దర్శకుడు శివ ఇంత వరకు తెలుగు, తమిళంలో రొటీన్ సినిమాలు చేస్తూ మొదటి సారి తనలోని టెక్నికల్ నాలెడ్జ్, పాన్ ఇండియన్ విజన్‌ను బయటకు తీసి కంగువాని ఓ రేంజ్‌లో తయారు చేశాడు. సూర్య సైతం ఓ సరైన సబ్జెక్టుతో పాన్ ఇండియా స్పాన్‌లో రావాలని ఇన్నేళ్లు ఎదురుచూశాడు. అలా సూర్య ఈ కంగువా మూవీతో దేశ వ్యాప్తంగా సందడి చేసేందుకు నేడు (నవంబర్ 14) రంగంలోకి దిగాడు. ఈ మూవీని ఒకసారి విశ్లేషిస్తే…
కథ
బౌంటీలు తీసుకుంటూ క్రిమినల్స్‌ను పట్టిస్తుంటాడు ఫ్రాన్సిస్ (సూర్య). గోవాలో జాలీ లైఫ్‌ను గడుపుతుంటాడు. ల్యాబ్ నుంచి జెటా అనే కుర్రాడు తప్పి పోయి ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడికి గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. ఇక ఆ కుర్రాడి కోసం ఓ చిన్న పాటి ఆర్మీ దిగుతుంది. ఆ పిల్లాడేమో ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడ్ని చూడగానే ఫ్రాన్సిస్‌కు ఏం గుర్తుకు వస్తుంది? వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అసలు పంచ కోన కాన్సెప్ట్ ఏంటి? అందులో ప్రణవాది కోన యువరాజు కంగువా (సూర్య), ప్రణవ అనే కుర్రాడిని కాపాడే బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? ప్రణవాది కోనను అంతం చేయాలని కపాల కోన అధిపతి (బాబీ డియోల్) ఎందుకు నిర్ణయించుకుంటాడు? చివరకు కంగువా తన బాధ్యతను పూర్తి చేశాడా?. చివర్లో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు (కార్తీ) చేసిన శపథం ఏంటి? అన్నది ఈ సినిమా కథ.
కంగువా కథ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ అనేక మలుపులతో ఉత్కంఠని రేపుతుంది. ఇక ఈ కథను చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఓ పిల్లాడి బాధ్యతను తీసుకునే ఓ హీరో కథ. కానీ దీనికి శివ ఓ పెద్ద సెటప్ క్రియేట్ చేశాడు. ఈ కథను వెయ్యేళ్ల క్రితం నాటి కాలానికి తీసుకెళ్లాడు. అక్కడ పంచ కోన అనే కాన్సెప్ట్‌ని పెట్టాడు. హిమ కోన, సాగర కోన, అరణ్య కోన, కపాల కోన, ప్రణవాది కోన అని ఇలా ఐదు కోనల్ని క్రియేట్ చేశాడు. అవన్నీ క్లాన్స్ అని మనం చెప్పుకొచ్చాడు. ఒక్కో క్లాన్‌కి ఒక్కో గుణం ఉంటుంది. ఒక్కో క్లాన్‌ని ఒక్కో నాయకుడు ఉంటాడు.
ఇక ఇందులో ముఖ్యంగా ఓ పిల్లాడితో సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని శివ చూసుకున్నాడు. కంగువా గ్రాండియర్, మేకోవర్ అద్భుతంగా ఉంటుంది. టీం ఎంత కష్టపడిందో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. సినిమా అంతటా భారీ సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ మాయాజాలం మెప్పిస్తుంది. ఆ కాలాన్ని చూపించినట్టుగానే అనిపిస్తుంది. విజువల్ ఫీస్ట్ అయితే ఉంటుంది. కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సాదాసీదాగానే ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లు
ఆకట్టుకునేలా ఉంటాయి.
నటన
ఇక నటుడిగా సూర్య మరో మెట్టు ఎక్కుతాడనిపిస్తుంది. సినిమాలో చాలా చోట్ల క్లోజప్ షాట్స్‌తో సూర్య అదరగొట్టేస్తాడు. సూర్య కంటితోనే నటించేస్తాడని చెప్పాల్సిన పని లేదు. సూర్య యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. సూర్య వన్ మెన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. బాబీ డియోల్ కనిపించే సీన్లు కాస్త భయంకరంగానే ఉంటాయి. ఆ క్యాస్టూమ్‌లోనూ బాబీ డియోల్ అందరినీ భయపెట్టించేస్తాడు. దిషా పటానీ రోల్ గురించి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. పిల్లాడి పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఆ కుర్రాడు కూడా బాగానే నటించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు ఎవరో కూడా అంతగా గుర్తించలేం.. వారి పాత్రలు, నటన కూడా అంతగా గుర్తుండకపోవచ్చు. టెక్నికల్‌గా కంగువా అబ్బుర పరుస్తుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ అదిరిపోతుంది. కంగువా కథ కోసం శివ భారీగానే ఖర్చు పెట్టించాడని చూస్తేనే తెలుస్తోంది. మరీ ఆ బడ్జెట్‌ను రికవరీ చేస్తుందా? లేదా అన్నది చూడాలి. రెండో పార్ట్ కోసం మంచి పాయింట్‌ను పట్టుకున్నాడనిపిస్తోంది.