నీరు నిప్పు గాలి నేలయు గగనంబు
పంచభూతములయి పరగుచుండు
శంఖ చక్ర గదలు సారంగ ఖడ్గములు,పం
చాయుధములు శేషశాయికగును
వజ్రవైడూర్య నీల ప్రవాళ పుష్య
రాగ మౌక్తికములు పద్మరాగ మరక
ములు గోమేధికముగూడి ధరణియందు
జెలగి నవరత్నములుగా ప్రసిద్ధినందు.
మలయ సహ్య గంధమాదన వింధ్య మ
హేంద్ర పారియాత్రలివియు శుక్తి
మంతమొకటిగూడి మహి సప్తకులపర్వ
తంబులగును భరతధాత్రియందు
కన్ను నాల్క త్వక్కు ఘ్రాణంబు జెవియు,జ్ఞా
నేంద్రియంబు లగుచు నెసగుచుండు
వాక్కు పాణి పాద పాయు లుపస్థ, క
ర్మేంద్రియంబులని వహించు బేళ్ళు.
ఆసియా యూరపాష్ట్రేలియా యమెరిక
ఆఫ్రికాలని ఖండంబు లైదు నేడు
క్షోణిజనసంఖ్య మున్నూరుకోట్లుగాగ
ఆసియాసంఖ్య నూరుకోట్లధిగమించు.