రంజాన్ రుచుల్లో హలీమ్ ది బెస్ట్
రంజాన్ అంటేనే హలీమ్ అన్నంత అనుబంధం ఉంది. రంజాన్ కోసం ముస్లింలు ఎంతగా ఎదురుచూస్తారో హిందువులూ, ఇతర మతాల వారూ అదే తీరుగా ఎదురుచూస్తారు. కారణం హలీమ్. భిన్నమతాల మధ్య స్నేహబంధం నిలిపేది హలీమ్. దీని కమ్మటి రుచే అందుకు కారణం. అందుకే అందరం చెప్పాలి హలీమ్‌కి సలామ్. ఎన్నో విలువైన పోషకాలున్న హలీమ్ వెజ్, నాన్‌వెజ్ రుచుల్లో దొరుకుతుంది. అది కొని తినే కన్నా మనమే ఇంట్లో తయారుచేస్తే.. హలీమ్ వెరైటీలు ఎలా తయారుచేయాలంటే……?
వెజ్ హలీమ్
కావలసిన పదార్థాలు :
గోధుమరవ్వ-అరకప్పు, ఓట్స్- రెండు టేబుల్‌స్పూన్లు, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, నువ్వులు- ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను, మిరియాలు-పావు టీస్పూను, యాలకులు-మూడు, లవంగాలు-నాలుగు, దాల్చినచెక్క-చిన్నముక్కలు రెండు, జీలకర్ర-టీస్పూను, సోయావాటర్ గ్రాన్యూల్స్-పావుకప్పు (నీళ్లల్లో పదినిమిషాలు నాననిచ్చి), బాదంపప్పులు, జీడిపప్పు- ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు- రెండు (సన్నటి ముక్కలుగా తరిగి), మిక్స్డ్ వెజిటబుల్స్-అరకప్పు (క్యారెట్, బీన్స్, పచ్చిబటాణీ గింజలు, గ్రీన్ బీన్స్, లిమా బీన్స్ లాంటివి), పాలు-అరకప్పు, పచ్చిమిర్చి-మూడు (నిలువుగా కట్ చేసి), పుదీనా, కొత్తిమీర – ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు (తరుగు), ఉప్పు- రుచికి సరిపడా, నిమ్మకాయముక్కలు- అలంకరణకు.
తయారుచేసే విధానం:
గోధుమరవ్వ నుంచి జీరా వరకూ పైన చెప్పిన అన్ని పదార్థాలనూ పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ పొడి ఒక కప్పు ఉంటుంది. పాన్ తీసుకుని రెండు టేబుల్స్పూన్ల నూనె అందులో వేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్ని వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకూ వేయించి, తీసుకోవాలి.ప్రెషర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో జీడిపప్పును బంగారు వర్ణంలో వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలూ వేసి వేయించాలి. ఇందులో వేయించిన ఉల్లిపాయలను (అలంకరణకు కొద్దిగా విడిగా తీసి) కూడా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. మిక్స్డ్ వెజిటబుల్స్ ఇందులో వేసి, రెండు నిమిషాలు ఉడికించాలి.
నానబెట్టిన సోయా గింజల్లోని నీళ్లను తీసేసి, ప్రెషర్కుక్కర్లో వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. అందులో పాలు పోసి, ఉడకనివ్వాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి. రెడీ చేసి పెట్టుకున్న పొడిని, రుచికి సరిపడా ఉప్పునూ ఇందులో వేసి, ఉండ కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చేదాకా ఉంచి, కుక్కర్‌పై మూతపెట్టి 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి, అందులోని మిశ్రమాన్ని మెత్తగా మెదపాలి. ఇలా రెడీ అయిన వెజ్ హలీమ్‌పై పుదీనా, కొత్తిమీర తరుగు, నిమ్మకాయముక్కలు, వేగించిన నట్స్‌లతో అలంకరించి, సర్వ్ చేయాలి.
చికెన్ హలీమ్
కావలసిన పదార్థాలు :
చికెన్- 750 గ్రాములు, అల్లం-వెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయముక్కలు-అరకప్పు, గులాబీరేకులు-పావు కప్పు, పచ్చిమిర్చి-ఐదు, నెయ్యి-అరకప్పు, గోధుమరవ్వ-అర కప్పు, ఓట్స్-పావు కప్పు, బాదంపప్పులు-ఆరు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినపప్పు-ఒక్కొక్కటీ ఒక్కో స్పూను, నువ్వులు-మూడు గ్రాములు, జీలకర్ర-నాలుగు గ్రాములు, లవంగాలు-రెండు గ్రాములు, మిరియాలు-మూడు గ్రాములు, దాల్చినచెక్క-రెండు అంగుళాల ముక్క, యాలకులు-ఎనిమిది, సాజీరా- రెండు గ్రాములు, కబాబ్చినీ-రెండు గ్రాములు, పాలు-కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, వేగించిన ఉల్లిపాయముక్కలు-అరకప్పు, పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు (ఛాయిస్), కొత్తిమీర-అరకట్ట (తరుగు), పుదీనా-అర కట్ట (తరుగు).
తయారుచేసే విధానం:
వెడల్పాటి గిన్నెలో కబాబ్ చినీ, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, బాదం, ఓట్స్, గోధుమరవ్వ అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని బ్లెండర్లో వేసి మెత్తగా పొడిచేయాలి. ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేసి, వేడెక్కాక అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. చికెన్ ముక్కలతో పాటు చికెన్‌ను నానబెట్టిన నీళ్లనూ అందులో పోసి, కలపాలి. ఈ మిశ్రమంలో వేయించిన ఉల్లిపాయముక్కలు, గులాబీరేకులు, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగు, ఉప్పు, రెడీచేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపాలి. పెద్దమంటపై రెండు విజిల్స్ వచ్చేదాకా ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఆ తర్వాత సన్నని మంటపై 40 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దాన్ని మెత్తగా మెదపాలి. అందులో నెయ్యి వేసి కలపి, దానిపై నిమ్మరసం చల్లి, వేడిగా తింటే ఎంతో బాగుంటుంది.
మటన్ హలీమ్
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ మటన్-250 గ్రాములు, అల్లం-వెల్లుల్లిముద్ద- టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, పచ్చిమిర్చి- నాలుగు, గోధుమరవ్వ- కొద్దిగా, మిరియాలు- కొన్ని, గరంమసాలా-అర టీస్పూను, వేగించిన ఉల్లిపాయముక్కలు- ఒకటిన్నర కప్పు, సాజీరా-ఒక స్పూను, పుదీనా-కట్ట, నూనె- టేబుల్‌స్పూను, నెయ్యి-పావు కప్పు, ధనియాలపొడి- స్పూను, నిమ్మరసం-టేబుల్‌స్పూను, నీళ్లు-సరిపడా.
తయారుచేసే విధానం :
మటన్‌ని నీటిలో శుభ్రంగా కడగాలి. గోధుమరవ్వను అరగంటసేపు నీళ్లలో నానబెట్టాలి. కుక్కర్లో నూనె వేడిచేయాలి. వేడెక్కిన నూనెలో మటన్, మిరియాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సాజీరా, గరంమసాలా, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయాలి. ఆవిరిపోయాక ఉడికిన మటన్‌ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కడాయిలో గోధుమరవ్వ, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. రవ్వ ఉడికాక స్టవ్ ఆపేయాలి. మరో కడాయిలో నెయ్యి కరిగించాలి. అందులో ఉడికిన గోధుమరవ్వ, మటన్‌లను వేయాలి. మిశ్రమం ముద్దలా అయ్యాక వేగించిన ఉల్లిపాయముక్కలు, పుదీనా, నిమ్మరసం పైన చల్లి కిందికి దించాలి. ఘమఘమలాడే మటన్ హలీమ్ రెడీ..!