(తాతా మనవళ్ళ హైదరబాదీ పాత బస్తీ తెలంగాణ హాస్య సంభాషణ)
ఇప్పుడెలాగయితే ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళుతున్నారో, ఇరవై యేళ్ళ తరువాత ఆస్ట్రేలియా నుంచి అందరూ హైదరాబాదు వెళ్ళి సెటిల్ అవుతుంటారు. అలా వెళ్ళిన ఒక కుటుంబం, చింతల్ బస్తీ లో సెటిల్ అవుతారు. అప్పుడు చింతల్ బస్తీ అంటే చాల కాస్ట్-లీ సబర్బ్ అన్నమాట. తాతా మనవళ్ళ మధ్య సాగే సంభాషణను హాస్యోత్కంగా హైదరబాదీ ఓల్డ్ సిటీ స్టైల్లో వ్రాసాను.
*~*~*~*
తాత: ఏమిరా బుజ్జిగా, పరేశాన్ గొడ్తున్నవ్. పొద్దటికెల్లి యాడ గయబయినవు. పయిలమేనా బిడ్డా.
మనవడు: గదేం లేదు తాతా, బస్తీల చిన్న లడాయి వోటయ్యింది.
తాత: పిల్లకాకివి నీకెందుకురా గీ పనికిరాని దమాక్ ఖరాబ్ పన్లు.
మనవడు: ఓ తాతా పిల్లకాకి, పెద్ద కోడి – మాగ చెప్పినవ్ గాని, కొట్లాట ఏందో చెప్త ఇను
తాత: చెప్పేదేందో సక్కంగ జెప్పు. నీ లత్కోరు కథలు నా దగ్గర కాదు. ఈ బద్మాష్ లెక్కలు ఓ రాశికి రావు రంగానికి రావు.
మనవడు: నీకు సమజ్ కాదు తాతా. జర మన లెవెల్-కు తగ్గట్టు ఇజ్జత్ నిలబెట్టుకోవాలె.
తాత: లెవెల్ ఏందిరో. నీ కథలు ఇననీకి నేనేమన్న పాగల్-గాన్ని అనుకున్నవా. ఇసుమంటి ముచ్చట్లు మస్తుగ జూసిన.
మనవడు: యెహె. నీ సోది ఆపు. ఓ తాతా, సోయిలుండి నేను చెప్పేది మొత్తం ఇను మొదలు.
తాత: ఇమానంగ నా
మనవడు: నా తోడు
తాత: సరే, జెప్పు
మనవడు: నేను పిసల్ బండ మీదికెల్లి, మేకల మండికి పోతన్న. నలుగురు మాకెలౌడెగాళ్ళు ఫుజూల్-గ నా మీదికొచ్చిండ్రు. మన ఇలాఖా గాదని జరంత తగ్గిన. మాంకాలమ్మ గల్లీలకు రాంగనే, నా ఎన్కనే ఉర్కుడు శురువు జేసిండ్రు. ఇదేందిరో ఈ సాలెగాండ్లు గిట్ల పిచాయిస్తుండ్రని, నేను గూడ ఉరుకుదామా అని అనుకుంటి. మన సందుల కొసింట్ల ఓ సాఫ్ట్ వేర్ పోరి లేదా. గా పోరి కొంచెం దూరం-ల నడుసుకుంట వస్తాంది. వచ్చుకుంట నన్ను జూసింది.
తాత: సాఫ్ట్ వేర్ పోరి అయితె ఇస్పెషల్ ఏందిరో. శతకోటి లింగాలల్ల ఓ బోడిలింగం.
మనవడు: యెహె, నీ సొల్లు ఆపు. పోరి పైలాపచ్చీసుగుంటది. ఇజ్జత్ కా సవాల్. నీకు సమజ్ కాదు. ఆ పోరి రాంగనే, ఎన్-కకు తిరిగి ఆ సాలె గాండ్లను గుర్ఖాయించిన. దొంగ సాలెగాళ్ళు ఒక్కసారి కన్ దిన్నరు. ఇదే మోకా అని నేను ఆళ్ళను ఉల్టా పిచాయించుడు శురువ్ పెట్టిన. ఆ సాలె గాళ్ళు ఉరుకబట్టిండ్రు. ఆ బాడ్కావ్ గాళ్ళను భగాయించుడు మొదలు పెట్టిన. నేను పిచాయించుడు, ఆళ్ళను భగాయించుడు..నేను పిచాయించుడు, ఆళ్ళను భగాయించుడు..నేను పిచాయించుడు, ఆళ్ళను భగాయించుడు. చిన్న సులోప్ వొచ్చి సిలిప్ అయిన. లేకుంటెనా, ఆ నా కొడుకుల బట్టి బజాయిస్తుంటి. దొరికిండ్రా అంటే, ఒక్కొక్కని పుంగి పగలగొడుతుంటి. కిందబడ్డందుకు పెయ్యంత జర్రంత రాళ్ళు గీస్క పొయినయి. గప్పుడె గా పోరొచ్చి లేపింది.
తాత: గాలికి బొయ్యే కంపను ముడ్డికి దగిలిచ్చుకున్నట్టు, గా ఫాల్తూగాళ్ళని వదిలెయ్యకుండ ఎందుకురా నీకీ గోస. నీ జిందగీ బద్నాం జేసుకునుడు, మీ అమ్మయ్యల పరేషాన్ జేసుడు.
మనవడు: నీయవ్వ, ఓ తాతా, నీకు జెప్పుడు కంటె గోడకు జెప్పుడు నయం. ఉన్న నాల్కెకు మందేస్తె కొండ నాల్క పీకిందట. నీకెప్పుడు నన్ను ఉతుకుడే. పొద్దూకింది గద, ఇంక బొయ్యి ఓ రెండు రౌండ్లు మందేస్కో పో. గీ పాటికి నాయినమ్మ వంట అయిపోనీకి వచ్చుంటది. ఫుల్లుగ మెక్కి పండుకోపో.
తాత: ఓరి బుజ్జిగా, ఓడ ఎక్కేదాంక ఓడ మల్లన్న, ఓడ దిగింతర్వాత బోడి మల్లన్న అన్నట్టు, నువ్వు చెప్పేదంత గిప్పటిదాంక ఇన్న గద. ఇప్పుడెందుకనవిగ. అయినా సెర్వు మీద అలిగి ముడ్డి కడుక్కోడం మానేస్తె ఎవనికంట నష్టం. నేను చెప్పేది నేను చెప్పిన. ఇగ నీ ఇష్టం. మీ కాలపు పోరగాళ్ళకు ఏమన్న శెప్పెటట్టుందా. సరెగాని కాల్జేతులు కడుక్కోని, కాసింత ఎంగిలిబడుపో.
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
రచన: మురళి ధర్మపురి