నారద – బ్రహ్మ సంభాషణ
నారదుడు బ్రహ్మను కలిసి “నువ్వు చతుర్ముఖుడివి. సృస్తికర్తవు. వేదసమూహమంతా నీ ముఖ పద్మాలలో వికసిస్తున్నాయి. శబ్దాలు, అర్ధాలు కూడిన నీ స్వరం మధురం. సరస్వతీదేవి నీ ఇల్లాలు. నాదో మాట. సృష్టి చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది. అందుకు ఆధారం ఏమిటి? కారణం ఏమిటి? నువ్వు ఏ విధంగా ఈ సృష్టిని సాగిస్తున్నావు? నాకనిపిస్తోంది నువ్వే సర్వాదికారివని. నువ్వు వాస్తవం చెప్పు. అసలు నేక్కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా? లేక నువ్వే రాజువా? సృష్టి కార్యమా వల్ల నీకు కలిగే లాభం ఏమిటి? ఈ చేతనా ప్రపంచం అంటా ఎందులో నుంచి పుట్టింది? ఈ విశ్వం అంతా నీ హృదయంలోనిదే కదా? నిన్ను మించిన వారు బహుసా ఉంటారనుకోను. నువ్వు సర్వోత్తముడివి.
అయినా నాదో ప్రశ్న. ఇంత శక్తియుక్తులు కలగడానికి నువ్వు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేసావు? నాకు కూడా ఆ తపో మార్గం చెప్పవా?
ఒకవేళ నీకన్నా మరో ప్రభువు ఉన్నాడని అంటే వాడేవడు? నువ్వీ వివరాలు అన్నీ చెప్తే నేను ఆ విషయాలను నలుగురికీ చెప్తాను. నీకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. ఇందులో అనుమానం లేదు” అని అన్నాడు..
అప్పుడు బ్రహ్మ ఓ నవ్వు నవ్వాడు.
“నువ్వు అడిగినట్టు నన్ను ఎవరూ ఇంతలా అడగలేదు. అందుకే నీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నువ్వు బంగారం లాంటి వాడివి. నువ్వు అడిగిన వాటిని చెప్తాను. విను…
నేను ఈ సృష్టిని ప్రారంభించే విజ్ఞానం ఎవరు కలిగించారో వారి ఆజ్ఞ మేరకే ఈ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను. అంతకు మించి నాకు శక్తి లేదు. ఈ విశ్వ వెలుగు సూర్య, చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలవల్ల వస్తోంది. ఆ దీప్తికి మూల కర్త ఎవడో అతనే వీటన్నింటికీ కారకుడు. అతనికి నా నమస్సులు. విష్ణుమాయతో ప్రజ్ఞ కుంటుపడి నన్ను ఈశ్వరుడు అనుకుని భావించి మొక్కే వారిని చూసి నాకు నవ్వు వస్తుంది. ఇదంతా హరి మాయ. కాల పరిణామ హేతువైన స్వభావం వాసుదేవుడని తెలుసుకో. అలాగే ఈ జీవుడు కూడా అతడే. ఈ లోకానికి మూలం నారాయణుడే. దేవతలు అతని నుండి పుట్టిన వారే. వేదయాగం, తపోయోగం విజ్ఞానం అంతా నారాయణ ప్రసాదమే. జ్ఞానంతో పొందే ఫలమూ నారాయణుడి సంపదే. నేను అతని ఆజ్ఞ తోనే ఈ సృష్టి కార్యం చేస్తూ ఉంటాను. ఈశ్వరుడు నిర్గుణుడు. సత్వ, రాజ, తమో గుణాలన్నీ సృష్టి స్థితి లయలకు పాల్పడుతుంటాయి. ఈశ్వరుడే అనంతమైన హరి. అతనే అందరికీ నాయకుడు. అతను లేనిది ఏదీ లేదు. హరి నాభికమలం నుంచి పుట్టిన నేను అతని గురించి తపస్సు చేసాను. యజ్ఞం చేసాను. అప్పుడు పరమేశ్వరుడు లోకాలు కల్పించడానికి పూనుకున్నాడు. ఈ సమస్తానికి హరియే విభుడు. కారణభూతుడు. ఆయన అనుగ్రహంతోనే నేనిది చెప్పాను. ఇది సత్యం. నిత్యం. అందుకే నేను ఆ దేవదేవుడి పాదార విందాలకు ఎప్పుడూ భక్తిప్రపత్తులతో మొక్కుతుంటాను. ఆ మహాత్ముడికి పుత్రుడిని. సృష్టి కర్తనూ. కానీ ఏం లాభం…నా జన్మ ప్రకారం నాకే తెలీదు. ఆయన మహత్తు తెలుసుకోవడం అంత తేలికా? అయినా నేనేపాటి వాడిని? నేను స్వతంత్రుడిని కాను. ఈ సమస్త సృష్టికి విష్ణు మాయే కారణం. హరి అన్నింటిలోనూ ఉన్నాడు” అన్నాడు.
(శ్రీహరి లీలావతారం తదుపరి భాగంలో తెలుసుకుందాం)
యామిజాల జగదీశ్