యూత్ ఫుల్ లవ్ స్టోరీ రామ్ నగర్ బన్నీ


‘లవ్‌లో వెతకాల్సింది ఆప్షన్ కాదు.. నిజమైన ప్రేమ’ అని చెప్పే యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్ మూవీ రామ్ నగర్ బన్నీ. ఎలాంటి అంచనాలు లేకుండా.. అక్టోబర్ 04న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా పై ఒక సమీక్ష.

రామ్ నగర్‌లో ఉండే బన్నీ (చంద్రహాస్) జులాయి. బీటెక్‌ని బోల్తా కొట్టించి అమ్మాయిల వెంట తిరుగుతూ ఉంటాడు. తండ్రి మురళీధర్ గౌడ్ కష్టపడి ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కూతురి పెళ్లి చేయడానికి ఆరు లక్షల డబ్బుని కూడబెడతాడు. అయితే ఇంటి బాధ్యత తెలియని బన్నీ.. అమ్మాయిల పిచ్చిలో పడి.. ఆ డబ్బుని కాజేసి అమ్మాయిలతో తిరగడానికి జల్సాల కోసం ఖర్చు పెట్టేస్తాడు. పక్క బస్తీలో ఉండే శైలు (విస్మయ శ్రీ) బన్నీని ఇష్టపడుతుంది. ఆ విషయం బన్నీకి తెలిసినా ఆమె ప్రేమను పెద్దగా పట్టించుకోడు.

శైలు కూడా తన ప్రేమను బయటపెట్టదు. అమ్మాయిల మోజులో ఉన్న బన్నీ.. బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చిన దీపు (రిచా జోషి) ప్రేమలో పడతాడు. దీపు కూడా బన్నీని ఇష్టపడుతుంది. అయితే ప్రేమ అనేది ఒకరిపైనే పుట్టదు అనే ఆలోచన ఉన్న బన్నీ.. దీపు స్నేహితురాలు నైనా (అంబికా వాణి)ను పబ్‌లో చూసి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆ తరువాత దీపుకి సైడేస్తాడు. అయితే నైనా ప్రేమలో మునిగితేలిసిన బన్నీకి ఆమె ఊహించని షాకిస్తుంది. ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడుపుతూ బన్నీ కంటపడుతుంది.

లవ్‌లో వెతకాల్సింది ఆప్షన్ కాదు. నిజమైన ప్రేమ అని తెలుసుకుని తనని ప్రేమించి, తనకోసం సర్వం అర్పించిన శైలుని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె కోసం పిచ్చోడు అవుతాడు. ఆ ప్రయత్నంలో తనకంటే పెద్దదైన తారా ఆంటీ (రీతూ మంత్ర) తారసపడతాడు. ఆమె బన్నీ ప్రేమించాల్సి వస్తుంది. బలవంతంగా ఆమెతో పెళ్లి పీటలు ఎక్కాల్సి వస్తుంది. చివరికి బన్నీ.. నిజమైన ప్రేమను ఎలా తెలుసుకున్నాడు. శైలు, దీపు, నైనా, తారల ద్వారా అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి బన్నీ ఏమయ్యాడు అన్నదే ‘రామ్ నగర్ బన్నీ’ మిగిలిన కథ.

అద్భుతం.. అమోఘం కాదు కానీ, సింపుల్ కథతో ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు దర్శకుడు. చంద్రహాస్‌ని ఒక సూపర్ హీరో మాదిరిగా కాకుండా.. రామ్ నగర్‌లో బస్తీలో బీటెక్ బెడిసికొట్టి గాలి తిరుగుళ్లు తిరిగే బన్నీ గాడు ఎలాగైతే ఉంటాడో.. ఈ సినిమాలో చంద్రహాస్ కూడా అలాగే కనిపిస్తాడు. బన్నీ పాత్రలో ఇమిడిపోయాడు. చంద్రహాస్‌లోని యాటిట్యూడ్‌ని చూసే దర్శకుడు ఈ కథ రాసుకున్నాడా అనేంతగా బన్నీ పాత్రను తీర్చిదిద్దాడు. యాటిట్యూడ్, డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా యాటిట్యూడ్ స్టార్‌లో ఏ ఒక్క కోణాన్ని వదిలిపెట్టలేదు.

విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. మెయిన్ లీడ్ హీరోయిన్ విస్మయ శ్రీనే కాబట్టి.. తన పరిధిమేర మెప్పించింది. నలుగురు హీరోయిన్స్‌కి కథలో ప్రాధాన్యత ఉంది. హీరో తండ్రి పాత్రలో మురళిధర్ గౌడ్ ఒదిగిపోయాడు. ఆటోడ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ.. జులాయి కొడుకు దగ్గర తిండికి డబ్బులు వసూలు చేసే గమ్మత్తైన పాత్రలో కామెడీ పండించాడు. ఇక హీరో బామ్మ రష్మిక పాత్ర అయితే పొట్ట చెక్కలు చేస్తుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకూ బామ్మ అయితే ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్స్‌లో నవ్వులు వినిపించేవి. చంద్రహాస్ తండ్రి కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని ఫన్ వేలో చూపించి మెప్పించారు. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన వర్థన్, అంకిత్, నానిలు నవ్వించారు.

Scroll to Top