గుండె ఆరోగ్యానికి కొండంత అండ


నట్స్ వినియోగం ఈ మధ్య కాలంలో పెరిగింది. శరీరానికి కావాల్సిన శక్తితో పాటుగా అనేక రకాల విటమిన్లు సైతం శరీరానికి అందుతాయి. నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. నట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నియంత్రణకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నట్స్ చూడటానికి చాలా చిన్నవిగా కనిపించినా పోషకాల విషయంలో మాత్రం ఈ విత్తనాలు సూపర్‌ ఫుడ్స్‌ అనిపించుకున్నాయి.

విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండే ఈ గింజలను రోజుకు ఒకటి-రెండు చెంచాలు తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన మందులు, జిమ్‌ వర్కవుట్లు మాత్రమే సరిపోవు. ఈ నట్స్ ద్వారా ప్రయోజనం దక్కుతుంది. అనేక మంది మహిళలు రక్త హీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారి సమస్యకు హలీమ్‌ గింజలు అద్భుతమైన పరిష్కారం గా నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఐరన్‌, ఫోలెట్‌ పుషలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచి, అలసటను తగ్గిస్తాయి. హలీమ్‌ గింజలు రక్తహీనతతో బాధపడేవారికి సంజీవని లాంటివి. వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్స్‌ ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. అదే విధంగా గుమ్మడి గింజలను చాలామంది కేవలం రుచి కోసమే తింటారు. కానీ, వీటిలో జింక్‌, మెగ్నీషియం, ఫైబర్‌, విటమిన్‌-ఇ అధికంగా ఉంటాయి.

గుమ్మడి గింజలు పురుషుల్లో శుక్ర కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో, కండరాలకు శక్తినివ్వడం లో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక. అదే విధంగా శాకాహారులకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభించే అత్యుత్తమ వనరు అవిసె గింజలు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్‌ స్థాయులను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు ఎంతో మేలు చేస్తాయి. అయితే, అవిసె గింజల పై పొర చాలా గట్టిగా ఉంటుంది, అది త్వరగా జీర్ణం కాదు. అందుకే వీటిని పొడి చేసి తీసుకుంటే శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. ఈ మూడు రకాల గింజలను కలిపి రోజుకు ఒకటి నుంచి రెండు చెంచాలు స్మూతీస్‌, సలాడ్స్‌ లేదా పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. ఈ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనాలు అందుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

Scroll to Top