శ్రీను వైట్ల సినిమాల్లో వినోదానికి మాత్రం లోటు ఉండదు. కమర్షియల్ కోణంలో కామెడీ ట్రాక్‌కి పదును పెట్టి క్యారెక్టర్లతోనే కథని నడిపిస్తుంటారు. పడ్డాచోటో వెతుక్కోవాలి అన్నట్టుగా.. శ్రీను వైట్ల అంటే కామెడీ ట్రాక్ మూలం. విశ్వం సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా పెట్టినా వినోదానికి పెద్ద పీట వేశారు శ్రీను వైట్ల. విశ్వం సినిమా కథ కూడా రొటీనే. స్థూలంగా ఒక పాపను కాపాడటం కోసం విశ్వం చేసిన యుద్ధమే ఈ సినిమా కథ.
జలాలుద్దీన్ ముహమ్మద్ అనే టెర్రర్టిస్ట్ ఇండియాలో అజయ్ శర్మగా సెటిల్ అయ్యి.. వరుస బాంబ్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో కేంద్రమంత్రి సుమన్ (సుమన్)ని అతని తమ్ముడు బాచిరాజు (సునీల్) సాయంతో చంపేస్తాడు. అయితే ఆ హత్యను దర్శన అనే చిన్నారి చూస్తుంది. అప్పటి నుంచి దర్శనను చంపడానికి ఈ టెర్రరిస్ట్ ప్రయత్నిస్తాడు. ఆ చిన్నారి సమైరా (కావ్యా థాపర్) అన్న కూతురు కావడంతో.. ఆమెను కాపాడటం కోసం రంగంలోకి దిగుతాడు గోపి రెడ్డి అలియాస్ విశ్వం (గోపిచంద్). ఆ చిన్నారికి కాపాడటం కోసం విశ్వం ఎందుకు వచ్చాడు? యాంటీ టెర్రర్టిస్ట్ స్క్వాడ్‌కి ఇతనికి లింకేంటి? టెర్రరిస్ట్ ఎటాక్ని విశ్వం ఏ విధంగా నిలువరించాడు? ఆ చిన్నారి ఎలా కాపాడాడు అన్నదే మిగిలిన కథ.
2001లో తొలివలపు నుంచి నేటి 2024 విశ్వం వరకూ గోపీచంద్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. గోపీచంద్‌కి వరుస ఫ్లాప్‌లు వచ్చినా అతను సరిగా చేయలేదని కానీ.. తను చేసిన పాత్రలో సిన్సియారిటీ కనిపించలేదని కానీ విమర్శలు వినిపించవు. ఇక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు సరైన కటౌట్ గోపీచంద్. అతని కెరియర్ గ్రాఫ్ చూస్తే.. దాదాపు ఫిఫ్టీ పర్సంట్ పోలీసు పాత్రలే ఉంటాయి. అతని గత చిత్రం భీమాలో కూడా పోలీస్‌గానే కనిపించాడు గోపీచంద్. ఈ సినిమాలో కూడా యాంటీ టెర్రర్టిస్ట్ స్క్వాడ్ కమాండర్ విశ్వంగా.. గోపీరెడ్డిగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రెండు పాత్రల్ని చేశారు.
యాక్షన్, ఫైట్లు అంటే గోపీచంద్ ‘విశ్వ’రూపం చూపిస్తుంటాడు. ఈ సినిమాతో తన కంఫర్ట్ జోన్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఉన్న పాత్రను చేశారు. బోయపాటి సినిమాల్లో హీరో మాదిరిగా.. విలన్లను ఊచకోత కోసేశాడు. గోపిరెడ్డిని విశ్వంగా కాస్త ముందే రివీల్ చేసుంటే హీరోయిజం మరింత పండేదేమో కానీ.. చివరి వరకూ సస్పెన్స్‌గా ఉంచినా.. చూసే ఆడియన్స్ మాత్రం.. తరువాత ఏం జరుగుతుందనే విషయం ముందే తెలిసిపోతుండటం వల్ల ఆ విశ్వం పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేదు. అక్కడ దర్శకత్వ ప్రతిభ లోపించినట్టే అనిపిస్తుంది. కానీ.. దర్శకుడిగా శ్రీను వైట్ల ‘విశ్వం’ సినిమాతో ఫెయిల్ అయితే కాలేదు. అలాగని మంచి మార్కుల్ని పొందలేకపోయాడు.
నిర్మాతలు పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా విజువల్ గ్రాండ్‌గా అనిపిస్తుంది. కెవి గుహన్ కెమెరా వర్క్‌తో రిచ్ నెస్ కనిపిస్తుంది. చైతన్ భరద్వాజ్ సాంగ్స్ జస్ట్ ఓకే.. అయితే పాటల్ని కథలో కావాలని ఇరికించినట్టుగా ఉంటాయి.