కార్తీ, అరవింద్ స్వామిల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ క్లాస్‌గానూ కనిపించగలరు.. మాస్‌గానూ మెప్పించగలరు. ఇలాంటి నటులతో వచ్చిన సినిమా సత్యం సుందరం. ఈరోజే విడుదలైన ఈ సినిమా విశేషాలు…
కథ
సత్యం (అరవింద్ స్వామి) నాన్న రామలింగం (జయ ప్రకాష్)కు తోబుట్టవులు చేసిన అన్యాయంతో చేతిలో ఏం మిగలకుండా పోతుంది. చివరకు ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇంటితో సత్యం మనసు పెనవేసుకుని ఉంటుంది. అతి కష్టంగానే సత్యం ఆ ఇంటిని, ఊరిని విడిచి వెళ్తాడు. తనకు ఇష్టమైన చిన్నాన్న కూతురు భువనకి కూడా దూరంగా వెళ్తాడు. ఊరి వదిలి వెళ్లే క్రమంలో ఇష్టమైన సైకిల్‌ను కూడా అక్కడే విడిచి వెళ్తాడు. 22 ఏళ్లు పుట్టిన ఊరికి, బంధవులకు సత్యం ఫ్యామిలీ దూరంగానే ఉంటుంది. తన చెల్లి భువన పెళ్లి కారణంగా సొంతూరికి రావాల్సి వస్తుంది. ఆ పెళ్లిలో బావ అంటూ సుందరం (కార్తీ) సత్యాన్ని తగులుకుంటాడు. కానీ సత్యానికి మాత్రం అతను ఎవరో తెలీదు. చిన్న నాటి రోజులు కూడా గుర్తుకు రావు. కనీసం అతని పేరు కూడా సత్యంకు తెలియదు. పేరు తెలియకుండా సత్యం అతనితో ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో సత్యం తెలుసున్నది ఏంటి? తనను తాను ఏవిధంగా ఆవిష్కరించుకున్నాడు? కనీసం అతని పేరు అయినా సత్యం తెలుసుకున్నాడా? అతనితో సత్యంకి ఉన్న బంధం ఏంటి? గతంలో వదిలేసి వెళ్లిన సైకిల్ కథ ఏంటి? చివరకు ఏం జరిగింది? అన్నదే కథ.
ఓ సెన్సిబుల్ కథ:
సత్యం, సుందరం ప్రయాణమే ఈ కథ. ఇలాంటి ఓ సెన్సిబుల్ కథను రాయడం చాలా కష్టం. పాయింట్ పరంగా చూస్తుంటే ఇది చిన్న కథలానే అనిపిస్తుంది. కానీ ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం, సీన్లు కొన్ని సార్లు కంటతడి పెట్టేలా చేస్తాయి. ఇంకొన్ని సార్లు సత్యం పాత్ర ఫీల్ అయినట్టే.. నసగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్‌కు కొన్ని సీన్లు ఎక్కకపోవచ్చు.
సత్యం సుందరంలో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. భువనకు అన్నయ్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు.. సత్యంకు తన చెల్లి అంటే ఇష్టం ఉన్నప్పుడు అన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు కలవరు.. సత్యం అంటే అంత ప్రేమ ఉన్న సుందరం ఎప్పుడూ కూడా కలిసే ప్రయత్నం చేయడా? వాళ్లేమీ ఇతర దేశాల్లో లేరు కదా.. అనే లాజిక్స్ కూడా మధ్యలో తట్టొచ్చు. కానీ అలాంటి లాజిక్స్ వస్తే తప్పు మన ఆడియెన్స్‌ది అయితే కాదు. ఇక పెళ్లిలో కామెడీ సీన్ అన్నట్టుగా.. సుందరం పెళ్లిలో ఏదో జరిగినట్టు.. ఏదో కామెడీ సీన్ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ తరువాత దాని ఊసే ఉండదు. ఇలా చాలా సీన్లు మనకు ఎక్కవు.
రిసెప్షన్ స్టేజ్ మీద అన్నా, చెల్లి ఎమోషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. చూసే ఆడియెన్స్‌కి కన్నీరు రావొచ్చు. సెకండాఫ్‌లో సత్యం, సుందరం మధ్య వచ్చే చాలా సీన్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. చూసే ఆడియెన్‌కు కార్తీ పేరు సుందరం అని తెలుస్తుంది. కానీ సత్యం పాత్ర ఆ పేరుని కనుక్కునేందుకు పడే తాపత్రయం, కనుక్కోలేకపోతోన్నాను అనే పడే బాధ, కనుక్కున్నాక సంతోష పడే సీన్లు ఇలా చాలా వరకు కనెక్ట్ అవుతాయి.
ఇంత వరకు సీన్ల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ చిత్రానికి సత్యం, సుందరం కారెక్టర్లను ప్రేమ్ కుమార్ రాసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సత్యం మనుషుల్ని దూరం పెట్టి ఏకాంతంగా బతుకుతుంటాడు. కానీ సుందరం మాత్రం మనుషులు మంచోళ్లు.. మనుషులంటేనే మంచోళ్లు అనేట్టుగా జాలీగా బతికేస్తుంటాడు. అందరినీ మనస్పూర్తిగా పలకరిస్తూ, అందరికీ ప్రేమ, నవ్వులు పంచుతూ ఉంటాడు. ఈ రెండు పాత్రలను రాసుకున్న తీరు.. సుందరం పాత్రకు సత్యం కారెక్టర్‌తో ఇచ్చిన ఎలివేషన్ బాగుంటుంది. మనిషి అంటే అలా బతకాలా? మనుషులంతా అలా బతకాలా? అంటూ సుందరం పాత్ర గురించి సత్యం చెప్పే సీన్ బాగుంటుంది. అలాంటి డైలాగ్స్ ఎన్నో కూడా మనసుకు హత్తుకునేలా ఉంటాయి.
డబ్బులు ముఖ్యం కాదు.. ప్రేమ, బంధువులు, బంధుత్వం, మంచి బంధాలు ఉండటమే ముఖ్యం అన్నట్టుగా ప్రేమ్ కుమార్ మంచి సందేశాన్ని ఇచ్చేలా కథను రాసుకున్నారు. అందరూ సుందరం లాంటి మంచి వారే ఉండాలనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ సుందరం లాంటి స్వచ్చమైన ప్రేమను పంచే కారెక్టర్‌లు కనిపించడం అరుదు. కానీ ఈ సినిమాలో కార్తీ పాత్రను చూస్తే మంచితనానికి అడ్రెస్‌లా ఉంటాడు. అలాంటి కారెక్టర్‌ను కార్తీ అవలీలగా పోషించేశాడు. కార్తీ అమాయకపు నటన నవ్విస్తుంది.. కొన్ని సార్లు ఏడిపిస్తుంది. అరవింద్ స్వామి చాలా మెచ్యూర్డ్‌గా, సెటిల్డ్‌గా తన పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి అరవింద్ స్వామి, కార్తీలే ప్రధాన బలం. ఇలాంటి ఓ కథను.. అంత నెమ్మదిగా సాగే కథనంతో.. మూడు గంటల సేపు ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టడం అంటే నటులకు అంత ఈజీ కాదు. కానీ కార్తీ, అరవింద్ స్వామి చాలా వరకు ఆడియెన్స్‌ను తమ నటనతో కట్టి పడేస్తారు. రాజ్ కిరణ్, జయ ప్రకాష్, శ్రీదివ్య, దేవ దర్శిని పాత్రలు ఓకే అనిపిస్తాయి.
సాంకేతికతంగా ఈ చిత్రం మళ్లీ మెస్మరైజ్ చేస్తుంది. గోవింద్ వసంత్ పాటలు అంతగా గుర్తుండకపోయినా.. ఆర్ఆర్ మాత్రం ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. కెమెరా వర్క్ చాలా సహజంగా కనిపిస్తుంది. ఎంతో ప్లెజెంట్‌గా, హాయిగా అనిపించేలా ఉంటుంది. సూర్య, జ్యోతికలు నిర్మాతలుగా మరోసారి తమ అభిరుచిని చాటుకున్నారు.