ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట బ్రహ్మాజీరావు
అక్టోబరు 12 రచయిత ఘండికోట బ్రహ్మాజీరావు వర్థంతి
సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి. ఆయన ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు భ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబరు 23 1922 లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. 16 యేళ్ళ వయస్సు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో రైల్వే విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. మొదటి తరగతి గెజెటెడ్ ఆఫీసరుగా రైల్వే, 1980 వరకు వర్క్స్ మేనేజరుగా ఖర్గ్ పూర్ లో టెక్నికల్ స్కూల్ ప్రిన్సిపాల్ 1980 లో పదవీ విరమణ చేసిన తరువాత హాల్డియా ఫోర్డ్ లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు. ఆయన 10కి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంధాలకు అనువాదాలూ చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు. ఘండికోట బ్రహ్మాజీరావు ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో ఎంఏ. పట్టభద్రులు. సాంకేతికరంగంలో “ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ “సభ్యులు. నివాసస్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వివిధ పత్రికలు ప్రచురితమయ్యాయి. ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు.
ఘండికోట పేరు చెప్పగానే శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్ చప్పున స్ఫురిస్తాయి. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా, నవలా రచయిత ఘండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులిడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండి అంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీముళ్ళు, డాక్టర్ భాయి వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలికథ 1941లో ప్రజాబంధులో వచ్చిన ‘రాఘవయ్య’తో సాహితీ యాత్ర ఆరంభించారు. ‘ఒక దీపం వెలిగింది’ నవల సినీద్వయం బాపు-రమణల నేతృత్వంలో ‘గోరంత దీపం’ సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్‌ను వేయిన్నొక్క రాత్రులు పేరుతో, తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం (6 భాగాలు) వెలువరించారు. తెలుగు సాహితీవేత్తగా జాతీయస్థాయిలో ప్రశంసలందుకున్న ఘండికోట బ్రహ్మాజీరావు 2012 అక్టోబరు 12, శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్‌లోని బర్నపూర్‌లో తుదిశ్వాస విడిచారు.