో కూస్తో పర్వాలేదు. ఇక కమెడియన్‌లుగా సత్య, సుదర్శన్, వైవా హర్ష లాంటి వాళ్లు ఉన్నా.. నవ్వులు పండలేదు.
టెక్నికల్ పరంగా చూస్తే.. లండన్‌లో చిత్రీకరించారు కాబట్టి.. సినిమాకి రిచ్ నెస్ వచ్చింది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సాంగ్స్ పరంగా.. ఈ పాట బాగుందే, ఈ పాట పిక్చరైజేషన్ బాగుందే అనడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. పాట వస్తే చాలు.. అబ్బో మళ్లీ పాట వచ్చేసిందా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక ఫైట్స్ అయితే మరీ దారుణం. పాత సినిమాల్లో నేను కొడతా నువ్వు ఎగిరిపడు అనేట్టుగానే ఉన్నాయి. సన్నీ ఎమ్ ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ భరించడం కూడా కష్టంగా అనిపించింది. మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని సవాల్ చేస్తుంది.