అంతరంగం

ఓ పూదోటలో సీతాకోకచిలుకను చూస్తున్నాడు అతను…
నేనడిగాను….”ఏం చేస్తున్నావు?”
“హరివిల్లులో స్నానమాడి వచ్చింది చూడు సీతాకోకచిలుక” అన్నాడు
“నాకు గులాబీ పువ్వు ఎరుపు ఇష్టమన్నాను”
“కానీ గులాబీకి తన ఎరుపు నచ్చదన్నాడు”
సూర్యుడి కాంతిలో సప్త వర్ణాలు ఉన్నాయి…అన్ని పువ్వులో ఈ ఏడు రంగులను స్వీకరిస్తాయి….అయితే తనకు నచ్చని రంగును పువ్వు బయట ప్రదర్శిస్తుంది. అది తప్పు కాదు అన్నాడు విడమర్చి అతను.
ఆకాశంలో మాయాజాలం జరిగే సాయంకాల సమయం అది…
నేను పువ్వుల్ని చూపిస్తూ “చూడు…అస్తమిస్తుండటాన్ని మరచి నవ్వుతున్న పువ్వులు” అన్నాను….
“నువ్వూ ఓ పువ్వే” అన్నాడతను.
“అంతా అయోమయంగా ఉంది” అన్నాను….నేను
“చైతన్యంతో ఉండు…ఆనందంగా ఉంటావు…” నవ్వుతూ చెప్పాడతను.
“మనిషిని ఇలా మట్టిలో కప్పిన తర్వాత ఒక చెట్టుగా అతను మొలకెత్తితే ఎంత బాగుంటుంది” అన్నాడు.
ఎంత మంచి ఆశో అతనిది.
చెట్టుకింద రెండు కళ్ళపైనా రెండు గులాబీలు పెట్టుకుని పడుకున్నాడు అతను.
“ఏమిటి విశ్రాంతి తీసుకున్తున్నావు?” అని అడిగాను.
“ఆలోచిస్తున్నాను…శోధిస్తున్నాను….” అన్నాడు అతను.
ఒక మంచుబిందువు ఆకులో చడీ చప్పుడు చెయ్యకుండా పడిన తర్వాత ఇలా అన్నాను….
“మెదడు….హృదయం…నాలిక….ఇవన్నీ ఒక్కక్కొటే …వీటిలో మనిషి మెదడుని తప్ప మిగిలిన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు” అని.
“ఊపిరితిత్తులు, కళ్ళు, చెవులు….చేతులూ….కాళ్ళూ …ఇవన్నీ రెండేసి ఉన్నాయి మనిషికి…..వీటిలో ఊపిరితిత్తులు తప్ప మిగిలిన వాటిని మనిషి అంతగా వినియోగించడు…..” అన్నాడు అతను.
“ఈరోజు నువ్వు ఎక్కువగానే మాట్లాడావు…” అన్నాను….
“నేను మౌనంగానే ఉన్నాను. నేను మాట్లాడాననుకుని నువ్వే నాతో ఎక్కువగా మాట్లాడావు….” అన్నాడతను. ఆ మాటలకు విస్తుపోయాను….
నిజానికి హృదయంలో నిప్పూ మండుతోంది అన్నాను…….
వెంటనే “మండేది అల్లా నిప్పు కాదు…గాయం కూడా మండుతుంది….నీ హృదయంలో నీకు తెలియని గాయం” అన్నాడు అతను.

– యామిజాల జగదీశ్

Scroll to Top