ఉత్కళాంధ్ర సాహితీ జ్యోతి

ఉత్కళాంధ్ర సాహితీ జ్యోతి పురిపండా అప్పలస్వామి

కళింగాంధ్రలో ఎంతోమంది కవులు, కళాకారులు, వివిధ రంగాలలో నిష్ణాతులు జన్మించారు. వారిలో పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయులు. ఆయన వర్ధంతి ఈ నెల13. ఈ సందర్భంగా ఆయన విశేషాలు…

పురిపండా అప్పలస్వామి కళింగాంధ్రలోని సాలూరు గ్రామంలో నవంబరు 13, 1904 సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు మహాత్మాగాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం, ఖాదీ ప్రచారము లలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.
పత్రికా రంగంలో వీరు తన ప్రతిభను ప్రదర్శించారు. విశాఖపట్నం నుండి వెలువడిన ‘స్వశక్తి’ అను జాతీయ వారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. ‘ఆంధ్రపత్రిక’ కు స్వకీయ విలేఖరిగా పన్నెండేళ్ళు వ్యవహరించారు. ‘సత్యవాణి’ పత్రికను నిర్వహించుచు ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ గౌరవాన్ని పొందాయి. వీరు ప్రచురించిన ‘వైశాఖి’ మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను ఆర్జించింది.

గ్రంథాలయోద్యమంలో వీరు సాగించిన కృషి గణనీయం. మంతెన ఆదినారాయణ స్వామి స్థాపించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ గ్రంథాలయాన్ని, ‘కవితా సమితి’ గ్రంథాలయాన్ని ఆయన చక్కగా అభివృద్ధి పరచారు. శ్రీరామవరం, పార్వతీపురంలలోని గ్రంథాలయాలను చాలా పెంపొందించారు. మరకాం గ్రామాన ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘ యావజ్జీవ గౌరవ సభ్యులుగా వీరు ఎన్నుకోబడినారు.

వీరు సాహిత్యరంగంలో సాధించిన కృషి పరిగణన పొందింది. వీరు 15 ఏళ్ళ ప్రాయంలోనే తెలుగులో గద్యపద్య రచనను మొదలుపెట్టారు. 1928 వరకు ఆయన గ్రాంథిక భాషావాది. గిడుగు వెంకట రామమూర్తిని దర్శించి, ఆయన వలన ప్రభావితుడై తదాదిగ తన సాహిత్య కృషిని వ్యావహారిక భాషలోనే సాగించారు. కందపద్యమయమైన ‘రాట్నపతాకం’ ఇతని తొలి రచన. వీని ప్రముఖ రచనలలో ‘సౌదామిని’ ఆంగ్లంలోకే కాక హిందీ, ఒరియా భాషలలోకి కూడా అనువదింపబడి పెక్కు ముద్రణలను పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోరికపై వీరు ‘అమృత సంతానం’, ‘మట్టి మనుష్యులు’ అనే ఒరియా నుండి తెనిగించారు. వంగసాహిత్య చరిత్ర, ఒరియా సాహిత్య చరిత్రలను వీరు తెలుగులో రచించారు. అలాగే ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించి తెలుగు సాహిత్యంతో పరిచయాన్ని ఒరియా పండితులకు కల్పించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యవహారిక భాషలో రచించుటకు పూనుకొన్న సంస్కృత భారతానువాదం శాస్త్రిగారి మరణం వలన అసమగ్రంగా నిలిచిపోగా, వీరు పూనుకొని మిగిలిన పదిహేనున్నర పర్వాలను రచించి పూర్తిచేశారు.

ఆయన విశాఖ రచయితల సంఘానికి కొంతకాలం అధ్యక్షుడుగ పనిచేశారు. అఖిల భారత పి.ఇ.ఎస్‌. సంస్థ యందు, ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ యందు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో కార్యవర్గ సంఘాలలో వీరు సభ్యత్వాలను పొందారు. వీరు నవంబరు 18, 1982 సంవత్సరంలో పరమపదించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారం ప్రదానం చేసింది.
రచనలు

రాట్న పతాకం, మహమ్మద్‌ చరిత్ర, సౌదామిని, ఒరియా పాటలు, జగద్గురు శంకరాచార్య, ఛెతిమాణ అఠంగుఠ, విశ్వకళావీధి, హంగేరీ విప్లవం, దేవీ భాగవతం, పురిపండా భాగవతము, పురిపండా వ్యావహారికాంధ్ర మహాభారతం, శ్రీమద్భాగవతము, వ్యావహారికాంధ్ర వాల్మీకి రామాయణం అమృత సంతానం (అనువాదం), మట్టిమనుష్యులు (అనువాదం), వంగ సాహిత్య చరిత్ర, ఒడియా సాహిత్య చరిత్ర, భగవద్గీత, ఉపనిషత్సారం…ఇలా పురిపండా మొత్తం అరవై రచనలు చేశారు.

వీటిలో పులిపంజా కవితాసంపుటి ఓ విస్ఫులింగం. లండన్‌ నుంచి విదేశాంధ్ర ప్రచురణగా ఇది వెలువడిరది. 41 కవితల సమాహారమిది. సాంఘిక దురన్యాయాలపై పంజా విప్పిన కవి బెబ్బులి పురిపండా. జాతీయోద్యమంలో కార్యకర్తగా పనిచేయడం వల్ల బూజులా వేళ్లాడుతున్న సనాతన భావాలపై తిరుగుబాటు చేశారు.

‘నా గేయం/ మీ కవనం/ మీ ఖడ్గం నా గేయం/ కుబుసం వొదిలిన సర్పం/ నా గీతం పులిపంజా’ అంటూ సమాజానికి ప్రగతి కవితా సందేశాన్నిచ్చారు.

‘గుడిలోని దైవమా! ఆలింపవోయి/ గుడిలోని దయ్యమా! పైకి రావోయి/ నీ పాదపూజకై/ వెదకి తెచ్చిన పూలు/ నీ పాదసేవకై/ నింపి తెచ్చిన నీళ్లు/ పనికి రావంటారు/ మైలపడెనంటారు’ ఇలా సాగుతుందీ ‘గుడిలోని దైవమా’ గేయ కవిత. ఆనాటి సమాజంలో బుసలు కొడుతున్న అస్పృశ్యతపై తీవ్రంగా చలించి రాసిన ఈ కవిత నాటి సాహితీ సభల్లో అందరినీ కదిలింపజేసింది. హరిజనోద్ధరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రాసిన ఈ కవితను ఆంగ్లంలో అనువదించి గాంధీజీకి వినిపిస్తే ఎంతో మెచ్చుకున్నారు.

‘ఇక్కడ అడుగు పెడితే/ ఎందుకో నా వొళ్లు/ కంపరమెత్తుతుంది/ ఖద్దరు వొదిలేసి/ కత్తి పట్టాలనిపిస్తుంది/ అహింస అబద్ధమనిపిస్తుంది… భగత్సింగులాగ/ విప్లవకారుణ్ణయి/ ఎర్రజెండా ఎత్తాలనిపిస్తుంది/… పద్మనాభం గాలి నిండా/ వీరగాథ వినిపిస్తుంది/ పద్మనాభం ధూళినిండా/ వీరరక్తం కనిపిస్తున్నది’ అనే ఖండికను ఎంతో భావోద్వేగంతో రాశారు. కుంఫిణీ దొరల కుతంత్రాలను ప్రతిఘటించి పూసపాటి విజయ రామరాజు పద్మనాభం (విశాఖ జిల్లా) వద్ద యుద్ధం చేసి వీరమరణం పొందారు. ఈ ఉదంతం పురిపండా మనసును ద్రవింపజేసింది. అమరవీరుని త్యాగానికి నివాళిగా రాసిన స్మృతిగీతం అది.

‘మానవ శవాల మంటపాలపై/ ప్రభువుల పతాక రెగిలే భువిలో/ రాతి విగ్రహం రక్షిస్తుందా? పూజామంత్రం బువ్వెడుతుందా?’ ఇదీ పురిపండా భవ్య కవితావేశం.

‘తొలినాటి సంద్రాలు/ తుహినగిరి శిఖరాలు/ ఇంకిపోతున్నాయిలే/ కుంగిపోతున్నాయిలే’ అంటూ సుడిగాలి కవితలో ఛాందస భావాలను ఖండిరచారు. ఆధునిక భావజాలానికి ఆహ్వానం పలికారు. ఆయన తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాల్లాంటి రచనలు అందించారు.

Scroll to Top