ఆయన ఒక గురువు. బోలెడన్ని పుస్తకాలను చదివారు. ఒకటి అడిగితే పది చెప్పగల దిట్ట, ఆయనతో వాదించి గెలిచిన వాళ్ళు లేరు. మహామహులనుకున్న వాళ్ళందరూ ప్రగల్భాలు పలికి ఓడిపోయిన వాళ్ళే. అందరూ ఆయనను మహా గురువు అని పిలిచేవాళ్ళు.
ఆయనను చూడటానికి ఊళ్ళో ఉన్న వారే కాకుండా చ హుట్టు పక్కల వాళ్ళు కే ఊదా వస్తూ ఉంటారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా జనం తండోపతండలుగా తరలివస్తారు. ఆయనను చూసి ఆనందించే వారు కొందరు. ఆయనతో మాట్లాడి ఆనందించే వారు కొందరు. ఆయన మాటలు విని సంతోషించే వాళ్ళు కొందరు.
ఆయన చెప్పే మాటలు, బోధనలు విని తృప్తి చెండేవాళ్ళు ఎందరో. ఆయన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయినా ఆయన గురించే అందరూ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ఎంతో ఉన్నతంగా చెప్పుకుంటారు.
ఆయన చెప్పే మాటలు అందరినీ ఇట్టే ఆకట్టుకునేవి.
కోరికలు విడిచిపెట్టు….బంధాలను సమూలంగా వదులుకో….ఆశే అన్ని బాధలకు మూల కారణం…అని చెప్పే ఆయన ఆశ లేని మనసులో జ్ఞానజ్యోతి వెలుగుతుంది అని అంటూ ఉండేవారు.
రోజులు సాగుతున్నాయి
ఓసారి ఒక నావ లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆ నావలో ఉన్న వాళ్ళు అనతికాలంలోనే ఆయనకు శిష్యులయ్యారు. ఆయన మాటల్లోని బుద్ధం శరణం గచ్చామి అనేవి నిరంతరం వినిపిస్తూ ఉండేవి.
ఓ రోజు తెల్లవారుజామున నావ నుంచి చూడగా ఆయన కంటికి ఓ దృశ్యం కనిపించింది. అది చూసి ఆయన విస్తుపోయారు. నావలోని ఒక సిబ్బందిని పిలిచి దానిని చూపించారు. ఆ మనిషి “అదొక చిన్న దీవి స్వామీ…సముద్రంలో మునిగిన ఓ పర్వత పైభాగం సామీ” అన్నాడు.
“అక్కడ ఎవరు నివసిస్తారు?”
“అక్కడ జనం ఎవరూ లేరు. ఎవరో ముగ్గురు సాధువులు జనం ఎవరూ లేని ఆ దీవిలో ఉన్నరయ్యా”
“ఏమంటున్నావురా? సాధువులా?”
“అవును స్వామీ….అక్కడ ఒకటి రెండు రేగిపండ్ల చెట్లున్నాయి. వీళ్ళు ఎలా ఉంటున్నారో అక్కడ. విచిత్రమే”
“అయితే ఈ నావను అటువైపు తీసుకుపోవా?”
నావ స ఇబ్బంది ఆలోచనలో పడ్డాడు.
“పోనీ ఒక్క సహాయం చేయి. ఈ నావను ఇక్కడే ఆపేసే. ఒక పడవలో నేను మాత్రం అక్కడికి వెళ్తాను. వాళ్ళను సాధువులు అన్నావు కదా….వాళ్ళను తప్పకుండా చూడాలని ఉంది. వాళ్ళు ఏ మతస్తులో తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు పందితులితే వారితో వాదిస్తాను. ఒకవేళ సామాన్యులైతే నా మాటలు వాళ్లకు చెప్తాను. ఉపదేశిస్తాను. ఏది ఎలాగైనా ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళను చూడాలి. నేను తిరిగి వచ్చేటప్పుడు మహాయాన బౌద్ధ మార్గంలో కొత్తగా వాళ్ళు చేరుతారు” అన్నారు గురువుగారు.
నావ ఆగింది. గురువుగారు అందులో నుంచి దిగి మరో పదవ ఎక్కి దీవికి బయలుదేరారు. పదవ దీవి చేరింది. ఆయన వేగంగా దీవిలోకి అడుగుపెట్టారు.ఆయన ఎక్కువదూరం వెళ్ళకుండానే అక్కడున్న రేగు చెట్టు కింద కూర్చున్న సాధువులు కనిపించారు. వాళ్ళ ముగ్గురూ మౌనంగా గురువుగారి వంక చూసారు.
ముగ్గురూ వయస్సు మళ్ళిన వాళ్ళే. కానీ వాళ్ళ వేషధారణ చూస్తే బిక్షగాళ్ళ లాగా ఉన్నారు. మాసిపోయిన చినిగిన బట్టలతో కనిపించారు. వాళ్ళు గురువుకి ఒక్కసారిగా నమస్కరించారు. గురువు గారు కే ఊదా ప్రతినమస్కారం చేసారు.
“మీరు ముగ్గురూ సాధువులా?” అని గురువుగారు అడిగారు.
“కాదయ్యా” అన్నారు వారిలో ఒకడు.
“కాదా” అని గురువుగారు విచిత్రంగా అడిగారు.
“మా దగ్గర ఏముంది విడిచిపెట్టడానికి? మేము ఏది విడిచిపెట్టాలి? దేనినుంచి బయట పడాలి?” అన్నాడు రెండో వాడు.
“మీరు ఏ మతస్తులు?” అని గురువుగారు రెండో ప్రశ్న వేసారు.
“మతమా? అంటే ఏమిటండీ?”
“అంటే మీరు ఎవరిని ఆరాధిస్తారు?”
“ఆరాధనా?” అని ఇంకొకడు ఎదురు ప్రశ్నిస్తూ “మీరు ఎవరిని ఆరాధిస్తారు?” అని అడిగాడు.
“నేను మహాయాన బౌద్ధ మతానికి చెందినా వాడిని. బుద్ధుడి పాదకమలాలను పూజిస్తాను”
“ఓహో….అలాగా……బుద్ధుడినా….ఆయన ఆరాదను తగిన వారే….మేమూ ఆయనను ఆరాధిస్తాం”
“ఎలా ఆరాధిస్తారు” అని గురువు గారి ప్రశ్న.
“ఎలాగంటే…?”
“మీ ఆరాధనా తీరు తెన్నులు ఎలాగుంటాయి?”
“ఆరాధనా పద్దతా?ప్రత్యేకించి ఆరాధించే సమయమంటూ ఉండదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడే ఆరాధిస్తాం. భూమిని సృష్టించిన వాడికి నమస్కారాలు. బుద్ధుడికి నమస్కారాలు. బుద్ధుడికి ముందూ వెనుకా ప్రపంచంలో బాధలను జయించడానికి ప్రయత్నించిన వారందరికీ నమస్కారాలు. అంతే….ఇదే మా ప్రార్ధనా పద్ధతి. ఆ తర్వాత మా పనులు చేయడం మొదలుపెడతాం” అన్నారు ముగ్గురూ ఒక్క మాటగా….
గురువుకు నవ్వొచ్చింది.
“అది పద్ధతి కాదు. అన్నిం టికీ ఓ పద్ధతి ఉంటుంది. ఓ తీరు ఉంటుంది. నీతి నియమాలు ఉంటాయి. వాటిని నేను మీకు చెప్తాను …నాతో రండి” అన్నారు గురువుగారు.
ముగ్గురూ ఆయనను చుట్టుముట్టారు. గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. వజ్ర సూత్రాలు….స్తోత్రాలు …పాటలు ..ఇలా అన్నీ చెప్పారు. వాటిని విడమరిచి చెప్పారు. ఆరాధనా పద్ధతీ చెప్పారు. వాళ్ళు నేర్చుకునేలోపు సాయంత్రం దాటి చీకటి ఆవరించింది.
గురువు అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన మనసులో ఏదో చెప్పలేని గొప్పదనం చోటు చేసుకుంది. ముగ్గురు అమాయకులను తీరం చేర్చేసేననుకున్నారు. ఆయన తెగ ఆనందపడిపోతున్నారు.
పడవ తిరిగి గురువుగారితో బయలుదేరింది. ఇంతలో హోరుగాలి. చెవుల్ని చీల్చే ఘోష.
గురువుగారు చీకటి వంక చూసారు. నీటిలో ఏదో శబ్దం వినిపించింది. ఆ శబ్డంతోపాటు ఎవరో పిలుస్తున్నట్టు అన్పించింది.
దీవి న ఉంచి ఆ ముగ్గురూ సముద్రజలాలపై పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పడవ దగ్గరకు రావడంతోనే “అయ్యా, మీరు చెప్పింది మరచిపోయాం….దయయుంచి మన్నించండి. మరోసారి చెప్తారా” అని అడిగారు.
గురువుగారి కళ్ళల్లోనుంచి నీళ్ళు కారాయి.
“మీరే నన్ను మన్నించాలి. మీ ఆరాధనా పద్ధతి ఏదో అది మీరు పాటించండి. ఎందుకంటే అదే బుద్ధుడు చెప్పింది. అందులో నిరాడంబరత ఉంది. తేలికైనది. ఆయన ప్రేమించేదీ అదే….” అని గురువుగారు వారికి చెప్పి ముందుకి వెళ్ళిపోయారు.
అందుకే లారెన్స్ అనే సాధువు ఇలా చెప్పారు –
“గట్టిగా పదిమందికీ వినిపించేటట్టు చూసేటట్టు ప్రార్ధన చెయ్యక్కరలేదు. ఆయన మీరు అనుకున్న దానికన్నా ఎంతో దగ్గరలో మీ దగ్గరే ఉన్నారు” అని.
———————————————–
యామిజాల జగదీశ్