కెమికల్స్ తో మగ్గబెట్టిన మామిడి…!

కెమికల్స్ తో మగ్గబెట్టిన మామిడి పండ్ల వల్ల ఆరోగ్యానికి చేటు!

మామిడి పండ్ల సీజన్ మొదలైపోయింది. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మామిడి పండ్లు మంచిది. మార్కెట్‌లో బంగారు వర్ణంలో మెరుస్తూ మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. బంగినపల్లి, పెద్ద రసాలు, సువర్ణ రేఖ, కేసర్, తోతాపురి వంటి రక రకాల మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న పండ్లు చాలా వరకు రసాయనాలతో పండించినవే కావడం గమనార్హం. ఈ హానికరమైన రసాయనాలు అనారోగ్యానికి పెను ప్రమాదం గా మారుతున్నాయి. ప్రస్తుతం మామిడి పండ్ల డిమాండ్ ను గుర్తించిన వ్యాపారులు క్యాష్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చెట్టుకు మగ్గిన, సహజంగా మగ్గిన మామిడి పండ్లతో పాటు నకిలీ మామిడి పండ్లను మార్కెట్‌లో అమ్ముతున్నారు. కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాల సాయంతో మగ్గబెట్టిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి? రసాయనాల సాయంతో మగ్గిన మామిడి పండ్లు తింటే కలిగే అనారోగ్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలా గుర్తించాలి?

*సహజంగా మాగిన మామిడి పండ్ల నుంచి వచ్చే సువాసన ప్రత్యేకమైన తీసి వాసన కలిగి ఉంటుంది. సహజంగా మాగబెట్టిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. అదే కార్బైడ్‌తో మగ్గబెట్టిన మామిడి పండ్లలో ఈ వాసన ఉండదు.

*సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉండి లోపల మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తి చూస్తే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఇవి కొన్ని రోజులు నిల్వ ఉన్నా అంత త్వరగా పాడైపోవు.

*కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ రైపనర్ వంటి కెమిక్సల్‌తో మాగబెట్టిన పండ్లకు సహజ వాసన రాకపోగా పండు మొత్తం లేత పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. పైకి చూడటానికి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి కూడా పుల్లగా ఉంటుంది. మామడి పండు పైన తొక్క ముడతలు లేకుండా ఉండి కొంచెం గట్టిగా ఉంటుంది.

*సహజంగా పండిన మామిడి పండు ఒకే రంగులో ఉండదు. కెమికల్స్‌తో మాగబెట్టిన మామిడి పండ్లు బయటకు చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా నిగనిగలాడుతూ, అంతా ఒకే లేత పసుపు రంగులో కనిపిస్తాయి.

*ఒక బకెట్ నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో మామిడి పండ్లు వేయండి. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉండి నీటిలో మునుగుతాయి. రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు తేలికగా ఉండి మునుగుతూ తేలుతూ కనిపిస్తాయి.

*అలాగే.. కెమికల్స్‌తో పండించిన మామిడి పండు తిన్నప్పుడు నాలుకపై మంట పుట్టడం లేదా గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. అదే సహజంగా పండిన పండు తిన్నప్పుడు ఆ రుచి, మధురం నోరంతా తెలుస్తుంది. అమృతంలా ఉంటుంది.

కలిగే అనారోగ్యాలు

రసాయనాలతో పండించిన మామిడి పండ్లు తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, నోటిలో, గొంతులో అల్సర్లు ఏర్పడటం, కాల్షియం కార్బైడ్‌ నుంచి వెలువడే ఎసిటిలిన్‌ అనే గ్యాస్‌ వల్ల ఛాతీలో టైట్‌గా ఉండటం, ఊపిరితిత్తుల్లో ఇబ్బందికరంగా ఉండటం, తల తిరగడం, మగతగా ఉండటం వంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. అలాగే దీర్ఘకాలంలో కాల్షియం కార్బైడ్‌లో ఉండే ఆర్సెనిక్‌, ఫాస్పరస్‌ వంటి వాటి వల్ల దీర్ఘకాలంలో శరీరంలో ఉంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలేయం, కిడ్నీల పనితీరు మందగించడం, చర్మంపై దురద, ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కెమికల్స్‌తో మాగబెట్టిన పండ్ల పట్ల జాగ్రత్త వహించాలి. మార్కెట్‌లో దొరికే కెమికల్స్‌తో మాగబెట్టిన పండ్ల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేక సందర్భాల్లో హెచ్చరించిన విషయం తెలిసిందే.

పండ్లను మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్‌కు బదులుగా ఎథిలిన గ్యాస్‌ వినియోగించుకోవచ్చు. పండ్లను పేపర్లలో చుట్టి మాగబెట్టడం, వరిపొట్టు, గోధుమ గడ్డి, వరిగడ్డి వంటి వాటిలో ఉంచి మగ్గబెట్టడం, ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లలో ఉంచడం ద్వారా పండ్లను సహజంగా మగ్గబెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Scroll to Top