మరో బొమ్మరిల్లు…మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్!
మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని సరైన హిట్ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నాడు. అలాంటిది అతడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేనే మీకు ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఎంతో ధైర్యంగా మాటిచ్చాడు. మరి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ద్వారా ఆ మాటను నిలబెట్టుకున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లోనే రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
కథ:
హర్ష(అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటాడు. తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ(పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాలనుకుంటాడు. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్‌ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఇక చూపించిందే చూపించి జనాలకు విసుగు పుట్టించాడు డైరెక్టర్. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు రాక మానదు. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించినా రానురాను.. ఇవి ఇంకా అయిపోలేదా? అని ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు. ప్రేమ, రొమాన్స్‌కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది.
ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించక మానదు. సెకండాఫ్‌లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతిదాన్ని సాగదీసి ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహకందనంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తారు. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. అయితే సినిమాను మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్, గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బొమ్మరిల్లు, షాదీ ముబారక్‌లను మిక్స్ చేస్తే వచ్చిన మిశ్రమ ఫలితంలా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తొలి తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. టెక్నికల్‌గా సినిమా బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కొంతమేరకు సంభాషణలు ఆకట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్‌లా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు.
నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు
నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ