కర్దముడికి శ్రీహరి ప్రత్యక్షం
కర్దముడు ఒకానొక ప్రజాపతి. వేదాలను భూమి మీద వెలయించడానికి బ్రహ్మ దేవుడు కర్దముడిని సృష్టించాడు.
సరస్వతి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. వేదమే శరీరంగా కలిగిన కర్దముడి తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు ఆనందపరవశుడయ్యాడు. తన మనోరథం సిద్ధిన్చినట్టు తలచి శ్రీహరికి నమస్కరిస్తాడు. శ్రీహరి దివ్యముఖాన్ని ఆసక్తితో చూస్తాడు.
“హరీ! అంతరాత్మ రూపంలో ఉండే నీ దర్శన భాగ్యం కలగడం చాలా కష్టం. అనేక జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ యోగీశ్వరులు ఆత్మయందు నీ దర్శనం కోరి తపిస్తుంటారు. నువ్వు నీ పాదారవిందాలకు కోరి భజించిన వారికి వారి కోరికలు తీరుస్తావు. నేను త్రివర్గ ఫల సాధన కోసం ఓ లక్ష్తణ వతి అయిన భార్య కోసం తపస్సు చేసాను. కానీ ఇక్కడో విషయం చెప్తున్నాను. కర్మమయమైన నీ అజ్ఞా చక్రం అనుసరించడానికే తప్ప కామపూర్తికోసం కాదు. ఓ మహాత్మా…సర్వేశ్వరా…సాలె పురుగు తన నుంచే తంతువులను పుట్టించి వల పన్నుతుంది. తిరిగి ఆ వలలోనే కలిసిపోతుంది. అలాగే నువ్వు నీలోకే మమ్మల్ని తీసుకుంటావు. నీ మహిమను ఎవరు పొగడగలరు. అది మాటలకు అతీతం. నువ్వు నీ సుఖకరమైన శుభప్రదమైన రూపాన్ని విస్తరింప చేయడం మాలాటి వారికోసమేగా….భక్తుల కోరికలను తీర్చడంలో నీకు నువ్వే సాటి….” అని అంటాడు కర్దముడు.
అంతట శ్రీహరి “నీ సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. బ్రహ్మావర్త దేశంలో స్వాయంభువ మనువు ఏడు మండలాలతో కూడిన భూమండలాన్ని పాలిస్తున్నాడు. అతని కూతురు దేవహూతి. ఆమె నా భక్తురాలే. నీకు తగిన భార్య అవుతుంది. ఆ మనువు తన భార్య శతరూపాదేవితో వచ్చి తమ కుమార్తెను నీకు సమర్పిస్తారు. అప్పుడు ఆమెతో నీ కోరిక ఫలిస్తుంది….మీకు తొమ్మిదిమంది అందమైన ఆడపిల్లలు పుడతారు. వారందరూ మహామునులకు భార్యలవుతారు. మంచి సంతానాన్ని కంటారు. నువ్వు ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ మేరకు ప్రజాసృష్టికి కారణం అవుతావు” అంటాడు.
అక్కడితో ఆగని శ్రీహరి ఇలా అంటాడు
“నేనే స్వయంగా నీ భార్య గర్భంలో ప్రవేశించి కొడుకుగా జన్మిస్తాను…నీకు తత్వోపదేశం చేస్తాను….” అని అంతర్దానమవుతాడు.
శ్రీహరి తన పట్ల చూపించిన అనుగ్రహానికి కర్దముడు ఎంతో సంతోషించాడు. శ్రీహరి కరుణారస బిందువులతో ఏర్పడిన బిందు సరస్సు వద్దకు వెళ్లి కర్దముడు శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటాడు.
అటు తర్వాత కర్దముడి ఆశ్రమానికి మనువు వస్తాడు. అతనిని ఆదరించిన కర్దముడు శ్రీహరి ఆజ్ఞను దృష్టిలో ఉంచుకుని మనువుతో ఇలా అంటాడు –
“ఓ మనువా! నీ పర్యటన శిష్ట రక్షణకు దుష్ట నిగ్రహానికే కదా! నువ్వు సాక్షాత్తూ హరి స్వరూపుడివి. నీకు ఇదిగో నా వినయపూర్వక నమస్సులు” అని నమస్కరిస్తాడు.
“నువ్వు నా ఆశ్రమానికి రావడానికి కారణం ఏమిటో చెప్తే బాగుంటుంది” అని కపర్దముడు అంటాడు.
అంతట మనువు కర్దముడితో “బ్రహ్మ తాను వెలువరించిన వేదాలన్నిటినీ భూమిపై విస్తరింప చేయటానికి తన ముఖం నుంచి మిమ్మల్ని, ఇతర భూసురులను పుట్టించాడు….దుర్మార్గుల కంట ప్రజలు పడకుండా ఉండటానికి ఆ బ్రహ్మ నన్ను తన బాహువుల నుంచి పుట్టించాడు. మనమందరం శ్రీహరికి అవశ్య రక్షకులమయ్యాం. మహర్షీ ఇదిగో నాతో ఉన్న ఈమె నా కుమార్తె. పేరు దేవహూతి. ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఎందరో ముందుకొచ్చారు. అయితే వారినెవ్వరిని కాదని నారదుడి వల్ల మీ విషయాలు తెలిసి మిమ్మల్ని పెళ్ళాడటానికి నిర్ణయించుకుంది. మీరు కాదనకుండా నా ఈ పుత్రికను పెళ్లి చేసుకోవాలి. మీరు చేసుకోబోయే పెళ్ళితో నేను ధన్యుడనవుతాను” అని చెప్తాడు మనువు.
కర్దముడు అలాగే కానివ్వమని చెప్తాడు.
కర్దముడు దేవహూతి సౌందర్యానికి ముగ్ధుడు అవుతాడు.,
“మీ మాట నేను తిరస్కరించను. లక్ష్మీ సమానురాలైన మీ కుమార్తెను నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక్క షరతు. అది మీకు చెప్పడం నా వంతు. నేను ఎక్కువ కాలం సంసార చట్రంలో ఉండను. నా భార్య సంతానవతి కాగానే నేను సన్యాస ఆశ్రమానికి వెళ్ళిపోతాను. అందుకు మీరు ఇష్టమైతే మీ అమ్మాయిని ఇవ్వండి. అప్పుడే నేను మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాను” అంటాడు కర్దముడు.
అలాగే అంటాడు మనువు.
మనువు తన భార్యా బిడ్డలతో సంప్రదిస్తాడు. అలాగే అనడంతో కర్దముడి పెళ్లి దేవహూతితో జరుగుతుంది.
ఆమె పతిభక్తి తత్పరత అమోఘం. ఆమె ఓ మహారాజు కుమార్తె అయినప్పటికీ తపస్వి అయిన కర్దముడిని అనుసరిస్తుంది. కర్దముడినే ప్రత్యక్ష దైవంగా భావిస్తుంది.
ఓరోజు కర్దముడు తన పట్ల దేవహూతి చూపుతున్న పతిభాక్తికి సంతోశించి అందుకు కారణం తెలుసుకోగలిగే దివ్యదృష్టిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆమెకు సమస్త జీవుల భూత, భవిష్యత్తు, వర్తమానాలు తెలుసుకునే ప్రజ్ఞ కలుగుతుంది.
మరొక రోజు కర్దముడు ఆమెను పిలిచి తనకు తీరని కోరిక ఉంటే చెప్పమంటాడు. ఆ మాటకు ఆమె కాస్సేపు మౌనం వహిస్తుంది. అలాగే తల వంచుకుని ఓ చిన్న నవ్వు నవ్వుతుంది సిగ్గుపడుతూ. ఆమె నవ్వుని బట్టి ఆమెకు ఏదో కోరిక ఒకటి ఉందని గ్రహిస్తాడు కర్దముడు. ఆమె ముఖాన్ని తనవైపునకు తిప్పుకుని “నా దగ్గర నీకెందుకు మొహమాటం. నేను తీర్చలేనా నీ కోరికా? నీకు ఏది అడగాలనిపిస్తే అది అడుగు. నేను మనఃపూర్వకంగా తీరుస్తాను. కనుక నువ్వు ఆలోచించకు. సిగ్గు పడకు. నీ కోరికేమిటో చెప్పు” అంటాడు.
అప్పుడు ఆమె కర్దముడి వంక చూసి “స్వామీ! మీరు అన్ని విధాలా సమర్దుడివి. నువ్వు తలచుకుంటే సకల భోగభాగ్యాలూ ప్రసాదిస్తావు. అది నాకు బాగానే తెలుసు. శరీర సాంగత్యం అవసరం. కామ తంత్రంలో నన్ను శిక్షితురాలిగా చేసి నన్ను అనుగ్రహించండి. మీ ప్రసాదంతో మీతో కలిసి సకల భోగభాగ్యాలూ అనుభవించాలి అనే కోరిక అలాగే ఉండిపోయింది. మీరు గట్టిగా అడిగారు కనుక ఈ కోరిక చెప్పాను” అని మనసులోని మాటను చెప్తుంది.
మరుక్షణం కర్దముడు ఒక దివ్య విమానాన్ని సృష్టిస్తాడు. అందులో ఆమెకు దివ్య అస్త్రాలూ అలంకారాలూ భారీగా సేవకులనూ కల్పిస్తాడు.
అన్ని ఏర్పాట్లు చేసినా దేవహూతి ముఖం చిన్నబోయే ఉంటుంది.
ఆమెను దగ్గరకు తీసుకుని ఇంకా ఎందుకు దీనంగానే ఉన్నావని అడుగుతాడు కర్దముడు.
“ఓ జవరాలా! ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా….ఇక్కడి బిందుసరంలో స్నానం చెయ్యి. ఇక్కడ స్నానం చేసినట్లైతే ఏ ప్రాణికైనా కోరికలన్నీ తీరుతాయి. వెంటనే స్నానం చేసి ఈ విమానం ఎక్కు” అని కర్దముడు బుజ్జగిస్తాడు.
ఆమె ఆలస్యం చేయకుండా భర్త మాటను పాటిస్తుంది. భర్త చెప్పిన సరోవరంలోకి ప్రవేశిస్తుంది. అంతే మరుక్షణం ఎందరో సుందరీమణులు ఆమె చుట్టూ చేరుతారు. మీ మాట కోసం మీకు సేవ చేయడానికి వచ్చాం అంటూనే ఆమెకు నలుగు పెట్టి స్నానం చేస్తారు. మంచి వస్త్రాలు కడతారు. దేహానికి కస్తూరి పూస్తారు. అలంకరణలు చేస్తారు. రుచికరమైన ఆహారం తినిపిస్తారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెడతారు.
దేవహూతి సౌందర్యంతో మెరుస్తుంటుంది. భర్తను మనసులో తలచుకుని ఆనందిస్తుంది. ఆ క్షణమే కర్దముడు పరిజనంతో ఆమె ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆయనను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కర్దమ దంపతులు ఆ దివ్యవిమానంలో అనేక లోకాలు సందర్శిస్తారు. కామభోగాలు అనుభవిస్తారు.
ఆమెకు అన్ని విధాలా తృప్తి కలిగిస్తాడు కర్దముడు. ఆమెకు తొమ్మిది మంది కుమార్తెలు పుడతారు.
అనంతరం కర్దముడు ఆమెతో మాట్లాడుతూ “నీకు మన పెళ్ళికి ముందే ఓ మాట చెప్పాను. సంతానం కలిగే వరకే నేను నీకు భర్తగా ఉంటాను అని. ఆ తర్వాత నేను సన్యసిస్తాను. నువ్వు అనుమతిస్తే నేను ఇక సన్యాస ఆశ్రమం స్వీకరిస్తాను” అంటాడు.
అయితే ఆమె ఆయన మాటకు బాధపడుతుంది. తమ కుమార్తెల పెళ్లి జరిపించి తనకు తత్వ ఉపదేశం చేయగల ఓ మహనీయుడిని పుత్రుడిగా ప్రసాదించే వరకూ ఉండాలని కోరుతుంది.
– యామిజాల జగదీశ్