
ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి తొలి పండుగ గా గుర్తింపు తెచ్చుకుంది. ఉగాది పండుగ ప్రకృతితో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా వసంత రుతువు ప్రారంభ సమయంలో వస్తుంది. ఈ సమయంలో చెట్లు కొత్త ఆకులతో పచ్చగా మారి ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది.
అందుకే ఉగాది పండుగను ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతంగా కూడా భావిస్తారు.
‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాది గా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా కొత్త నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి విశ్వావసు నామ సంవత్సరం మార్చి 18 తో ముగియగా, మార్చి 19 నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
*తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖి’ గా జరుపుకుంటారు.
*2026 సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 19, గురువారం నాడు జరగనుంది. పాడ్యమి తిథి మార్చి 19 ఉదయం 6:53 గంటలకు ప్రారంభమై, మార్చి 20 ఉదయం 4:52 గంటలకు ముగుస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాలు చేస్తారు.
*తెలుగునాట ఉగాది పర్వదినానికి వందలాది సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. శాతవాహనుల కాలం నుంచే ఈ పండుగను ఒక సామాజిక ఉత్సవంగా రాజులు ప్రోత్సహించి, ఆదరించేవారని చరిత్ర సాక్ష్యమిస్తోంది. పురాణాలు సైతం ఉగాదికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి.
చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజున విధాత (బ్రహ్మదేవుడు) ఈ సృష్టి ప్రారంభానికి శ్రీకారం చుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజునే కృతయుగం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అలాగే, ఇదే చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే కలియుగం కూడా ప్రారంభమైందని మరో గాథ ప్రచారంలో ఉంది.
*త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం ముగించుకుని వచ్చి పట్టాభిషిక్తుడైనది కూడా ఈ ఉగాది రోజునే అని రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. సృష్టితోనూ, ప్రకృతితోనూ ముడిపడి ఉన్న ఈ పర్వదినం మానవ ఆరోగ్యానికి, ఆనందానికి అవసరమైన ఆహార నియమాలతో కూడి ఉంటుందని ఋషులు పురాణాల్లో పేర్కొన్నారు.
*సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచగా, శ్రీమహా విష్ణువు మత్స్యావతారం ధరించి వాటిని కాపాడాడు. అలా స్వాధీనం చేసుకున్న వేదాలను తిరిగి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడికి అప్పగించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును కొత్త సంవత్సరం ప్రారంభం గా జరుపుకుంటున్నాము.
*సూర్యోదయం వేళ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడమే కాకుండా.. గ్రహ, నక్షత్ర, రుతు, మాస మరియు వర్ష గణనను కూడా ఆ రోజే నిర్ణయించాడు. రుతువుల్లో మొదటిదైన వసంత రుతువు ఆరంభం కావడంతో పాటు, సమస్త ప్రాణికోటి సృష్టికి ఇది నాంది. చరిత్రలోకి వెళితే.. తొలి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనది కూడా ఈ ఉగాది రోజునే కావడం విశేషం.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
ఉగాది అంటే తెలుగు వారందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. ఈ పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
* బెల్లంలోని తియ్యదనం సంతోషానికి సంకేతం
* ఉప్పు – మన జీవితంలోని ఉత్సాహానికి సంకేతం
* వేప పువ్వులోని మన జీవితంలోని దుఃఖం, అనుభవాలను తెలియజేస్తుంది.
* చింతపండులోని పులుపు మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం
* పచ్చి మామిడి ముక్కల్లోని వగరు కొత్త సవాళ్లను ఎదుర్కోవడం నేర్పుతుంది.
* కారం – సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు సంకేతం.
ఎలా జరుపుకోవాలి?
ఉగాది పండుగ రోజు నుంచే తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజున శుభకార్యాలు ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతారు. ఈరోజు కొత్త పనులు ప్రారంభిస్తే కచ్చితంగా విజయం దక్కుతుందని చాలా మంది నమ్మకం. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో ఈరోజును ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది జీవితంలోని షడ్రుచులను సూచిస్తూ ఒక సందేశాన్ని అందిస్తుంది. ఈరోజు కొత్త బట్టలు ధరించడం శుభసూచికంగా చెబుతారు.
ఉగాది నాడు తోచినంత దానధర్మాలు చేయడం వలన పుణ్యం కలుగుతుంది. ఎంతో మంచి ఫలితాన్ని చూడొచ్చు. కష్టాలు కూడా తొలగిపోతాయి. ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఏడాది అంతా దైవానుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం: ఉగాది నాడు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. మామిడి తోరణాలు కట్టి ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది; ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు, కుంకుమలు అద్దాలి. దీంతో మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.ఇష్టదైవాన్ని మనసారా ఆరాధించి, ఆ తర్వాత పిండి వంటలతో నైవేద్యం పెట్టి కుటుంబ సమేతంగా స్వీకరించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం వినాలి. ఉగాది నాడు ఆనందంగా ఉంటే ఏడాది అంతా ఆనందంగా ఉండొచ్చని చెబుతారు.
