యుద్ధానంతర స్థితిని వివరించే సినిమా ….. కలియుగం -2064
యుద్దాల వల్ల ఆహార, నీటి కొరత ఏర్పడితే.. మానవుడు ఎలాంటి విపత్కర స్థితిలోకి వెళ్ళిపోతాడో తెలియజెప్పే సినిమా కలియుగం 2064…ప్రపంచ యుద్దం తర్వాత సంపన్న వర్గం రెసిడెంట్స్ అనే ప్రాంతాన్ని నిర్మించుకొంటారు. ఇక ఆకలికి అలమటించే పేదవాళ్లంతా లిబరేటర్స్‌గా ఓ రకమైన బానిసలుగా బతుకుతుంటారు. ఈ పరిస్థితుల్లో లిబరేటర్స్‌కు చెందిన భూమి (శ్రద్దా శ్రీనాథ్), మరో వ్యక్తి (కిషోర్) రెసిడెంట్స్ వర్గానికి చెందిన థామస్ (ఇనియన్ సుబ్రమణి) చేతిలో బందీలుగా మారిపోతారు.
రెసిడెంట్స్ అనే వర్గాన్ని ఎందుకు క్రియేట్ చేశారు? అలాగే లిబరేటర్స్‌ను ఎందుకు బందీలుగా మార్చారు? భూమిని థామస్ బంధించింది ఎందుకు? పేద వాళ్లను బందీగా చేసిన థామస్ టార్గెట్ ఏమిటి? భూమి, కిషోర్ ఎలాంటి వివక్షను అనుభవించారు? అసలు రతి ఎవరు? 2064 సంవత్సరంలో జరిగే సంఘటనలకు కల్కికి ఉన్న సంబంధం ఏమిటి? కల్కి వచ్చి రెసిడెంట్స్‌ను శిక్షించాడా? లిబరేటర్స్‌కు ఎలాంటి స్వేచ్ఛను భూమి కల్పించింది? అనే ప్రశ్నలకు సమాధానమే కలియుగమ్ 2064 సినిమా కథ. ప్రపంచ యుద్ధం తర్వాత ఆహారం కరువై, నీటి ఎద్దటి ఏర్పడితే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఓ యాక్షన్, థ్రిల్లర్‌ను ప్రమోద్ సుందర్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఏ సినిమాలోను టచ్ చేయని పాయింట్‌ను తీసుకొని ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం అందించాలనే తపన దర్శకుడిలో కనిపించింది. కానీ, కథ, కథనం, పాత్రల డిజైన్‌ను ఇంకా అర్ధవంతంగా చేసి ఉంటే.. డెఫినెట్‌గా ఫీల్ గుడ్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. బాగా బతుకాలనుకొనే వారు సాధారణ ప్రజలను బానిసలుగా చేసుకోవాలనుకొంటారనే పాయింట్‌ను తెర మీద ఆసక్తికరంగా చూపించాడు. భీకర యుద్దాల తర్వాత సాధారణ ప్రజలకు సంబంధించిన ఆహార భద్రతపై ఆలోచింప చేసే విధంగా సినిమాను రూపొందించారు.
విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొనే శ్రద్దా శ్రీనాథ్ మరోసారి బరువైన, భావోద్వేగంతో కూడిన పాత్రతో ఆకట్టుకొన్నారు. సినిమాలోని ప్రధాన సన్నివేశాలను ఆమె తన పెర్ఫార్మెన్స్ ద్వారా ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కిషోర్, ఇనియన్ సుబ్రమణి ఇప్పటి వరకు తెర మీద కనిపించని పాత్రల్లో నటించడమే కాకుండా మెప్పించారు. ఈ పాత్రల డెప్త్ ఇంకా ఉండి ఉంటే.. కల్కి జోనర్‌లో బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన వారంతా పర్వాలేదనిపించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాల పనితీరు హైలెట్. డిఫరెంట్ టోన్‌తో సన్నివేశాలను కే రామ్ చరణ్ అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వాడిన లైటింగ్, కలర్ ప్యాటర్న్ సీన్లను మరింత రిచ్‌గా కనిపించేలా చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఎలివేట్ చేయడమే కాకుండా ఓ మూడ్‌ను క్రియేట్ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అలాగే నిర్మాతలు కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాపై వారికి ఉండే అభిరుచి, తపన కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి.
యుద్దాల వల్ల ఆహార, నీటి కొరత ఏర్పడితే.. మానవుడు ఎలాంటి బరి తెగింపుకు దిగుతాడు. వారి ఆహారం ఏమై ఉంటుందనే విషయాన్ని భవిష్యత్‌లోకి వెళ్లి తన విజన్‌ను దర్శకుడు ప్రమోద్ ఆవిష్కరించిన తీరు ఆలోచింప చేస్తుంది. అలాగే కల్కి సినిమా రేంజ్‌లో ఆ సినిమా కంటే ముందే ఇలాంటి పాయింట్‌ను ఆయన ఆలోచించడం ఆయన టాలెంట్‌కు నిదర్శనంగా నిలిచింది. అయితే కథ, కథనాలపై మరింత కసరత్తు చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్‌గా కనిపిస్తుంది. కల్కి తరహా జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి డెఫినెట్‌గా ఈ సినిమా నచ్చుతుంది. శ్రద్దా శ్రీనాథ్, ఇనియన్, కిషోర్ పెర్ఫార్మెన్స్ కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది. కొత్తదనం కోసం తపించే ప్రేక్షకులకు సినిమాలోని సన్నివేశాలు, కథ డెఫినెట్‌గా ఓ థ్రిల్‌ను అందిస్తాయి.
నటీనటులు: శ్రద్దా శ్రీనాథ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ, అస్మల్, ఆర్యా లక్ష్మీ, మాస్టర్ రోనిత్ తదితరులు
దర్శకత్వం: ప్రమోద్ సుందర్,
నిర్మాతలు: కేఎస్ రామకృష్ణ, కే రాంచరణ్, సహ నిర్మాత: సిద్దార్థ్ స్వయంభు,
సినిమాటోగ్రఫి: కే రాంచరణ్,
ఎడిటింగ్: నిమ్జ్
మ్యూజిక్, సౌండ్ డిజైన్: డాన్ విన్సెంట్
యాక్షన్: జీఎన్ మురుగన్
ఆర్ట్: శక్తి వెంకట్రాజ్
బ్యానర్: ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్