పురంజనుడి ముగింపు
పురంజనుడు రాత్రి పగలూ అనే తేడాలేకుండా ఎప్పుడూ భార్యతోనే గడుపుతుండేవాడు. కోరికలు తీర్చుకోవడం తప్ప మరో పని లేదన్నట్టు ఉండేవాడు.
పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది మంది కుమార్తెలు పుట్టారు. కొడుకులందరూ రణధీరులే. కుమార్తెలందరూ కులపావనులైన గుణవంతులే.
పురంజనుడు ఆయవులో అప్పటికి సగం పూర్తయింది. పురంజన దంపతులు తమ సంతానానికి వెతికి వెతికి మరీ పెళ్ళిళ్ళు చేశారు.
పురంజన కొడుకులకు ఒక్కొక్కరికీ వందేసి మంది సంతానం కలిగారు. పురంజన వంశం పెరుగుతూ వచ్చింది. తన వంశం సకల సంపదలతో తులతూగడం కోసం పురంజనుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు. అంతేకాదు, ఎన్నో ఆవులను బలి ఇచ్చాడు. భార్యతోనూ, కన్న సంతానంతోనూ ఎంతో ప్రేమగా ఉంటూ వచ్చాడు. ఎక్కడా ఏ లోటూ రాకుండా చూసుకంటూ వచ్చాడు. అయితే అతనికి కాలం వక్రించింది.
అతనికి గంధర్వ రాజు చండవేగుడు విరోధి. ఆ గంధర్వ రాజు ఓసారి తన వీరులతో పురంజనుడిపై దండెత్తాడు. పురంజనుడి రాజ్యాన్ని చుట్టుముట్టాడు. గంధర్వ రాజు వెంట వచ్చిన వీరులు ఒంటరిగా రాలేదు. వారందరూ తమ తమ ప్రియురాళ్ళతో వచ్చారు.
అప్పుడు పురంజనుడి నగరానికి ప్రజాగరుడనే రక్షకుడు ఉన్నాడు. ఆ ప్రజాగరుడు దాదాపు వందేళ్ళు గంధర్వుడితో పోరాడి నగరం ప్రత్యర్థుల హస్తగతం కాకుండా తన వంతు ప్రయత్నం చేశాడు. మరోవైపు పురంజనుడు మాత్రం రాజమందిరం వీడి బయటకు రాలేదు. ఎప్పుడూ భోగభాగ్యాలతో గడుపుతూ వచ్చాడు. తన రక్షకుడు ప్రజాగరుడు పడిన కష్టాన్ని పురంజనుడు అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రజాగరుడు బలం క్షీణిస్తూ వచ్చింది. చివరికి యుద్ధంలో పరాజయం పాలయ్యాడు.
ఈ విషయం తెలిసికూడా పురంజనుడు రాజ్యాన్ని రక్షించుకోడానికి ఎలాంటి ఆసక్తి చూపలేదు.
ఇదిలా ఉండగా, యయాతి కుమారుడైన పూరువు అనే అతనిని వధించి దుర్భగ అనే యువతి తనకు దీటైన మగవాడి కోసం లోకమంతా వెతుకుతూ వచ్చింది. ఆమె వెతికి వెతికి చివరికి భయుడు అనే యువరాజు తమ్ముడైన ప్రజ్వారుడు అనే అతనిని వరించి పెళ్ళి చేసుకుంది. ఈ ప్రజ్వారుడిని సైనికాధిపతిగా చేసి తన సైన్యాన్ని భయుడు పురంజనుడి రాజ్యం మీదకు పంపాడు. ప్రజ్వారుడితోపాటు అతని భార్య కూడా పురంజనుడి రాజ్యంపై జరిగిన దండయాత్రలో పాల్గొంది. ఆమె కాలకన్యక. ఆమెకో శక్తి ఉంది. అదేంటంటే ఆమె ఎక్కడైతే కాలు పెడుతుందో అక్కడి పురుషులు చైతన్యాన్ని కోల్పోతారు. జడస్వభావులవుతారు. ఈ కారణంగా పురంజనుడు ఒకానొకప్పుడు వీరుడైనా శూరుడైనా ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో తన పరివారంతో వారికోసం బాధ పడుతూ రాజ్యం విడిచిపెట్టి పోతాడు. అయితే ఇంతలో భయుడు అక్కడికి వచ్చి పురంజనుడిని పట్టుకుంటాడు.
అప్పుడు కూడా పురంజనుడు పుత్రుల కోసం బాధ పడతాడు తప్ప పరమేశ్వరుడిని స్మరించడు.
భయుడు పురంజనుడిని పట్టుకుని పరలోకానికి పంపుతాడు.
అక్కడ విచిత్రమైన సంఘటన జరుగుతుంది. పురంజనుడు యజ్ఞాలు చేసినప్పుడు బలి ఇచ్చిన ఆవులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి నిరీక్షిస్తున్నాయి. ఆ ఆవులన్నీ పురంజనుడిని నానా విధాలుగా కష్టపెడతాయి.
మరుసటి జన్మలో ఈ పురంజనుడు విదర్భ రాజుకు కూతురుగా పుట్టాడు. ఆమె పేరు ప్రమదోత్తమ.
– (సశేషం)
– యామిజాల జగదీశ్