భాగవతం కథలు – 1

నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం
—————————–
నారదుడు దేవర్షి. దైవయోగంతో వీణాగానంతో ఎప్పుడూ హరి నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఒకరోజు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చిన నారదుడు తన గురించి ఇలా చెప్పుకున్నాడు.

పూర్వజన్మ పుణ్యఫలంతో హరి కథాగానం చేస్తూ ముల్లోకాలూ సంచరిస్తూ ఉండే నారదుడు పూర్వజన్మలో ఓ ఇంటి దాసికి కొడుకై పుడతాడు. చిన్నతనంలోనే పెద్దలు పంపగా చాతుర్మాస్య వ్రతం పాటించే యోగిజనులకు ఎంతో భక్తితో పరిచర్యలు చేస్తాడు. అతని సేవా తీరు నచ్చి మెచ్చుకున్న యోగిజనులు తాము యాత్రకు వెళ్లే ముందర అతనికి విష్ణు తత్వం ఉపదేశిస్తారు. వారి దయతోనే వాసుదేవుడి గురించి తెలుసుకుంటాడు. కర్మలు సంసార కారణం అయినప్పటికీ ఈశ్వర అర్పిత బుద్ధితో చేసినప్పుడు ఈశ్వర సంతోషాన్ని, భక్తిని పుట్టిస్తాయని తెలుసుకుంటాడు. అంతేకాదు, ఓంకారంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధమూర్తి మాటలు గల నాలుగింటిని భక్తితో స్మరించి నమస్కారం చేస్తే సమ్యగ్దర్శనుడవుతాడని కూడా గ్రహిస్తాడు.

అనంతరం ఒకరోజు రాత్రి అతని తల్లి ఆవు పాలు పితకడానికి చీకట్లో పోతుంది. అయితే ఆ చీకట్లో అడుగు ఎక్కడ పడుతోందో కూడా తెలియకుండా ఆమె కాలు ఒక పాము మీద పడుతుంది. ఆమె పాదం తగలడంతోనే పాము ఆమె పాదాన్ని కరుస్తుంది. దానితో ఆమె చనిపోతుంది. అయితే తల్లి మరణాన్ని తలచుకుని అదే పనిగా విచారించకుండా అతను ఉత్తర దిశలో చాలాదూరం ప్రయాణించి ఓ అడవిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఓ చెరువు కనిపిస్తుంది. అందులో నీరు తాగి దాహంతీర్చుకున్న అతను పరమాత్ముడిని ధ్యానం చేసుకుంటాడు. ఆ ధ్యానంలో అతని మనసులో దేవుడు కనిపిస్తాడు. అయితే వెంటనే అతను ధ్యానంలో నుంచి లేచిచూడగా ఆ రూపాన్ని చూడలేకపోతాడు. దానితో బాధ పడతాడు. మదిలోచూసిన మూర్తిని చూడలేకపోయానే అన్న విచారంతో అడవిలోనే గడుపుతాడు. అయితే ఆ అదృశ్యరూపంలోనే హరి అతనిని ఆదేశిస్తాడు ఇలా –

“బిడ్డా, ఎందుకు బాధ పడతావు? ఈ జన్మలో నువ్వు నన్ను చూడ లేవు….నీ కోరిక తీర్చడం కోసం మాత్రమే నీ మదిలో నా రూపం చూపించాను. అరిషడ్వార్గాన్ని జయించిన ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ధ్యానం చేసే యోగులు మాత్రమే నన్ను చూడగలరు. కనుక నువ్వు కూడా సద్భక్తితో ఉంటే నువ్వు కూడా నన్నుచూడగలవు. నా మీద భక్తి సడలనీయకు….నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టు. ఈ సృష్టి లయమైన ఆ కాళరాత్రి గడిచి పునః సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు నువ్వు జన్మించి నా మీది భక్తితో శుద్ధ సాత్వికుడివై ఉంటావు” అని అంతర్థానం అయినా తర్వాత అతను హరి నామాలుజాపిస్తూ సమయంకోసం నిరీక్షిస్తాడు.
కొన్నిరోజులకే మృత్యువు సమీపిస్తోంది. అప్పుడు ఆ దేహాన్ని చాలించి జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించి బ్రహ్మ శ్వాస ద్వారా ఆయనలోకి ప్రవేశిస్తాడు.

వేయి యుగాలు గడిచాయి.

ఆ తర్వాత బ్రహ్మ లేచి లోకాలను సృజించడానికి పూనుకుంటాడు. ఆ సమయంలోనే బ్రహ్మ ప్రాణాల నుండి మరీచి తదితర మునులతో పాటు నారదుడు కూడా పుట్టి బ్రహ్మకి మానస పుత్రుడు అయ్యాడు.
అంతేకాదు బ్రహ్మచర్య దీక్షతో ముల్లోకాలలో విష్ణువు అనుగ్రహంతో యథేచ్ఛగా సంచరిస్తూఉంటాడు. అతని వీణ పేరు మహతి. అది తనకు తానుగా సప్తస్వరాలు పలికే వీణ. నారదుడు నిత్యమూ నారాయణ నారాయణ అంటూ నారాయణ కథాగానం చేస్తూ సంచరిస్తూ ఉంటాడు. ఆయన మనసులో నారాయణుడు ఎప్పుడూ సాక్షాత్కరిస్తూఉంటాడు. శ్రీహరి కథాగానంతో నారదుడి మానసిక ప్రశాంతతకు ఏ మాత్రం లోటు ఉండదు.
సంసార సాగరాన్ని తరించాలి అని అనుకునే వారికి శ్రీహరి నామ స్మరణ ఆవశ్యమని నారదుడు చాటిచెప్పాడు.
—————————
యామిజాల జగదీశ్

Scroll to Top