పని, విశ్రాంతి అనేవి ఒకదానికొకటి భిన్నమైనవి.
నిజానికి మనం ఒక్క క్షణం కూడా ఏ పనీ చెయ్యకుండా ఉత్తినే ఉండలేము. ఏదో రూపేణా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దానినే పనిగా చెప్పుకోవచ్చు.
అనుభవించడానికో, డబ్బు కోసం మాత్రమే పని చేయడం అంటూ చేస్తే అందులో స్వార్ధం ఉండే ఉంటుంది. అంతేకాదు అలా చేసుకుంటూ పోయే వాటిలో గందరగోళం, మానసికావస్థ పోటీపడి ముందుకొస్తాయి. వీటివల్ల కాస్సేపటికే చేసే పనిలో చాలా మందికి నీరసం వచ్చేసినట్టు అనిపిస్తుంది. వారాలు గడిచి ఎప్పుడు సెలవురోజైన ఆదివారం వస్తుందా అని మనసు ఎదురుచూస్తూ ఉంటుంది.
సరే, బాగానే ఉంది. తీరా సెలవురోజు రావడంతోనే ఎక్కువ శాతం మంది ఆ రోజుని ఎలా గడుపుతారు?
సెలవు రోజులో అక్కడికీ ఇక్కడికీ వెళ్ళడం, లేదా రోజంతా ఇంటిపట్టునే ఉంది టీవీయో లేదా ఇంటర్నెట్ తోనో కుస్తీ పడటమో లేదా నిద్రపోవడమో చేస్తారు. అయితే ఇటువంటివి మనిషికి నూతనోత్తేజాన్ని ఇవ్వవు.
బతకడానికీ, జీవిత అవసరాలు పూర్తి చేసుకోవడానికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి పని చెయ్యడం తప్పని సరి అవుతుంది.
ఒక చైనా కథకొద్దాం….
ఓ పెద్దాయన. ఆయన తత్వజ్ఞాని లావోత్సు శిష్యుడు. అయన ఒకరోజు తన కుమారుడితో కలిసి ఎంతో కాస్త పడి బావి నుంచి నీరు తోడుతున్నారు.
అప్పడు లావోత్సు సమకాలికుడు అయిన కన్ఫ్యూసియస్ ఆ వైపు వచ్చారు. తండ్రీకోడుకులను చూశారు. పెద్దాయనతో “మీరు మూర్ఖుల్లా ఉన్నారే….ప్రపంచం అదునాతనమైంది. నీళ్ళు తోడటానికి ఎడ్లను, గుర్రాలను ఉపయోగించే విషయం కూడా మీకు తెలీదా? మీరు కష్టపడటమే కాకుండా మీ అబ్బాయి శక్తినీ వృధా చేస్తున్నారు” అని అన్నారు.
అప్పుడు ఆ పెద్దాయన “నా కొడుకు సమక్షంలో ఇలా మాట్లాడకండి. వాడు మధ్యాన్నం భోజనానికి వెళ్ళిన తర్వాత మీ ప్రశ్నకు జవాబిస్తాను” అన్నాడు.
ఆ కుర్రాడు వెళ్ళిపోయిన తర్వాత “నాకిప్పుడు 90 ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళ యువకుడితో పోటీపడి పని చ హేసే శక్తి ఉంది. నా కొడుకు ఇప్పుడే ఈ పని కోసం ఎడ్లనో గుర్రాన్నో వాడితే 90వ ఏట అతనెలా ఆరోగ్యంగా ఉంటాడు? జంతువులను ఇప్పుడు ఉపయోగిస్తే వృద్ధాప్యపు ఆరోగ్యాన్ని అప్పుడు ఫణంగా పెట్టాల్సి ఉంటుంది” అన్నాడు పెద్దాయన.
ఈ కథ ద్వారా తెలుసుకోవలసింది ఏమిటంటే ఓ పని చేసేటప్పుడు దాని ప్రభావం మున్ముందు ఏదో రూపంలో చూపుతుంది అన్నది తెలుసుకోవాలి. మనం బాగా ఉండాలి అని ఆశ పడితే సరిపోదు, దానికి తగ్గ పని చెయ్యాలి. వయస్సు మళ్ళిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే యవ్వనంలో ఎక్కువ పని చెయ్యాలి. అది తప్పేమీ కాదు. అది మన మంచికే.
అదిసరే, అటువంటప్పుడు, చేసే పని మనల్ని ఎందుకు నీరస పరుస్తుంది? దేనికోసం విశ్రాంతి? ఏ పనీ చెయ్యకుండా ఉంటె అది విశ్రాంతి అవుతుందా?
ఆదమరచి హాయిగా నిద్రపోయేటప్పుడు కూడా చాలా పనులు మనకు తెలియకుండానే సాగిపోతుంటాయి.
ఇంటింటికి సరకులు తీసుకుపోయి ఇవ్వడంలో పని వాడికి నీరసం వస్తుంది. కానీ అటువంటి వ్యక్తే తీరా సెలవురోజున సముద్ర తీరాన కుటుంబసభ్యులతో కలిసి ఆడుతుంటే ఎలాంటి నీరసమో రాదు. పైగా ఆనందమే కలుగుతుంది.
ఎక్కువసేపు చదవడం వల్ల కలిగే అలసట పగలంతా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక్క యువకుడికీ అలసట అ నేది రాదు. పైగా ఎంతో ఉత్సాహంగా ఉంటాడు.
తప్పులు దిద్దే పని చేసే (ప్రూఫ్ రీడర్) ఓ వ్యక్తికి కలిగే అలసట తనకు నచ్చిన పుస్తకం చదువుతున్నప్పుడు ఎంతసేపు చదివినా ఏ అలసటా రాదు. పైగా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాడు.
అందుకే పనీ, విశ్రాంతి అనేవి ఎవరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో ఆలోచించాలి.
సరైన రీతిలో ప్రణాళిక ప్రకారం పని చేసుకుపోతే మనలో ఉత్సాహం పెరుగుతుందే కానీ తగ్గదు.
స్వామి వివేకానంద ఇలా అన్నారు – “మనం పూర్తి ఆసక్తితో అంతరాయం లేకుండా పని చెయ్యాలి. మనం చేసే పని ఏదైనా దానిపై పూర్తి మనస్సు లగ్నం చేయాలి. అంతేతప్ప ఏదో ఆశతో చెయ్యకూడదు. మనం చేసే పనిని మరేదో కారణంగా చేస్తే మనసు చెదరిపోతుంది. చేసే పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో చేయడం అలవరచుకోవాలి. చేసే పని వల్ల కలిగే ఫలితం మీద కాకుండా చేసే పని మీద దృష్టి కేంద్రీకరించడం , అంకితభావంతో చేయడం ప్రధానం అన్నది నా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప పాఠం” అని. బాధ్యత కోసం బాధ్యతగా, పని కోసం పనిగా చేయాలన్నారు. అప్పుడు అందులోని మర్మం తెలుస్తుందని చెప్పారు.
అహంకారాన్ని విడిచిపెట్టాలి….కోల్పోవాలి. నరచిపోవాలి. నేను అనేది దూరమయ్యే మేరకు దేవుడు మనలోకొస్తాడు. .భగవంతుడికి తమను అర్పించుకున్న వాళ్ళు తాము సమాజం కోసం ఉన్నామని చెప్పుకునే వారికన్నా ఎక్కువగా లోకానికి శ్రమిస్తున్నారు. తమను స్ఫటికంలా స్వచ్చంగా చేసుకున్న వాళ్ళు ఇతరులకన్నా ఎక్కువగానే పని చేస్తారు… సాధిస్తారు. స్వచ్చత నుంచి, మౌనం నుంచి పుట్టే మాటలు ఎంతో విలువైనవన్నారు స్వామీజీ.
భగవంతుడికి మనల్ని మనం అర్పించుకున్న తర్వాత నాది అని ముందు అనుకున్నవన్నీ ఇప్పుడు అతనిదిగా మారుతుంది. భగవంతుడిపై ఉన్న అభిమానానికి తగినట్టు మన స్వభావాలు, ఆశించ డాలు, భయం, దృష్టి వంటివి మారుతాయి. నా పని అని అనుకున్నది మరి అతని పని అని అనుకుని చెయ్యడం జరుగుతుంది. దీనినే రామకృష్ణపరమహంస తమ జీవిత అనుభావసారంగా పేర్కొన్నారు. “నా జీవితం నిరంతరమైనది. ఇప్పుడు చూసే ఈ మానవ జీవితం భగవంతుడికి చెందినది. అతను ఈ జీవితం మూలంగా ఏం చెయ్యాలని అనుకుంటాడో చేసుకుపోని” అని ఆయన అన్నారు.
ఇటువంటి మానసికస్థితి పొందిన వాళ్ళు మహాత్ములే అవుతారు. వాళ్ళు ఎలాంటి పనిలో ఉన్నా దిగులు చెందరు. మానసిక ఒత్తిడికి లోను కారు. గందరగోళానికి లోను కారు. పని చేసిన తర్వాత వాళ్లకు విశ్రాంతి అవసరముండదు. వాళ్లకు వాళ్ళ పనే మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. మానసిక ఆనందం కూడా కలుగుతుంది.
అంతా భగవంతుడి చర్యే…నేనేమీ కాదు ….చేసేదంతా భగవంతుడే అనేది తెలుసుకోవాలి అంటారు రామకృష్ణ పరమహంస.
—————————
యామిజాల జగదీశ్