తొలినాటి భావకవి బసవరాజు అప్పారావు * జయంతి ఈనెల 13
********************************************************
భావకవితా యుగంలోని కవుల్లో ఒకనిగా తెలుగు సాహిత్యంలో ముఖ్య స్థానాన్ని పొందారు బసవరాజు వెంకట అప్పారావు. ఆయన జయంతి ఈనెల 13. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాల పరిచయం.
బసవరాజు అప్పారావు విజయవాడ సమీపంలోని పటమట గ్రామంలో, 13 డిసెంబర్ 1894 న జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. పాసైనారు. 1916లో రాజ్యలక్ష్మమ్మ ని వివాహం చేసుకున్నారు. గాంధీ ఉద్యమంతో ప్రభావితమై జాతీయ గీతాలు రాశారు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక, భారతికి సహాయ సంపాదకుడు గా పనిచేశారు.
బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావులు “భావకవులు” అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు రాస్తే, నండూరి జానపద శైలిలో గేయాలు రాసేవారు. అందుకే దేవులపల్లి “సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం” అని అన్నారు.
బసవరాజు అప్పారావు భార్య రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు. ‘అప్పారావు గారు – నేను’ పేరుతో ఆత్మకథ రచించారు.
అప్పారావు రాసిన పాటలను గూడవల్లి రామబ్రహ్మం తన సినిమా మాలపిల్లలో (1938) పరిచయం చేశారు. సూరిబాబు పాడిన “కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?” అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. కాంచనమాల సుందరమ్మలు పాడిన “నల్లవాడే గొల్ల పిల్లవాడు” చాలా ప్రాచుర్యం పొందిన పాట. “గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా” అనే పాటను బందా కనకలింగేశ్వరరావు పాడారు. తాజ్‌మహల్ను దర్శించినప్పుడే, “మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి” అనే పాటను రాశారు. ఆయన వ్రాసిన లలితగీతాలను టంగుటూరి సూర్యకుమారి, బాలమురళీకృష్ణ, రావు బాలసరస్వతీ దేవి మధురంగా పాడారు.
ఆయన సందర్శించని క్షేత్రం లేదు.దర్శించని సమకాలీన ప్రముఖులు లేరు.స్పృశించని భావకవితా శాఖ లేదు. ఇంతా చేసి ఆయన జీవించింది 39 ఏళ్లే! జీవితంలో కదిలించిన ప్రతి అనుభూతిని గీతంగా మలచుకున్నారు కవి బసవరాజు అప్పారావు.ఓసారి భార్య పై తీవ్ర కోపంతో అలిగారాయన. తీరా ఆమె గుత్తొంకాయ్ కూర వండడం తో ఆయన ఇట్టే కరిగి పోయారు. అప్పుడు రాసిన పాటే-“గుత్తి వంకాయ్ కూరోయ్ బావా,కోరి వండినానోయ్ బావా”. అసలు ప్రేమించక పోతేనే బతుకు వృథా అంటారాయన.”వలపెరుంగక బతికి కులికి మురిసే కన్నా వలచి విఫలమ్మొంది విలపింపమేలురా”అని పలికారు బసవరాజు. తొలినాటి భావకవి బసవరాజు అప్పారావు 1933 జూన్ 10న మరణించారు.
