ఆరు సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత మూడున్నర సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ కు తగిన సినిమాతో రావాలనే ఉద్దేశంతో పాన్ ఇండియా సబ్జెక్ట్ ను, దర్శకుడిగా కొరటాల శివను ఎంచుకున్నాడు. జాన్వీకపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, మురళీశర్మ, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు.
కథ నేపథ్యం:
సముద్రతీరంలో ధైర్యంతో బతికే వాళ్లకి భయాన్ని చూపించే ఉగ్ర నరసింహుడే ఈ ‘దేవర’ (ఎన్టీఆర్). 80, 90వ దశకం నేపథ్యంలో జరిగే ఈ ఫిక్షన్ కథ.. శివమ్ (అజయ్) అనే పోలీసు అధికారి యతి అనే గ్యాంగ్ స్టార్‌ని పట్టుకోవడంతో మొదలౌతుంది. ఏపీ తమిళనాడు బోర్డర్లో అక్రమాలకు తెరతీస్తున్న గ్యాంగ్ స్టార్ యతిని పట్టుకోవడానికి వెళ్తాడు శివమ్. అనూహ్యంగా అతనికి సింగప్ప (ప్రకాష్ రాజ్) పరిచయం అవుతాడు. అతని ద్వారా సముద్రపు దొంగ దేవర (ఎన్టీఆర్) తెగువ గురించి తెలుసుకుంటాడు.
దర్శకుడు కొరటాల శివ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఎన్టీఆర్ పాత్ర పరిచయం చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ తోపాటు సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. సముద్రంలోని ఓడలపై కంటైనర్లు దొంగిలిస్తుంటారు ఎన్టీఆర్, సైఫ్. అయితే ఈ జీవితం వద్దనుకుంటాడు ఎన్టీఆర్. కావాలనుకుంటాడు సైఫ్ అలీఖాన్(భైర). ఆయుధాల కోసం దేవర, భైర మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇద్దరూ సమఉజ్జీలుగా నటించారు. సినిమా మొదటి భాగంలో ఉండేంత ప్రభావం రెండోభాగంలో కనిపించదు. క్లైమాక్స్ కు ముందు వచ్చే మలుపు ముందుగానే తెలిసిపోతుంది. అయితే వాటికి ముందు వచ్చే ఫైట్లు, వాటిని సముద్రంలో తీయడం బాగుంది. దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగంలో చూడాలి.
ఎర్రసముద్రానికి ఎదురెళ్లి.. తాము చేసే దొంగతనం వల్ల ఆ ఊరికి.. దేశానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకున్న దేవర.. ఒక సంఘటనతో మనసు మార్చుకుంటాడు. తన ముఠా సభ్యుల్ని లూటీలు చేయొద్దని హుకూం జారీ చేస్తాడు. అది నచ్చని భైరా (సైఫ్ అలీ ఖాన్) దేవరకు ఎదురుతిరుగుతాడు. భైరా, దేవర వైరం ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ క్రమంలో దేవర కొడుకు వర (చిన్న ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అతను కథను ఏ విధంగా మలుపు తిప్పాడు? ఇందులో తంగం (జాన్వీ కపూర్) పాత్ర ఏంటి? అన్నదే ‘దేవర’ అసలు కథ.
ఆసక్తికరంగా :
కొరటాల సినిమాల్లో మెసేజ్ మస్ట్. ఇందులో కూడా సందేశం ఉంది. మనిషి బతకడానికి ధైర్యం ఉండాల్సిందే.. అయితే అది బతకడానికే తప్పతే ఎదుటి మనిషిని చంపడానికి కాదు అన్న కోణంలో ‘దేవర’ కథను అల్లాడు కొరటాల. ఎర్ర సముద్రంపై తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణచివేసే భయంగా ‘దేవర’ను చూపించారు. కాన్సెప్ట్ ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎర్రసముద్రం చుట్టూ అల్లిన కథలో.. సముద్రానికి అలలు మాదిరిగానే ‘దేవర’ కథ కూడా పడుతూ లేస్తూ సాగింది. కథను మొదలుపెట్టిన తీరు.. తొలి 20 నిమిషాలు కథానాయకుడ్ని చూపించకుండానే కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం బాగుంది.
ఇక దేవర ఎంట్రీ తరువాత వేగం పుంజుకుని.. ఇంటర్వెల్ సీన్‌తో హైప్ తీసుకొచ్చారు. సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్.. ఆయుధాల్ని దోపిడీ చేసే సీన్లు.. ఆకట్టుకుంటాయి. ఆచార్యని పక్కనపెడితే.. కొరటాల సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుంది. ఊరుకోసం ఏదోటి చేయాలి లేదంటే లావైపోతాం అన్న మాదిరిగానే.. ఊరు బాగు కోసం రక్తపుటేరులు పారించి.. చిన్న మెసేజ్‌ని కూడా జతచేశాడు కొరటాల. ఎన్టీఆర్‌ని జూనియర్, సీనియర్‌గా రెండు విలక్షణ పాత్రల్లో మాస్ ఎలిమెంట్స్ జోడించి చూపించిన విధానం బాగుంది.
ఎమోషన్స్ కీలకం:
కొరటాల కథలో ఎమోషన్స్ కీలకం. ఒక సాధాసీదా కథకి సైతం ఎమోషన్స్ జోడించి ఆడియన్స్‌కి కనెక్ట్ చేయడంలో దిట్ట కొరటాల. అయితే దేవర కథని ఓ రేంజ్లో చెప్పాలని చూసినా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేటంత ఎమోషన్స్ కనిపించవు. ఎర్రసముద్రానికి ఎదురెళ్లి దోపిడీలు చేయడం.. తిరిగి రియలైజ్ అవ్వడం వరకూ ఓకే. కానీ.. ఎవరికి కనిపించకుండా వెళ్లిపోవడానికి రీజన్‌ని సెకండాఫ్‌కి దాచేసి.. ఫస్ట్‌పై పెదవి విరుపులు వచ్చేట్టు చేశారు. ఏముంది కథలో అని తీసిపాసేట్టుగా కాకుండా.. ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేదే అనేట్టు చేశారు. కథలో మంచి స్టఫ్ ఉన్నా.. కొరటాల పూర్తి స్థాయిలో మార్క్ చూపించలేకపోయారనేది మాత్రం వాస్తవం.
హీరోయిన్ జాన్వీకపూర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు కొరటాల. ఇది కేవలం గ్లామర్ పరిధి ఉన్న పాత్ర. దేవరని ఢీ కొట్టే క్రూరుడిగా సైఫ్ అలీఖాన్ విలనిజం పండించారు. ఎన్టీఆర్‌కి మిత్రుడిగా.. తంగంకి తండ్రిగా శ్రీకాంత్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు. ఇక కేజీఎఫ్ రేంజ్లో ‘దేవర’ కథను చెప్పే పాత్రలో కనిపించాడు ప్రకాష్ రాజ్. అజయ్, మురళిశర్మ, అభిమన్యుసింగ్.. ఇలా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లు చాలామందే ఉన్నారు. హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్‌లో హరితేజ, హిమజలు కనిపించారు. ఉన్నంతలో బాగానే చేశారు వీళ్లిద్దరూ. గెటప్ శ్రీను పాత్ర ఉన్నా.. కామెడీ పరంగా పెద్దగా సెటప్ చేయలేదు కొరటాల.
విజువల్ ట్రీట్ :
రత్నవేలు విజువల్ ట్రీట్ సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్సులకు పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నిడివిని మూడు గంటల పాటు పెంచినట్టే అనిపిస్తుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తెరేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్‌పై సందేహాలు కలిగాయి కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో న్యాయం చేశాడు. చుట్టమల్లే సాంగ్ వినడానికే కాదు.. చూడ్డానికి కూడా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్‌కి అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయ్యింది.
ఓవరాల్‌గా.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. సీనియర్ ఎన్టీఆర్‌ని ‘దేవర’ కథ చెప్పు నాన్నా అని అంటాడు. ‘తరువాత తరానికి చెప్పుకునే గొప్ప కథ కాదురా మీ నాయన కథ’ అని అంటాడు సీనియర్ ఎన్టీఆర్. ఆ డైలాగ్‌లోనే దేవర రిజల్ట్ ఉంది. దేవర.. తరువాత తరానికి చెప్పుకునేటంత గొప్ప కథ కాదు కానీ.. చెత్త కథ అయితే కాదు. ఓసారి చూడొచ్చు.