
నీరు జీవనాధారం. ఒక్కరోజు నీళ్లు తాగకపోతే బ్రతకలేం. శరీరానికి నీరు చాలా అవసరం. అటువంటి నీటిని తక్కువగా తాగితే రకరకాల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*తక్కువ నీరు తాగితే కలిగే దుష్ప్రభావాలు ఎన్నో ఉన్నాయని వారు చెబుతున్నారు. శరీరంలో 60-70% నీరు ఉంటుంది. సరైన మోతాదులో నీరు తాగకపోతే శరీరం సక్రమంగా పని చేయలేదు. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం అవసరం. కానీ ఎక్కువ మంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. దీని వల్ల శరీరానికి అనేక సమస్యలు వస్తాయి.
*తక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల విషయానికి వస్తే మొదటిది డీహైడ్రేషన్. దాంతో పాటు మరికొన్ని సమస్యలు ఉంటాయి. నీరు తక్కువ తాగితే శరీరానికి కావలసిన నీటి స్థాయి తగ్గుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఇది అలసట, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడానికి దారితీస్తుంది. నీరు తక్కువగా తాగడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు, రక్తపోటు పెరగడం, శరీర బరువు పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
*తక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయవు. కిడ్నీలో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఏర్పడే అవకాశం ఎక్కువవుతుంది. మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారి దుర్వాసన వస్తుంది. తక్కువ నీరు త్రాగడం మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. నీరు తక్కువగా తాగడం గుండెకు కూడా హాని చేయవచ్చు.
*నీరు తక్కువగా తాగితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం పొడిబారి, ముడతలు పడే అవకాశం పెరుగుతుంది. ముఖం మురికిగా, నిస్తేజంగా కనిపిస్తుంది. గ్లో తగ్గి, మొటిమలు వస్తాయి. డ్రై స్కిన్ తో అనేక రకాల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
*నీరు తక్కువ తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలు సరిగా బయటకు వెళ్లకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకం. రోజూ తగినంత నీరు తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు 8 నుంచి 9 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు వివరిస్తున్నారు.
