
మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా, భారీ అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మాస్ జాతర ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఒకసారి పరిశీలిద్దాం….
కథ
భేరి లక్ష్మణ్ (రవితేజ) రైల్వే శాఖలో పనిచేసే ఒక నిజాయితీ గల ఎస్సై. తన పరిధిలో జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ తరచూ ట్రాన్స్‌ఫర్‌లకు గురవుతుంటాడు. ఈ క్రమంలోనే, ఉత్తరాంధ్రలోని అడవి వరం అనే ప్రాంతానికి బదిలీ అవుతాడు. అక్కడ అక్రమంగా గంజాయి పండిస్తూ, అమ్ముతున్న శివుడు (నవీన్ చంద్ర)తో లక్ష్మణ్‌కు విభేదాలు వస్తాయి. శివుడు అమ్మాలని చూసిన ఒక భారీ గంజాయి లోడ్‌ను లక్ష్మణ్ చాకచక్యంగా మాయం చేస్తాడు. ఈ నేపథ్యంలో, గంజాయి లోడ్ ఏమైంది? లక్ష్మణ్ ప్రేమించిన తులసి (శ్రీ లీల) అతనికి ఎలాంటి షాక్ ఇచ్చింది? ఈ మాస్ కథకు ‘మాస్ జాతర’ టైటిల్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు సినిమా తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమా కథాంశం పాత చింతకాయ పచ్చడిలా పరమ రొటీన్ గా ఉండడం ప్రధాన లోపం. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ అధికారి కథాంశంతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్‌లో నడిచింది. ఈసారి రవితేజ పాత్రను ‘పవర్ తక్కువ ఉన్న రైల్వే పోలీస్ అధికారి’గా చూపించి కొంత కొత్తదనం తీసుకురావాలని చూసినా, కథనం (ట్రీట్‌మెంట్) పాత ధోరణిలో ఉండడంతో ప్రేక్షకుడు నిరాశ చెందక తప్పదు. దర్శకుడు భాను, ఫైట్స్, కామెడీ, పాటలు, సెంటిమెంట్‌లను బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నించారు. కానీ, అన్నిటికంటే ఫైట్ సీక్వెన్స్‌లు మాత్రమే కొంతవరకూ పర్వాలేదనిపిస్తాయి. హైపర్ ఆది, అజయ్ ఘోష్ లాంటి కమెడియన్లను పెట్టి నవ్వించే ప్రయత్నం చేసినా, ఆ కామెడీ కొంతవరకు బాగానే ఉన్నా, తర్వాత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కథ, కథనం రొటీన్‌గా ఉండడం, సినిమా రియాలిటీకి దూరంగా అనిపించడం, కేవలం ఒక ప్రత్యేకమైన ఊరు సృష్టించి అందులో సమస్యలు గుప్పించినట్లు అనిపించడం సినిమాకు మైనస్ పాయింట్లు గా చెప్పవచ్చు.
వన్ మ్యాన్ షో
రవితేజ మరోసారి ఈ సినిమాను తన వన్ మ్యాన్ షో తో భుజాన వేసుకుని నడిపించాడు. తనదైన మాస్ స్వాగ్, కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లు, ఫైట్‌లతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. శ్రీ లీల పాత్ర పరిమితం గా ఉన్నప్పటికీ, కథలో కీలకమైన మలుపులకు ఆమె కారణమవుతుంది. విలన్‌గా నవీన్ చంద్ర మరోసారి తనదైన శైలిలో విలనిజం పండించాడు. రాజేంద్రప్రసాద్ పాత్ర డిజైన్ చేసిన తీరు కాస్త షాక్ కలిగిస్తుంది. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి, తెరపై కూడా అవి బాగున్నాయి. అయితే, నేపథ్య సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉండి నిర్మాణ విలువలను స్పష్టం చేసింది.
