రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు

శా॥ ఆచాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది శ్రీకాకతి
క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి కృష్ణప్రాజ్యసామ్రాజ్య పీ
ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోబుచ్చు నీ
ప్రాచీనాభ్యుదయంబు నెన్నెదము గర్వస్ఫూర్తి; ఆంధ్రావనీ! (రాయప్రోలు)

సీ॥ తనగీతి అరవజాతిని పాటకులనుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి,
తనపోటులు విరోధితండంబులకు సహింపనివిగా మెరసిన తెనుగుకత్తి,
తనయందములు ప్రాంతజనుల కభిరుచి వా సన నేర్పనలరిన తెనుగురేఖ,
తనవేణికలు వసుంధరను సస్యశ్యామ లను చేయగలిగిన తెనుగుభూమి,
అస్మదార్ ద్రమనోవీధి నావహింప, జ్ఞప్తివచ్చె నేడిదిచూడ;చావలేదు,
చావలేదాంధ్రులమహోజ్జ్వలచరిత్ర;హృదయములు చీల్చి చూడుడో సదయులార!
(రాయప్రోలు)
సీ॥ మగధసామ్రాజ్యసీమలు నీ సితచ్ఛత్ర ముక్తాఫలచ్ఛాయ మునుగునాడు,
అలకళింగోపాంత మందు నీ కంఖాణ ఖురధూళి నెరసందె గురియునాడు,
కర్ణాటరాజ్యరంగముల నీ కవులను బ్రహ్మరథంబులు పట్టునాడు,
తంజాపురోద్యానకుంజమ్ములందు నీ సంగీతమధుధార పొంగునాడు,
అతిభయంకరశౌర్యధైర్యప్రసక్తి రసవశంకరనాగరరాగశక్తి
ఏకమై,పాకమై,ప్రవహించినట్టి ఆ యఖండప్రభావ మేమాయెనమ్మ! (రాయప్రోలు)

Scroll to Top