తెలుగు సినిమాల్లో క్రైం థ్రిల్లర్లకు కొదవులేదు. తాజాగా గురువారం ఇదే జానర్ లో మరో సినిమా విడుదలైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా పేరు “హంట్’. ఈ సినిమా ని సమీక్షించుంటే విశేషాలు ఇవీ..!
పోలీస్ ఆఫీసర్స్ అర్జున్ (సుధీర్ బాబు), మోహన్ భార్గవ్ (శ్రీకాంత్), ఆర్యన్ దేవ్ (భరత్) మంచి స్నేహితులు. డ్యూటీలో భాగంగా కశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఎన్నో ఆపరేషన్లను అర్జున్ తన స్నేహితులతో నిర్వహిస్తారు. సాఫీగా సాగుతున్న సమయంలో ఆర్యన్ దేవ్ మర్డర్ అవుతాడు. ఆర్యన్ మర్డర్ కేసు దర్యాప్తు అర్జున్‌కు అప్పగిస్తారు. ఆర్యన్ దేవ్ మర్డర్ చేసింది ఎవరనే విషయం తెలిసిన తర్వాత అర్జున్ రోడ్ యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మరిచిపోతాడు.
గతం మరిచిపోయిన అర్జున్ కేసు దర్యాప్తును ఎలా పూర్తి చేశాడు? అర్యన్ దేవ్ మర్డర్ కేసు దర్యాప్తు ఎలా జరిగింది? ఆర్యన్ దేవ్ మర్డర్ ఎలా జరిగింది? ఆర్యన్ దేవ్ మరణం వెనుక కుట్ర ఎవరిది? కేసు దర్యాప్తులో అర్జున్‌కు ఎలాంటి వాస్తవాలు తెలిసాయి? గతం మరిచిపోయిన అర్జున్ మామూలు మనిషి అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే హంట్ సినిమా కథ.
ఆర్యన్ దేవ్ మర్డర్ దర్యాప్తు అంశంతో అర్జున్ను ఇంట్రడ్యూస్ చేసి కథ ఇంట్రస్టింగ్‌గా మొదలవుతుంది. వెంటనే అర్జున్ యాక్సిడెంట్ గురై గతాన్ని మరిచిపోయారనే పాయింట్ మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి వెళ్లిపోవడం చకచకా జరిగిపోతాయి. అయితే మర్డర్ మిస్టరీలో ఉండాల్సిన వేగం కథలో కనిపించకుండా స్లోగా సాగిపోతుంది.
అర్జున్, ఆర్యన్, మోహన్ మధ్య ప్రెండ్ షిప్ ఎస్టాబ్లిష్ మెంట్ చేయడానికి కొంత ఎక్కువ సమయమే తీసుకోవడం కథలో ఉండే ఇంటెన్సిటీని, వేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే స్టైలిష్ మేకింగ్, థ్రిల్లింగ్‌గా ఉండే యాక్షన్ సీన్లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో చోటు చేసుకొనే ట్విస్టులు ఆసక్తికరంగా సాగుతాయి. ప్రీ క్లైమాక్స్ ముందు రివీల్ అయ్యే ట్విస్టు షాకింగ్‌గా ఉంటుంది. చివరి 10 నిమిషాల్లో సుధీర్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉండటంతో ఓ డిఫరెంట్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ యాక్షన్ థ్రిల్లర్ కావాల్సిన వేగం కథనంలో లేకపోవడం వల్ల ఫస్టాఫ్ సాగదీసినట్టు ఉంటుంది. ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్ల మధ్య ఎమోషన్స్ ప్రజెంట్ చేసిన తీరు బాగుందనిపిస్తుంది. సెకండాఫ్‌ను డీల్ చేసిన విధానం డైరెక్టర్ ప్రతిభకు అద్దం పడుతుంది.
అర్జున్ పాత్రను, అలాగే హంట్ సినిమాను ఒప్పుకొన్న తీరు చూస్తే సుధీర్ బాబు ఒక ఇమేజ్‌లో అర్జున్ ఏ, అర్జున్ బీ అనే రెండు వేరియషన్స్ ఉన్న క్యారెక్టర్లో సుధీర్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. గతం మరిచిపోయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. అర్జున్ క్యారెక్టర్‌కు సంబంధించిన కీలక ట్విస్టు తర్వాత సుధీర్ బాబు ఫెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు. క్లైమాక్స్‌ను సుధీర్ తన నటనతో ఎమోషనల్‌గా మార్చారని చెప్పవచ్చు.
మోహన్‌గా శ్రీకాంత్, ఆర్యన్గా భరత్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. శ్రీకాంత్ ఈ సినిమాకు గైడింగ్ ఫోర్సులా కనిపిస్తే.. భరత్ ఎమోషనల్ పాయిట్గా మారారని అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్గా మౌనిక రెడ్డి, మూర్తి పాత్రలో గోపరాజు రమణ, పోలీసుగా జెమినీ సురేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. చిత్ర శుక్లా ఓ స్పెషల్ రోల్లో ఎమోషనల్‌గా కనిపించారు. అప్సర రాణి ఐటెమ్ సాంగ్‌లో గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకొన్నది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. జిబ్రాన్ తన బీజీఎంతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ ఎసిసోడ్స్, ఎమోషనల్ సీన్లను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ప్రవీణ్ పూడి, ఇతర విభాగాలు ఫర్వాలేదనిపిస్తాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌కు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమా క్లాస్‌గా, రిచ్‌గా తెరకెక్కించిన విధానం బాగుంది.
ఫైనల్‌గా హంట్ సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్, రొటీన్ పోలీస్ డ్రామా కానే కాదు. అలాగే రొటీన్ మర్డర్ మిస్టరీ కాదు. అయితే తెలుగు సంప్రదాయ సినిమా మేకింగ్‌కు భిన్నంగా సుధీర్ బాబు చేసిన రిస్క్, ప్రయోగంగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు వచ్చే ట్విస్టు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
కొత్త తరహా, ప్రయోగాత్మక చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. సుధీర్ బాబు చేసిన బోల్డ్ అటెంప్ట్‌కు మంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. థియేట్రికల్‌గా కమర్షియల్ సక్సెస్ అనే విషయం కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే. రెగ్యులర్, రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చూడాలనే వారు హంట్ సినిమాను ఎంచుకోవచ్చు.
నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్, చిత్ర శుక్లా, అప్సర రాణి తదితరులు
దర్శకత్వం: మహేష్ సూరపనేని
నిర్మాత: వీ ఆనంద ప్రసాద్
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫి:
ఎడిటింగ్:
బ్యానర్: భవ్య క్రియేషన్స్