యాక్షన్ ఎంటర్టైనర్ వీర ధీర శూర


చియాన్ విక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర ధీర శూర
‘తంగలాన్‌’ తర్వాత చియాన్‌ విక్రమ్‌ నుంచి వచ్చిన చిత్రం ‘వీర ధీర శూర’. ఎస్‌.యు అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ కథానాయిక. పృథ్వీ, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రధారులు. రివేంజ్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే రెండో భాగాన్ని మొదట విడుదల చేశారు.

కథ:
కాళీ (విక్రమ్‌), తన భార్య వాణి (దుషారా విజయన్‌) చిన్న కిరణా కొట్టు నడుపుకుంటూ జీవితం సాగిస్తారు. అయితే కాళీకి మరో కథ ఉంటుంది. అందులో రవి (పృథ్వీ రాజ్‌) కొడుకు కన్నా (సూరజ్‌ వెంజరమూడు)లకు అనుచరుడుగా ఉంటాడు కాళీ. గతాన్ని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయితే పాత కథలో రవి, కన్నా… ఇద్దరినీ ఎన్‌కౌంటర్‌ చేయాలనుకుంటాడు ఎస్పీ అరుణగిరి (ఎస్‌.జె. సూర్య). తెల్లవారేలోపు ఆ ఎన్‌కౌంటర్‌ అయిపోవాలి.. లేదంటే తండ్రీ కొడుకు ఇద్దరూ ఆనందంగా బయట తిరగగలరు. అలా జరగకుండా ఒక్క నైట్‌లో ఇద్దరినీ లేపేయాలని పక్కా ప్రణాళిక రాస్తాడు ఎస్పీ. కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత సాయం కోసం వచ్చి కాళ్లు పట్టుకుంటాడు రవి. అతను అలా చేయడానికి కారణం ఏంటి? రవి కోరిన సాయం ఏంటి? అసలు ఎస్పీ వారిద్దరినీ ఎన్‌కౌంటర్‌ ఎందుకు చేయాలనుకున్నాడు? పైనల్‌గా ఏం జరిగింది ఇదీ ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఒక్క రాత్రిలో సాగే కథ ఇది. రెండు భాగాలుగా తెరకెక్కిన సినిమాలను ఫస్ట్‌ పార్ట్‌ విడుదల చేసిన తర్వాత రెండో భాగాన్ని సీక్వెల్‌, ప్రీక్వెల్‌ పేరుతో విడుదల చేస్తారు. కానీ ఇక్కడి రెండో భాగాన్ని తొలుత విడుదల చేశారు. దాంతో ప్రేక్షకులకు ఇలా ఎందుకు చేశారా అనే ఆసక్తి కలిగింది. సినిమా మొదలు మాత్రం ఎస్పీ అరుణగిరి, రవి మధ్య ఉన్న వార్‌తో మొదలవుతుంది. ఎస్పీని చంపేయాలని రవి, తండ్రీ కొడుకులైన రవి, కన్నాలను ఎన్‌కౌంటర్‌ చేయాలని ఎస్‌పీ అరుణగిరి ప్లాన్‌ చేసే సీన్‌తో సినిమా మొదలవుతుంది. ప్రాణ భయంతో రవి కోరిన సాయం చేయడానికి కాళీ అంగీకరించడం. ఆ తర్వాత సన్నివేశాలన్ని ఆసక్తిగా సాగుతాయి. తదుపరి ఫ్లాష్‌బ్యాక్‌తో కాళీ గతంలో ఏంటో కొంత మేర తెరపైకి వస్తుంది. తెరపై కనిపించని దిలీప్‌కీ కాళీకి సంబంధం ఏంటి? అప్పటికే పెళ్లయి బిడ్డ ఉన్న వాణిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అన్నది చూపించలేదు. తెరపై కనిపించని దిలీప్‌ అనే పాత్ర, అతని మరణం చుట్టూ కథ నడిచింది. అతను ఎవరు? ఏంటి? డాన్‌ లాంటివాడా? లేదా అనుచరుల్లో బలమైన వాడా? గొప్ప స్నేహితుడా? అన్నది చెప్పకుండా అతని పాత్రతోనే రివేంజ్‌ డ్రామాను నడిపాడు దర్శకుడు అయితే అవన్నీ మొదటి పార్ట్‌లో రివీల్‌ చేయడం కోసం దర్శకుడు జస్ట్‌ ఇంట్రో ఇచ్చి వదిలేశాడు. సెకెండాఫ్‌లో కాళీ, అరుణగిరి, కాలీ – కన్నాల మధ్య కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి. ఒక్కోసారి కథ నుంచి డైవర్ట్‌ అవుతున్నాం అనిపించినా ఏదో ఒక్క పాత్ర అటువైపు మళ్లకుండా కథలోనే ఉంచేలా చేశాయి. అయితే అరుణగిరి పాత్ర, అతని తీరు, కథనం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది.

నటీనటుల విషయానికొస్తే..
పాత్ర ఏదైన అందులోకి పరకాయ ప్రవేశం చేయడం చియాన్‌ విక్రమ్‌కు మొదటి నుంచి అలవాటే. పాత్ర గ్లామర్‌ అయినా మట్టి సువాసన ఇచ్చే పాత్ర అయినా వంద శాతం ఎఫర్ట్‌ పెడతారాయన. ఇందులోనూ అంతే. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే విధ్వంసం సృష్టించినట్లు నటించారు. దిలీప్‌ మరణం తర్వాత పోలీసులపై, పెద్దాయన అని పిలవబడే ఓ వ్యక్తి ముందు విజృంభించి ప్రాణాలు తీయడంలో ఆయన నటన ప్రతిభ కనిపించింది. ఈ మధ్యన బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిస్ట్‌ల్లో ఎస్‌జే సూర్య ఒకరు. ఇందులోనూ మంచి పాత్ర దక్కింది. అవకాశవాది పాత్రలో మరోసారి చప్పట్లు కొట్టించేలా నటించారు. అతని డైలాగ్‌ డిక్షన్‌ బావుంది. అయితే ఇందులో ఆయనది సీరియస్‌ రోల్‌ కావడం నవ్వించే స్కోప్‌ లేదు. కానీ అతను పలికిన కొన్ని డైలాగ్‌లు, మేనరిజం విషయంలో నవ్వించాడు. ఎన్‌ కౌంటర్‌ ఎలా చేసి బుల్లెట్‌ దించాలో చెప్పిన సన్నివేశం బావుంది. కన్నా పాత్రలో సూరజ్‌ వెంజరమూడు అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశాల్లో ప్రేక్షకుల్ని సీట్‌ నుంచి కదలకుండా చేశాడు. అతనికిది మంచి పాత్ర అని చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న థర్టీ ఈయర్స్‌ పృధ్వీకి బలమైన పాత్ర దక్కింది. మాటలతోనే తను పవర్‌ఫుల్‌ అనిపించేలా నటించారు. వాణి పాత్రలో చేసిన దుఫారా విజయన్‌ నటన బావుంది. తెరపై ఆమె సహజంగా నటించింది. నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఆమె ఎంచుకుంటుంది అనడానికి వాణి పాత్ర నిదర్శనం. అయితే ఆమె పాత్రకు ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంది. అది పూర్తిగా రివీల్‌ చేయకుండా ఓ బిడ్డ ఉన్నట్లు చూపించాడు. అది ఫస్ట్‌ పార్ట్‌లో చూడొచ్చు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న జీవీ ప్రకాశ్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. యాక్షన్‌, ఎమోషన్‌ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అదరగొట్టాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన అనువాద చిత్రాల్లో ఈ సినిమా చాలా క్వాలిటీగా ఉంది. పేర్లు నుంచి డబ్బింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక యాక్షన్‌ సన్నివేశాలకు పేరు పెట్టక్కర్లేదు. అప్పటి దాకా సైలెంట్‌గా ఉన్నా కాళీ పాత్ర రెండు మూడు యాక్షన్‌ సన్నివేశాల్లో హై మోమెంట్‌ ఇచ్చింది. ఊహించని ఆ యాంగిల్‌ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. ప్రసన్న జీకే ఫస్టాఫ్‌లో పెళ్లి సీన్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. అలాగే జాతర దగ్గర సీన్స్‌లో కూడా. ఈశ్వర్‌ కెమెరా పనితనం సినిమాకు ఎసెట్‌. కథానుగుణంగా నిర్మాణ విలువలు బావున్నాయి. ఎక్కడా క్వాలిటీ తగ్గలేదు. హింసాత్మక గతం ఉన్న ఓ వ్యక్తి మామూలు జీవితం గడుతుండగా మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లాల్పి వస్తే అన్న లైన్‌ మీద సాగే కథ ఇది. అయితే ఇది కొత్త కథేమీ కాదు.. దర్శకుడు చూపించిన తీరు బావుంది. రెండు ఫ్యామిలీల మధ్య సాగే ఈ కథలో ఇంకాస్త ఎమోషన్స్‌ జోడించి ఉంటే బావుండేది. ఇలాంటి కథలకు భావోద్వేగాలు సరైన పాళ్లల్లో జోడైతే రిజల్ట్‌ వేరేగా ఉంటుంది. ఒక రాత్రిలో సాగే కథ ఇది. ఈ తరహాలోనే కార్తి నటించిన ఖైదీ కూడా ఉంది. కథ, యాక్షన్‌ వంటి విషయాల్లో జనాలు ఆ సినిమాతో పోల్చుకునేలా ఉంది. ఆ ఒక్క పొరపాటు పక్కన పెడితే దర్శకుడు చెప్పాలనుకున్నది తన వేలో చెప్పుకెళ్లాడు. సినిమాను తెరకెక్కించడంలో కొత్తదనం చూపించాడు. యాక్షన్‌ సినిమాలు కోరుకునే వారికి ఈ చిత్రం నచ్చుతుంది. మిగతా పాత్రల పరిచయాలు, ప్రశ్నార్థకంగా ఉంచిన కొన్ని పాత్రలు సన్నివేశాల కోసం మొదటిపార్ట్‌ వచ్చేదాకా వేచి చూడాలి.