మనిషికి, దేవునికి మధ్య వంతెన
భక్తా? భయమా? మృత్యువా ?
దేవుళ్ళ వలే పూజలందుకొనే
బాబాల్లారా ? స్వాముల్లారా? పీఠాధిపతుల్లారా ?
ఎక్కడున్నారు? ఏమైపోయారు మీరు ?
సామాన్యులకర్థంకాని సంస్కృతభాషలో
రోజూ తెగ పొగిడి, భజనలు చేసి పూజించే
మీ దేవుళ్ళు, దేవతలు ఏరి ? కనిపించరేరి?
రండి,.వచ్చి బతికించండి ఆ పిల్లలిని, తల్లుల్ల్ని?
రత్నఘడ్ లో రాతిదేవుడికి
మ్రొక్కి అదృష్టం పొందాలని
ఆశపడి, ఆ దేవత ముందే
ఆక్రందనలతో అసువులుబాసిన
అన్నెం, పున్నెం ఎరుగని అమాయకులు
ఆ పేద ప్రజల జీవితాలను
జాగృతంచేసి, జీవించడం నేర్పక
మానసికంగా వారికి అండైనిలవక
తీయగ మాటలజెప్పి జేజేలెట్టించుకొని
మహిమలతోడ, మోసాలకుపాల్పడి
గుడులు, ఆశ్రమాలకట్టి ఆధ్యాత్మికాన్ని
వ్యాపారంగా మలచి, వారి నమ్మకాలను
మీ కీర్తి, స్వార్ధాలకు ఫణంగా బలిపెట్టి
ఆత్మే దేవుడని కనుగొన్న మీరు
పూజలతో రాజులు కారని,వ్రతాలతో మోజులు తీరవని
తెలిసీ, ఎందుకు వదిలిపెట్టరు? కర్మ క్రతువులను
ఎందుకు చెప్పరానిజాన్ని? నిక్కచ్చిగా ఈ జనానికి
మీ హుండీలు, బ్యాంకులు నింపుకొనుటకు గాకపోతే?