పొలిటికల్ థ్రిల్లర్ ఎల్ 2: ఎంపురాన్


ఆరేళ్ళ క్రితం మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ‘లూసిఫర్’ కేవలం మలయాళ ప్రేక్షకులకే కాదు… ఇతర భాషల వారికీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అందుకే ఏరి కోరి చిరంజీవి ఆ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేశారు. మాతృక స్థాయిలో ‘గాడ్ ఫాదర్’ లేకపోవడంతో పరాజయాన్నీ మూట గట్టుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు ‘లూసిఫర్’ సీక్వెల్ గా వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’ జనం ముందుకు వచ్చింది. దీనిని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు.

మొదటి చిత్రం ‘లూసిఫర్’ ఎక్కడ ఆగిందో దాదాపు అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేరళ సీఎం పీకే రాందాస్ (సచిన్ ఖేడేకర్) హఠాన్మరణంతో అతని కుటుంబ పరిస్థితే కాదు… రాజకీయ పరిస్థితి కూడా అనిశ్చిత స్థితిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఖురేషీ అబ్ రామ్ అక్కడ ప్రత్యక్షమై వాటిని చక్కదిద్ది… పీకే రాందాస్ కొడుకు జతిన్ రాందాస్ (టోవినో థామస్) ను సీఎంను చేసి, అక్కడ నుండి నిష్క్రమిస్తాడు. ఇది లూసిఫర్ కథ.

ఐదేళ్ళ పాటు అధికారానికి అలవాటు పడిపోయి… తానూ అవినీతి పరుడిగా మారిపోయిన జతిన్ రాందాస్ తనే ఓ కొత్త పార్టీని పెట్టాలని భావిస్తాడు. ఆర్థికంగా బలం కోసం కేంద్రంలోని ఓ మతతత్త్వ పార్టీతో చేతులు కలుపుతాడు. తమ్ముడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని అక్క ప్రియ (మంజు వారియర్) తిరస్కరిస్తుంది. తండ్రి నేతృత్వం వహించిన పార్టీ నాయకురాలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలను కుంటుంది. తోడబుట్టిన అక్క అని కూడా చూడకుండా… ఆమె అడ్డు తొలగించాలని జతిన్ రాందాస్ భావిస్తాడు. ఆమెను కాపాడటం కోసం ఈసారి అడగకుండానే కేరళకు రావాల్సిన పరిస్థితి ఖురేషీకి ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న ఖురేషీకి మిత్రదేశాలు ఏవి? శత్రుదేశాలు ఏవి? వాటి ఎత్తులు పైఎత్తులను తట్టుకుని ఎలా మనుగడ సాగించాడనేది ఓ అంశమైతే… గుజరాత్ అల్లర్లలో కుటుంబాన్ని కోల్పోయి పగతో రగిలిపోతున్న జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ను సక్రమ మార్గంలో పెట్టి, అతని పగ తీర్చుకోవడానికి ఖురేషీ ఎలా సహకరించాడు? అనేది మరో అంశం.

విశ్లేషణ:
పగ ప్రతీకారాలు, రాజకీయ పరమైన కుతంత్రాలు, మతతత్త్వ పార్టీలతో వచ్చే ముప్పులు… వీటిని బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నారు. కేరళ ఈ కథకు కేంద్ర బిందువే అయినా… ఆ ప్రాంతాన్ని శాసించాలనుకున్న జాతీయ పార్టీని ఆసక్తికరంగా దీనిలో మిళితం చేశారు. దానికి తోటు సబర్మతి రైలు దహనం… తదనంతరం గుజరాత్ లో జరిగిన అల్లర్లు… ఆ సమయంలో కుటుంబాన్ని కోల్పోయిన ఓ ముస్లిం యువకుడి ఆక్రోశం… దీనిని ‘ఎంపురాన్’కు పునాదిగా తీసుకున్నారు. కేరళలోని సోదరి కాని సోదరికి అండగా నిలిచినట్టుగానే ఖురేషీ… ఈ ముస్లిం యువకుడి పగ తీర్చుకోవడానికి బాసటగా నిలిచినట్టు చూపించారు.

మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ద్వారా పలు అంశాలను తెర మీద చూపించాలని దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ తాపత్రయ పడ్డాడు. అయితే… వాటిని హృదయానికి హత్తుకునేలా చూపించడంలో విఫలమయ్యాడు. దాంతో ఇది ఆత్మలేని సినిమాగా మిగిలిపోయింది. గుజరాత్ అల్లర్లు, కేరళలోని రాజకీయ పార్టీల లుకలుకలతోనే ప్రథమార్ధంలోని అధిక భాగం సాగిపోయింది. మోహన్ లాల్ ఎంట్రీ కూడా సినిమా మొదలైన గంటకు జరిగింది. అక్కడ నుండి ఓ అరగంటకు చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ వేశారు. విదేశాల్లో మాయమై కేరళలో ప్రత్యక్షమైన ఖురేషీ… ఇక్కడ ఏం చేశాడనేది ద్వితీయార్థంలో చూపించారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏదో రకమైన హింసను తెర మీద వరదలా పారించారు. చాలా సందర్భాలలో దానికో అర్థం పరమార్థం అనేది లేకుండా పోయింది. అయితే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉన్నాయి.

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అభిమన్యు సింగ్, మంజు వారియర్, టొవినో థామస్, ఫాజిల్, సూరజ్, కిశోర్ తదితరులంతా అనుభవం ఉన్న నటీనటులు కావడంతో తమ పాత్రలను బాగానే పోషించారు. కానీ వాళ్ళ పెర్ఫర్మెన్స్ ఎక్కడా థియేటర్ లోని ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా లేదు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాను డబ్ చేసిన విధం సరిగా లేదు. చాలా చోట్ల లేఖలు మలయాళంలోనే ఉన్నాయి. అసలు స్టీఫెన్ నెడుంపల్లి ఉరఫ్ ఖురేషీ అబ్ రామ్ నేపథ్యం ఏమిటనే ప్రశ్న ప్రేక్షకులలో అలానే ఉండిపోయింది… దానిని తీర్చడం కోసమే ‘ఎల్ 3: ఎంపురాన్’ ది బిగినింగ్ ఉండబోతోందని మేకర్స్ తెలిపారు.

Scroll to Top