జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ భార్య కాంతమ్మ మరణం తర్వాత ఆమె జ్ఞాపకాలుగా కొన్ని పుస్తకాలు రాసారు. వాటిలో ఒకటి అంతరంగిని. ఈ పుస్తకంలో మొదట కొన్ని పేజీలు ఆయన గురించి వివరాలు ఉన్నాయి.
ఆయన 1947 ప్రాంతంలో వర్ణాంతర వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అదేమిటో చూద్దాం…
ఆయన అప్పట్లో నెల్లూరులో ఉండేవారు. అప్పుడు “రోహిణి” అనే అమ్మాయిపై ఆశపడ్డారు. ఈ రోహిణి ఓ దిక్కు లేని పిల్ల. ఆమెకు తల్లిదండ్రులు ఎవరో తెలీదు. “నాగరత్నం” అనే ఆమె రెండు రూపాయలకు రోహిణిని కొనుగోలు చేసి పెంచసాగింది. రోహిణి సన్నగా ఉండేది. చామన ఛాయ. తెలివైన పిల్ల. ఆమె కళ్ళు లేత నీరి రంగులో ఉండేవి. ఆమె అంటే భరద్వాజకు యెనలేని ఇష్టం. ఏ కాస్త సమయం ఉన్నా ఆయన రోహిణి దగ్గరకు వెళ్లి వస్తుండేవారు. అవీ ఇవీ మాట్లాడుతుండేవారు. ఆమెను మోజుపడుతున్నాడు అన్న విషయం నాగరత్నానికి తెలిసింది. ఆమె చూసీ చూడనట్లు ఏదీ తెలియనట్లు అంగీకరించనట్టు అంగీకరించినట్టు ఉండేది.
రోహిణిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ముగ్గురికి లేకలు రాసారు. వారి పేర్లు – గుడిపాటి వెంకట చలం. మునిమాణిక్యం నరసింహారావు, మరో ఆయన కొతయ్యగారు. ఈ కోటయ్య ఎవరో కాదు భరద్వాజ గారి తండ్రి.
ఈ ముగ్గురిలో ఒకరి నుంచే జవాబు వచ్చింది. “గో ఎహెడ్” అని. ఆ మాట రాసింది చలం. మిగిలిన ఇద్దరు వ్యక్తులూ మౌనంగా ఉండిపోయారు.
అయినా నాగరత్నం ఈ వ్యవహారాన్ని పెళ్ళిపీటల వరకూ రానివ్వలేదు. ఆమెకు డబ్బే ప్రధానం. రోహిణిని ఒక ధనవంతుడికి అమ్మేసింది. ఈ సమయంలోనే భరద్వాజ నెల్లూరు విడిచిపెట్టి మరో ఊరు చేరుకున్నారు. అయినా ఆయన ఈ అమ్మాయిని మరచిపోలేదు. కొన్ని కథలు రాసారు. వాటిలో కథానాయిక మరెవరో కాదు. రోహిణియే. అంతే కాదు రోహిణి ప్రచురణలు అనే సంస్థ పేరుతో ఆయన మూడు పుస్తకాలు ప్రచురించారు కూడా.
మరోవైపు, రోహిణిని కొనుక్కున్న వ్యక్తి కొంతకాలం ఆమెను అనుభవించి ఓ వ్యభిచార గృహానికి విక్రయించాడు. అప్పుడు ఆమె పేరు రోహిణి కాస్తా చిత్రగా మారింది.
– జగదీశ్ యామిజాల