NTR శతజయంతి ఉత్సవాలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు

అనితర సాధ్యుడు, చలనచిత్ర జగతిలో ఆయనొక అద్భుతం
స్వచ్చమైన రాజకీయాలకు చిరునామా
తెలుగు ప్రజల ఆత్మగౌరవం నందమూరి తారకరామారావు

సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, తెలుగు ప్రజల హృదయాలను గెలిచిన నందమూరి తారకరామారావు. స్ఫురద్రూపం, వాచకం ఆయన ప్రత్యేకం. ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలుకుతాయి, మనకు చేరుతాయి. ఆ కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతాయి. ప్రతి రసం సహజ సంపూర్ణంగా చిలుకుతుంది. ఉచ్చారణలో ఇంతటి సహజసౌందర్య సంపూర్ణ సుగాత్రుడు తెలుగు నటుల్లోనే వేరొక్కరు లేరు. ఎన్టీఆర్ ధరించే ఆభరణాలు కూడా ధ్వనిస్తూ నటిస్తాయి. భారతచలనచిత్ర జగతిలోనే ఇది అపూర్వం.

స్వచ్చమైన రాజకీలకు శ్రీకారం చుట్టిన నందమూరి భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాముఖ్యత గల స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా 1983లో ప్రమాణస్వీకారం చేసి చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డారు. అప్పటికే విపక్ష పార్టీ దిగ్గజ నాయకులైన ఎందరినో తనదైన శైలిలో మెప్పించి ఒకే త్రాటిపై తీసుకొచ్చారు. తనకు ‘అన్న’ గా ఆదరించి ఆమోదించిన తెలుగు ప్రజల ఋణం తీర్చుకోవడానికి ఎన్నో పథకాలు రచించి అమలు చేసిన పుణ్యమూర్తి శ్రీ రామారావు గారు.
సినీరంగంలో, రాజకీయాలలో క్రొత్తవారికి అవకాశం ఇచ్చి ప్రజాసేవలో నూతన వరవడిని దిద్దిన కార్యదక్షుడాయన. తెలుగువారి గుండెల్లో అజరామరమైన పేరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.

ఆ మహానుభావుడి శతజయంతి జయంతి వేడుకలు మే 28 ఉదయం 11 గంటల నుండి సిడ్నీ, బ్లాక్ టౌన్ లోని బౌమన్ హాల్ నందు తెలుగుదేశం ఆస్ట్రేలియా వారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రముఖ అతిధులు విచ్చేయుచున్న ఈ కార్యకమానికి తెలుగువారందరూ ఆహ్వానితులే..

ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులకు ఎన్టీఆర్ బహుమతులు ప్రధానం చేయనున్నారు. వారు తెలుగువారైన శ్రీ మురళీ సాగి మరియు ప్రముఖ హృద్రోగ నిపుణులు క్లారా చౌ చలసాని.

Scroll to Top