
బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ – 26-04-2026 – మెల్బోర్న్
అవధాన సహస్రఫణి, బృహత్ ద్విసహస్రావధాని, శతావధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులతో అలంకృతులైన బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, గోల్డ్ కోస్ట్, మెల్బోర్న్ నగరాలలో “శ్రీ రాముని ధర్మ నిరతి – అవతార వైశిష్ట్యం” అనే అంశంపై ప్రవచనములు అందించారు.
ప్రవచన సమయంలో మధ్య మధ్యలో, గత అవధానాలలో చోటుచేసుకున్న చమత్కారాలను చేర్చి, ప్రేక్షకులను ఆద్యంతం అలరించారు. కఠినమైన తాత్విక విషయాలను సైతం తేనెలాంటి మధురమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
నాస్తికుడైనా రాముణ్ణి మెచ్చనివాడు ఉండడు. అలాంటి శ్రీరాముని ధర్మనిరతిని వివరిస్తూ, కలియుగంలో జీవిస్తున్న మనం త్రేతాయుగ ధర్మాన్ని ఎలా అనుసరించాలో అత్యంత సున్నితంగా వివరించారు. యుగాల మధ్య పరిస్థితుల వ్యత్యాసం ఎంత ఉన్నప్పటికీ, రాముని ధర్మ మార్గం ఎప్పటికీ ప్రాసంగికమేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రేక్షకులకు నూతన ఉత్సాహాన్ని కలిగించారనడంలో అతిశయోక్తి లేదు.

మెల్బోర్న్ నగరంలో 26 ఏప్రిల్ 2026, ఆదివారం, బ్యాంకేసియా థియేటర్లో కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆరంభంగా సంగీత ఉపాధ్యాయురాలు శ్రీమతి సుందరి సరిపల్లి గారు తమ శిష్య బృందంతో శ్రీరామునిపై అద్భుత గానాన్ని అందించారు. హరికాంభోజి రాగంలో, రూపక తాళంలో “ఉండేది రాముడొకడు, ఊరక చెడిపోకె మనసా” అనే త్యాగరాజ స్వామి వారి కీర్తనను ఆలపించి, గురువుగారి ప్రశంసలు పొందారు.
తదుపరి, మెల్బోర్న్ దేవా సంస్థ సమన్వయకర్త చయనం చక్రి గారు స్వాగత ఉపన్యాసంలో, దేవా సంస్థ వ్యవస్థాపకులు సిడ్నీ వాస్తవ్యులు పవన్ కిశోర్ వఝల గారిని మరియు మెల్బోర్న్ సేవకులను పరిచయం చేశారు.
గురువుగారు జ్యోతి ప్రజ్వలన చేసి, తమ ప్రసంగంతో సభికులను ఆద్యంతం ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల సందేహాలకు సమగ్ర సమాధానాలు అందించి, చివరగా ఆశీర్వచనములు, ప్రసాదమును తమ దివ్య హస్తాలతో అందించారు.
వారిని మెల్బోర్న్‌లోని VHP, TAAI, తెలుగుమల్లి సంస్థలు ఘనంగా సత్కరించాయి. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కుటుంబాలతో వచ్చిన ప్రేక్షకులకు భోజన ఏర్పాట్లు చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

రచయిత : శ్రీ రామ్ పులిపాక
శ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారిపై బ్రహ్మశ్రీ కావ్యకళాప్రపూర్ణ, డా. చింతలపాటి మురళీకృష్ణ గారిచే రచింపబడిన పద్యాలు:
ఉత్పలమాల:
మాడుగులాన్వయా! నలువమానసపుత్రుడ!పద్యరాగ సం
ప్రోడవనంగ విశ్వమున భూరియశస్సు గడించినావు; ని
న్నోడగజేయువా డిలను నొక్కడులేడు!రసార్ద్రమూర్తివై
పాడుచునుందువీవు వరవాఙ్మయి యాశిసులిచ్చు చుండుటన్!
శార్దూలము:
రాగాలాపనతోడశ్రోతలను విభ్రాంతిన్ మునింగించి గీ
తా గానం బొనరించు యక్షుడవొ! గంధర్వుండవో! యాంధ్రభా
షాగీర్వాణపరంపరాకలిత సత్సాహిత్య సమ్రాట్టువై
భోగంబొందితివింట- మెల్ బొరనులో- భోగీంద్రశర్మా! భళా!!
ఉత్పలమాల:
రాగసరాగ వాగ్విభవ రమ్యపరాగ సురాగ రాజసం
భోగ పదార్థ లాహిరుల మున్కలువైచుచు పద్యవిద్య సం
యోగ మహత్వ శక్తిని మహోన్నత గౌరవమొందినట్టి వి
ద్యాగురుమూర్తి! హేశతవధానివరేణ్య! నుతింతునెల్లెడన్!!
చంపకమాల:
అనునయ మొప్పునట్లు ప్రణవాక్షరనామజపమ్ము పోల్కి ము
క్కున ధరియించి రాగకలకూజితమున్ సవరించుకొంచు భా
వనమును తీర్చుకొంచు పదబంధుర రీతిగ్రహించుకొంచుతీ
యనయనిపించు పద్యముల నాగఫణీచెరలాడి పల్కెదే!!
ఉత్పలమాల:
నీవొక వాఙ్మయీ ప్రతివి నీవలె రాగముతీయు కోకిలల్
భావపరంపరన్ దగిలి పద్యములల్లెడి సత్కవీంద్రులున్
ఠీవిగ పాదపద్మయుతి తోడి పసందుగ విందుజేయుభా
షావిపులాంగ భావజులు సద్గురులెందున గల్గిరే కవీ!!
