భాగవతం కథలు – 7

ధర్మదేవత, భూమాతల సంవాదం
———————–
కృపాచార్యుడిని గురువుగా చేసుకుని పరీక్షిత్తు గంగ ఒడ్డుకి వస్తాడు. అక్కడ యాగ భాగాలు గ్రహించడానికి వచ్చిన దేవతలను చూస్తాడు. వారికి భూరి దక్షిణలు ఇస్తాడు. మూడు అశ్వమేధ యాగాలు చేస్తాడు. ఆ సమయంలో గో మిధునాన్ని కొడుతున్న ఒక శూద్రుడి రూపంలో రాజ చిహ్నాలు ధరించిన కాలిని చూసి అతనిని నిగ్రహిస్తాడు పరీక్షిత్తు.

ఇంతకూ రాజు వేషంలో ఉన్న ఆ శూద్రుడు ఎందుకు గోవుని తన్నాడు? పరీక్షిత్తు కాలిని ఎలా నిగ్రహించాడు? వంటివి ఇక్కడ చూద్దాం.

అరవిందాక్షుడైన శ్రీహరి పాదార విందాలలోని మకరందాన్ని ఆస్వాదించడం, సజ్జనుల చరిత్రలు తెలుసుకోవడం ఎంతో మేలు. అయితే అటువంటి వారి చరిత్రలు తెలుసుకోకుండా సంసార మోహంలో పడిపోవడం అఙ్ఞానమే అవుతుంది.

ఈ జీవితం శాశ్వతం కాదు. మరణం ఖాయం అని తెలిసికోవాలి. కనుక మోక్ష స్థితి తెలుసుకోవాలి.

బతికినన్ని రోజులు దుర్వార్తలు వినకుండా శ్రీహరి చరిత్ర వినాలి. చదవాలి.

పరీక్షిత్తుడు తన రాజ్యంలోకి కలి ప్రవేశించిన విషయం గ్రహిస్తాడు.

ఒకరోజు పరీక్షిత్తు ఎంతో ఉల్లాసంతో విల్లంబులతో నీలి వర్ణ అశ్వాలు లాగుతున్న రథముమీద చతురంగ బలగాలతో బయలుదేరుతాడు. అనేక దేశాలు గెలుస్తూ పోతాడు. జయించిన దేశాల పాలకుల నుంచి ధనవస్తువులు కప్పంగా తీసుకుంటాడు. దారి పొడవునా వందిమాగధులు చేసే స్తోత్రాలతో పాండవుల చరిత్ర, శ్రీకృష్ణుడి లీలలు వింటూ వస్తాడు. అశ్వత్తామ అస్త్ర జ్వాలల నుంచి తనను ఆదుకున్న శ్రీహరి గురించి తెలుసుకుంటాడు. ఆశ్చర్యపోతాడు. యాదవుల భక్తిరసం తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడిపై మనస్సుని లగ్నం చేసుకుని ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. అటువంటి సమయంలో వృషభ రూపంతో ఏక పాదంతో సంచరిస్తూ ఉన్న ధర్మదేవుడిని, ఆవు రూపంలో ఉన్న కళ్ళ నుంచి అశ్రువులను కారుస్తున్న భూదేవతను చూస్తాడు.

ధర్మదేవత భూమాతతో “తల్లీ ! ఎందుకు బాధపడుతున్నావు? నీ శరీరం చిక్కి సగమైంది. నీ ముఖంలో తేజస్సు లేదు. నీ బంధువులు భయంతోనూ, బాధతోనూ నలిగిపోతున్నారా? ఏమిటీ ఆవేదన? దేనికోసం? యజ్ఞయాగాదులు లేకపోవడం వల్ల ఇక దేవతలకు ప్రధానమైన భాగాలు ముట్టవని భాదపడుతున్నావా? భర్తలు తమ భార్యలను రక్షించుకోలేరని బాధ పడుతున్నావా? తండ్రులు తమ సంతానాన్ని చూసుకోలేరనా నీ బాధ? రాజులు తగిన సలహాలు వినిపించుకోరని దిగులుపడుతున్నావా? ఇంద్రుడు వర్షాలు కురిపించకపోతే అనావృష్టితో ప్రజలు బాధపడతారనా? భూమిని పాలకులు హీనంగా పాలిస్తారన్నా? ఏమిటి నీ బాధ? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఇన్ని రోజులు కాపాడిన శ్రీకృష్ణుడు ఇప్పుడు అనాథను చేసి వెళ్లిపోయాడని బాధా? కృష్ణావతారం ముగిసిపోవడంతో ఈ కలి కాలంలో పాడి తప్పినట్టు బాధ పడుతున్నావా?” అని అడుగుతాడు.
అప్పుడు భూమాత ఇలా చెప్పింది –

“ఈ లోకంలో పూర్వం ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. ఇప్పుడు శ్రీహరి లేకపోవడంతో ధర్మం ఒంటికాలిదయ్యింది. సత్యం, శౌచం, దయ, త్యాగం, సహనం వంటివి లేకుండాపోతున్నాయి. సద్గుణాలు కలిగిన శ్రీకృష్ణావతారం చాలించేసరికి కలి ప్రేరణతో ప్రజలు పాపాలు చేయడానికి ఏ మాత్రం వెరవడం లేదు. యథేచ్ఛగా చేసేస్తున్నారు పాప కార్యాలు. అటువంటి వారిని చూసే నేను బాధపడుతున్నాను” అని.

శ్రీహరి పాదాలు ఇక నన్ను తాకవు కదా అని ఏడుస్తున్నాను. అతని వల్లే ఇంతకాలం నన్ను అందరూ పొగుడుతూ వచ్చారు. అప్పుడు గర్వంగా ఉండేది. ఆ గర్వాన్ని శ్రీహరి తన అవతార చాలింపుతో పోగొట్టాడు. శ్రీహరి దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. ప్రజలను భవసాగరాన్ని దాటించడం కోసం ధర్మదేవతను నాలుగు పాదాలపై నడిపించిన ఆ అవతారం తీరిపోయింది కదా” అని భూమాత శోకిస్తుంది.

ధర్మదేవత, భూదేవి మధ్య సాగిన ఈ సంవాదాన్ని పరీక్షిత్తు విన్నాడు. ధర్మం ఒంటి పాదం మీద నడుస్తున్నందుకు భూమాత బాధపడుతోందా అనే వాస్తవాన్ని గ్రహించి పరీక్షిత్తు విచారించాడు.

——————————
యామిజాల జగదీశ్

Scroll to Top