స్మార్ట్ ఫోన్లతో సహవాసం…


స్మార్ట్ ఫోన్లతో సహవాసం మతిమరుపునకు ఆహ్వానం
***********************
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవని పరిస్థితి ఉంది. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఒక గంట సేపు ఫోన్ చేతిలో లేకపోతే విలవిలలాడేవారు ఎందరో ఉన్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు తెలియకుండానే ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు.  అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్లలో తల పెడుతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు అధికంగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగంతో మరో కొత్త సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్లప్పుడు స్మార్ట్ ఫోన్ చూసే వారికి కొత్త రకం సమస్యలు వస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగంతో మెదడులో చురుకుతనం తగ్గిపోతుందని గుర్తించారు. స్మార్ట్ ఫోన్లపై ప్రతి ఒక్క విషయానికి ఆధారపడడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. దాని కారణంగా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

తాజాగా అమెరికాలో జరిపిన సర్వేలో అమెరికన్లు స్మార్ట్ ఫోన్ ను రోజుకు సగటున 344 సార్లు అంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి చూస్తున్నారని తేలింది. పదే పదే సెల్ ఫోన్ చెక్ చేయడం వల్ల, నోటిఫికేషన్ రాకున్నా ఊరికే మొబైల్ ఫోన్ తీసి చూస్తూ ఉండడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని చెబుతున్నారు. మైండ్ ఫోన్ మీద తప్ప మరే ఇతర పని మీద పూర్తి స్థాయిలో లగ్నం కావటం లేదని గుర్తించారు.

స్మార్ట్ ఫోన్ వినియోగించాలనుకునేవారు అవసరం మేరకు మాత్రమే ఫోన్ ను వినియోగించాలని గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్ ను చూస్తూ మైమరిచిపోతే మతిమరుపు వస్తుందని ఆ తర్వాత అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. రోజులో ఎంత వీలైతే అంత తక్కువగా మొబైల్ ఫోన్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.