హీరో సత్యదేవ్, ‘కృష్ణమ్మ’ అనే తాజా యాక్షన్ మూవీతో వచ్చాడు. దీనికి వివి గోపాలకృష్ణ కొత్త దర్శకుడు. అగ్రదర్శకుడు కొరటాల శివ సమర్పణ. అగ్ర బ్యానర్లు మైత్రీ మూవీస్, ప్రైమ్ షో ఎంటర్టయిన్మెంట్స్ పంపిణీ దారులు. ఈరోజు నుంచీ అమెజాన్ ప్రైంలో ఆసక్తి రేపుతున్న ఈ సమ్మర్ మూవీ ఎలా వుందో చూద్దాం.
కథ:
విజయవాడ వించిపేటలో భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ తేజా రెడ్డి), కోటి (మీసాల లక్ష్మణ్) ముగ్గురూ అనాథలుగా పెరుగుతారు. భద్ర, కోటి గంజాయి స్మగ్లింగ్ పనులు చేస్తూంటే, శివ ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ మిత్రులిద్దర్నీ స్మగ్లింగ్ మానేయమని చెబుతూ వుంటాడు. ముగ్గురికీ కుటుంబం వుండాలనిపిస్తుంది. శివ మీనా (అతిరా రాజ్) తో ప్రేమలో పడితే, భద్ర పద్మ(అర్చనా అయ్యర్) ని ప్రేమిస్తాడు. స్మగ్లింగ్ మానేసి ఆటో నడపడం మొదలెడతాడు. ఒక రోజు మీనా తల్లి ఆపరేషన్ కి రెండు లక్షలు అవసరపడతాయి. దీంతో చివరిసారిగా భారీగా గంజాయి స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే పోలీసులకి చిక్కి రేప్ అండ్ మర్డర్ కేసులో అరెస్టయిపోతారు. అయితే కేసెమిటో తెలియకుండానే తామే చేశామని ఒప్పేసుకుంటారు.
ఇలా ఎందుకు ఒప్పుకున్నారు? తమలో ఒకడు ఎందుకు చనిపోయాడు? రేప్ అండ్ మర్డర్ కి గురైన అమ్మాయి ఎవరు? ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డ అసలు నేరస్థుడెవరు? మిగిలున్న ఇద్దరూ ఈ కేసులోంచి ఎలా బయటపడ్డారు? మిత్రుడి చావుకి ఎలా పగదీర్చుకున్నారు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది?:
కథ కొత్త కథేమీ కాదు, చెయ్యని నేరం లోంచి బయటపడి ప్రతీకారం తీర్చుకునే ఫార్ములా కథే. కాకపోతే కొన్నేళ్ళ క్రితం విజయవాడ సమీపంలోని ఇబ్రహీం పట్నం హాస్టల్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ సంఘటన గుర్తొచ్చేలా, అలాగే గుంటూరు నేపథ్యంలో వెట్రిమారన్ తీసిన ‘విసారణై’ సినిమా గుర్తొచ్చేలా మాత్రం వుంటుంది. పోలీసులు ఈజీగా ఇరికించడానికి దొరికే చిల్లర నేరగాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలిపే కథ. దీన్ని విజయవాడ నేపథ్యంలో స్లమ్ కథగా చూపించడంతో నేటివిటీకి మంచి అవకాశమేర్పడింది. పాత్రలు మూడూ వూర మాస్ క్యారక్టర్లే. అయితే జరిగిన లోపమేమిటంటే, ముగ్గురు మురికి వాడల అమాయకుల్ని పోలీసులు కేసులో ఇరికిస్తే, అందులో ఒకడు చనిపోవడంతో రివెంజీ కథగా మారిపోవడం. దీంతో ఇది కృత్రిమ ఫార్ములా మసాలా సినిమా అయిపోయింది. విశారణై’ లో ఈ అవకాశముండదు. పోలీసులు చిల్లర నేరస్థుల్నిఒక పెద్ద కేసులో ఇరికించిన తర్వాత, ఈ గుట్టు బయపడ్డంతో ముగ్గుర్నీ చంపి పారేస్తారు ఎన్ కౌంటర్ పేరుతో. అవినీతి వ్యవస్థ ఇలా వుంటుంది. దీన్నిమీద రివెంజి తీసుకోవడం గీసుకోవడం వుండదు తీస్తున్నది రియలిస్టిక్ సినిమా అయితే. ‘కృష్ణమ్మ’ ని రియలిస్టిగ్గా తీస్తూ ఫార్ములా కథ వాడేశారు. దీంతో ఏం జరిగిందంటే, కథలో ఒరిజినల్ ఎమోషన్స్ దెబ్బతినిపోయాయి. చెయ్యని నేరానికి ముగ్గురు అరెస్టవడమన్నది దయనీయ స్థితి. ఇలా వీళ్ళు ఎలా బయటపడతారా అన్న ఒరిజినల్ గా కథలోంచి పుట్టిన బలమైన సానుభూతి, ఎమోషన్స్ వగైరా కట్టి పడేసినప్పుడు, ముగ్గుర్లో ఒకడు చనిపోయి రివెంజి కథగా మారిపోతే, కథలోంచి ముందు పుట్టిన ఒరిజినల్ ఎమోషన్స్ తెగిపోయాయి. అంటే ప్రేక్షకులు మళ్ళీ ఎమోషన్స్ మార్చుకుని చూడాలి. ఇలా అతికించిన కొత్త ఎమోషన్స్ తో రివెంజీ ఫార్ములా కథగా మారిపోయాక చెప్పుకోవడానికేమీ లేకుండా పోయింది. రియలిస్టిక్ కథకి అవినీతి వ్యవస్థని స్లమ్ డాగ్స్ ఎదిరించేంత సీనేమీ వుండదు.
నటన- సాంకేతికాలు
సత్యదేవ్ కి నటించేందుకు మంచి అవకాశమున్న పాత్ర దక్కింది. తను విశాఖకి చెందిన వాడైనా పాత్ర ప్రకారం విజయవాడ భాష బాగా మాట్లాడాడు. వేష భాషలు, భావప్రకటనా రఫ్ గా వున్నాయి. హీరోయిన్ తో రోమాంటిక్ సీన్లు అంతగా రాణించకపోయినా, సెకండాఫ్ లో రివెంజీ మోడ్ లోకెళ్ళినప్పుడు ఆ ఎమోషన్స్ పైన చెప్పిన కారణాలతో కృత్రిమంగా మారిపోయాయి. గుర్తుంచుకో దగ్గ ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం ఒక లోటుగా అనిపిస్తుంది. మాస్ ని పెప్పించే యాక్షన్ సీన్స్ మాత్రం చేశాడు. హీరోయిన్ అతిరా రాజ్ పాత్ర చిన్నదే అయినా ఫర్వాలేదనిపించే నటన కనబర్చింది. సత్యదేవ్ ఫ్రెండ్స్ గా కృష్ణ తేజా రెడ్డి, మీసాల లక్ష్మణ్ లతో పాటు పోలీసాఫీసర్ గా నటించిన నందగోపాల్ కీ మంచి పాత్రలు దక్కాయి. సాంకేతిక విలువల్లో సన్నీ కూరపాటి కెమెరా వర్క్ తో చాలా కాలం తర్వాత విజయవాడ లొకేషన్స్ లో అక్కడి నేటివ్ ఫీల్ ని పట్టుకుంది. కాలభైరవ సంగీతంలో పాటలు నిలబడక పోయినా నేపథ్య సంగీతం బలంగా వుంది. బ్యానర్ నిర్మాణ విలువలుకూడా ఉన్నతంగా వున్నాయి. కొత్త దర్శకుడు ఒక రియలిస్టిక్ కథతో మొదటి ప్రయత్నం చేయడం అభినదించదగ్గది. అయితే ఇందులో ఫార్ములా హంగులు జొరబడ్డం వల్ల రొటీన్ సినిమా ప్రమాణాలకి మించి ఎదగలేక పోయింది.
రచన -దర్శకత్వం : వి వి గోపాల కృష్ణ.
తారాగణం : సత్యదేవ్, అతిరా రాజ్, అర్చన, కృష్ణ తేజా రెడ్డి, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె తదితరులు. సంగీతం : కాల భైరవ,
ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి,
బ్యానర్ : అరుణాచల క్రియేషన్స్,
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి.