మన హైందవ పుస్తకాలెన్నో జీవితానికి ఎంతో అవసరమైన మాటలు చెప్పాయి. వాటిలో ముఖ్యమైనవి – సత్యం, శివం, సుందరం.
ఈ మాటలు మూడూ ఎందుకు అమూల్య రత్నాలయ్యాయి అంటే ఇవి భగవంతుడి వద్దకు తీసుకుపోయే మార్గాలుగా ఉండటమే.
సత్యం అంటే నిజం అని అర్ధం. అతను నిజం మాట్లాడుతున్నాడు అని అనడం మనం తరచుగా వింటూ ఉంటాం. మనమూ అంటూ ఉంటాం. ఈ నిజానికి అర్థం ఉంది. అంటే ఏది రూపమూ, అంతమూ లేకుండా ఎప్పుడూ నశించక ఉందో అదే సత్యం అని అర్ధం.
ఎవరు నిజాన్ని తెలుసుకుంటారో వారు దేవుడిని తెలుసుకుంటారు. ఎందుకంటే దేవుడు నిజమై ఉంటాడు.
శివం అంటే మంచి అని అర్ధం. ఎవరు మంచిని తెలుసుకుంటాడో వారు దేవుడిని తెలుసుకుంటారు. ఎందుకంటే దేవుడు మంచిలో ఉంటాడు.
సుందరం అంటే అందం అని అర్ధం. ఎవరు అందాన్ని తెలుసుకుంటారో వారు దేవుడ్ని తెలుసుకుంటారు. ఎందుకంటే దేవుడు అందంగా ఉంటాడు.
ఈ మూడు మార్గాలలో అందం దారి సులభమైనది.
నిజానికి, మంచికి ఆకర్షణ తక్కువ. అందం అలా కాదు. తేలికగా ఆకట్టుకుంటుంది. దానికి వశీకరణ శక్తి ఎక్కువ.
మరో దారిలో చిక్కని పక్షులు దేవుడు ఈ వశీకర వలతో పట్టుకుంటాడు.
అందాన్ని అనుభవించడం అనేది భగవంతుడిని అనుభవించడమే. జ్ఞాన గ్రంధాలు దేవుడిని అందగాడు అంటాయి. భాగవతం దేవుడిని భువనమోహనుడు అని అభివర్ణిస్తోంది. భగవంతుడు అందగాడు అని అంటాడు దేవదూత.
భగవంతుడు తన సౌందర్యంతో ఆత్మలను తనవైపు ఆకట్టుకుంటాడు అనడంతో సూఫీ జ్ఞానులు భగవంతుడిని ప్రేయసిగా భావించి కీర్తించారు.
ఒక పౌర్ణమి రాత్రి ఎడారిలో చందమామ వెలిగిపోతున్నాడు. ఎడారి చందమామ ఎంతో అందంగా ఉంటాడు. సువిశాలమైన ఇసక నేలపై చందమామ కిరణాలు ప్రతిఫలించినప్పుడు రాత్రి ఓ మధుపాత్రగా మారిపోతుంది.
ఈ సమయంలో సూఫీ జ్ఞాని తానున్న నివాసం నుంచి బయటకు వచ్చారు. ఆ అద్భుతమైన పౌర్ణమి అందంతో ఆయన మమేకంయ్యాడు. అదొక దైవీకమైన పవిత్ర అందం.
“భగవంతుడా. నీ ఈ సన్నిధిలో ఎందుకు భక్తులు కనిపించడం లేదు?” అని అడిగాడు.
ఈ సూఫీ జ్ఞానికి ఆ పౌర్ణమి భగవంతుడి సంనిదిగా కనిపించింది.
అవును, అందం దేవుడి ఆలయం. పూజ కోసం పూవులు కోయడానికి వెళ్ళిన వ్యక్తి పువ్వులో భగవంతుడిని చూసాడు. భగవంతుడిని దర్శించడం అనగానే అతనిని ఏదో ఒక రూపంలో చూడటం అని కొందరు తప్పుగా అర్ధం చేసుకుంటారు.
దర్శనం అనేది ఒక జ్ఞానానుభాభావం .
సృష్టి ఒక అద్దం. అది భగవంతుడి అందాన్ని ప్రతిబింబిస్తుంది. సూఫీ జ్ఞాని ఇలా అన్నారు –
“వశీకరణలో గొప్ప వదనం దాగి ఉండటానికి ఇష్టపడదు. తలుపులు మూసినా అది ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ముఖం చూపిస్తుంది. భూమండలంలో మనుషులపై అది తన తేజస్సుని తీర్చి దిద్దింది”
జ్ఞానులు నిజమైన ఉపాసకులు. కవులు, కళాకారులు అందాన్ని ఆరాధిస్తారు.
నిజాన్ని ఉపాసించేవారు అందాన్ని పొందుతాడు. ఎందుకంటే నిజం అందంగా ఉంటుంది. సత్యమే సుందరం.
అందాన్ని ఆరాధించేవారు నిజాన్ని చూస్తారు. ఎందుకంటే అందం నిజమై ఉంటుంది. సుందరమే సత్యం.
కవిత జ్ఞానానికి చేరువ చేస్తుంది.. నిజం కవితకు చేరువచేస్తుంది. వేదాలు కవిత కోసం ఏర్పడినవి కావు. కానీ అవి కవితలుగా ఉన్నాయి. ఎందుకంటే నిజం కవితగానే వెల్లడవుతుంది.
ప్రపంచంలో ఉన్న అన్నింటినీ దాచేస్తే భగవంతుడు ఒక్కడే మిగులుతాడు. త్యాగరాజు సంగీతం కోసం పాడలేదు. భగవంతుడి ప్రేమతో ఆయన పొందిన ప్రేమే సంగీతం అయ్యింది.
సత్యమే సుందరం
సుందరమే సత్యం.
– సుమా హరి, హైదరాబాద్