కళింగాంధ్ర సంస్కర్త బంకుపల్లె

కళింగాంధ్ర సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి
*ఏప్రిల్ 29 మల్లయ్యశాస్త్రి జయంతి

వలసపాలనలోని కళింగాంధ్ర ప్రాంతం ఆ పాలన ముగిసిన తర్వాత మిగతా తెలుగుప్రాంతానికి ముందుచూపునిచ్చింది. ఈ ప్రాంతపు సాహిత్యం, రాజకీయ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను స్వాతంత్ర్యం తర్వాతి కాలంలో తెలుగు ప్రాంతం ఆదర్శంగా తీసుకున్నది. అయితే మత సంస్కరణ, సంఘ సంస్కరణ రంగాల్లో ఈ ప్రాంతంలో సాగిన కృషి విస్మరణకు గురైంది. కళింగాంధ్ర వెనుకబడిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంత రచయితల – పండితుల కృషి వెలుగులోకి రాకుండ పోయింది. అటువంటి విస్మరణకు గురైన పండితుల్లో ముఖ్యులు కళింగాంధ్ర సంస్కర్త – కీ. శే. బంకుపల్లి మల్లయ్యశాస్త్రి. ఏప్రిల్ 29 ఆయన జయంతి. ఈ సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుందాం

1876వ సంవత్సరం ఏప్రిల్ 29న నాటి గంజాం జిల్లా (ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా) సింగుపురం గ్రామంలో తన మాతామహుని ఇంటిలో బంకుపల్లి మల్లయ్యశాస్త్రి జన్మించారు. ఇతని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలానికి చెందిన ఉర్లాం గ్రామం. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ, గంగన్న. ఐదవ యేట తన తండ్రివద్ద వేదాధ్యయనము ప్రారంభించారు. తరువాత ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడైన భళ్లమూడి లక్ష్మణశాస్త్రి వద్ద సంస్కృతము నేర్చుకున్నారు. తన పదహారవ యేడు వచ్చేసమయానికి పంచకావ్యాలు పూర్తిగా చదివారు. తరువాత పర్లాకిమిడి రాజా వారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ భళ్లమూడి వెంకటశాస్త్రివద్ద శృంగారనైషధము, అభిజ్ఞాన శాకుంతలము చదివారు. తరువాత పరవస్తు రంగాచార్యుల వద్ద సిద్ధాంతకౌముది పూర్తిచేశారు. కూరెళ్ల సూర్యనారాయణశాస్త్రి వద్ద తర్కశాస్త్రము చదువుకున్నారు. పోకల సింహాచలం వద్ద సంగీతము నేర్చుకున్నారు. బంకుపల్లి కామశాస్త్రి వద్ద మంత్రశాస్త్రాన్ని అభ్యసించారు. భళ్లమూడి దక్షిణామూర్తి శాస్త్రివద్ద పంచదశ ప్రకరణములు, గీతాభాష్యము చదువుకున్నారు. శ్రీకూర్మం సంస్కృత పాఠశాలా పండితుడైన నౌడూరి వెంకటశాస్త్రి వద్ద మనోరమ, శబ్దరత్నములు, పారిభాషేందుశేఖరము చదివారు. గిడుగు రామమూర్తి పంతులు వద్ద ఇంగ్లీషు చదివారు. మంత్రశాస్త్రవిద్యలో తన సహాధ్యాయి అయిన గంటి సూర్యనారాయణశాస్త్రి వద్ద వేదాంత, మీమాంస శాస్త్రాలను నేర్చుకున్నారు. నీలమణి పాణిగ్రాహి వద్ద సూర్యసిద్ధాంత దర్పణాలను చదివి దృక్సిద్ధ పంచాంగాలను ఐదారు సంవత్సరాలు వెలువరించారు.

బంకుపల్లి మల్లయ్యశాస్త్రి బ్రాహ్మణమతాన్ని ధృఢంగా నమ్మినవారు. ధర్మశాస్త్రాలు చెప్పినత్లు కులపద్ధతుల్ని, సంస్కారాలను ఆచరించాలంటూ ఆనాటి ఆచారాల్లో సంస్కరణల్ని వాంఛింఛారు. వాదనతోనే సరిపెట్టుకునే వాళ్లలాకాక చేతల్లోకి దిగిన పండితుడాయన. ఈయన చేతల్ని అడ్డుకోవడానికి ఆరామద్రావిడ కులం ఆయనను వెలివేసింది. అలాగే స్వాతంత్ర్యోద్యమంలో ఓ దశగా, కార్యక్రమంగా సాగిన హరిజనోద్ధరణలో అంటరానివాళ్ల పక్షాన నిలిచి వాళ్లకు మాట, చేత అయ్యారు. ఆయననూ అయన కుటుంబాన్ని జీవితకాలం వెలి వెంటాడినా వెరవని ధీరుడాయన. సాహిత్యరంగంలో నేటి పరిణామాల దృష్ట్యా ఆయన కృషీ, అభిప్రాయాలూ చర్చనీయాంశాలు. భర్త మరణించిన బాలికలకు మళ్లీ పెళ్లి చేయాలనడంలో కందుకూరి వీరేశలింగం గారిది బ్రహ్మసమాజ పద్ధతైతే, మల్లయ్యశాస్త్రిగారిది బ్రాహ్మణమత పద్ధతి. మల్లయ్యశాస్త్రి పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఇరవై ఏళ్లపాటు సంస్కృతం బోధించారు. గిడుగు రామ్మూర్తిగారికి సహోద్యోగి. గిడుగు వ్యవహార భాష ఉద్యమానికి తోడ్పడి మిత్రుడూ, ఆయన దగ్గర ఇంగ్లిషు నేర్చి శిష్యుడూ అయ్యారు మల్లయ్యశాస్త్రి. కూతురు కృష్ణవేణికి తొమ్మిదేళ్లకే భర్త పోవడంతో మళ్లీ పెళ్లి విషయంలో ధర్మశాస్త్రాలు ఏమంటాయో చూద్దామని అయన వాటిని అధ్యయనం చేయపూనుకున్నారు. ఈ కృషి ఐదేళ్లు సాగింది. పునర్వివాహానికి ధర్మశాస్త్రాలు సమ్మతిస్తాయనే నిర్ధారణకు వచ్చారు. ఆధారాలతో తన వాదనను విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, బందరు, నెల్లూరుల్లో పండితుల సభల్లో వినిపించారు. వాదనల్లో నెగ్గారు. నెగ్గిన చోటల్లా పండితుల అంగీకారపత్రాలు తీసుకున్నారు. దేశంలోని 13 మతపీఠాలకు, ఐదు మఠాలకు తన వాదనను పంపించారు. పూరీ మినహా మిగతా మఠాలు, పీఠాలూ ఆయన వాదన అంగీకరించాయి. అలా కోస్తాంధ్రలో ఆయనకు అనాడు సంస్కర్తగా మంచి గుర్తింపు వచ్చింది.

కృష్ణవేణికి ఖమ్మం వాస్తవ్యులైన ‘దీపావళి’ కవి వేదుల సత్యనారాయణ శాస్త్రితో 1929లో పునర్వివాహం చేశారు. ఈ పెళ్లిని గిడుగు కుదిర్చారు. వాసా సూర్యనారాయణ శాస్త్రివంటి పెద్దలు, మిత్రులు ఈ పెళ్లికి తోడుగా నిలిచారు. ఆరామద్రావిడ బ్రాహ్మణకులం ఆయనను వెలివేసింది. కులాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ ‘త్రిలింగ’లో పండితులు విమర్శించారు. ఆ తరువాత మల్లయ్యశాస్త్రి తన ఇద్దరు కుమారులకూ శాఖాపట్టింపులు లేకుండా వితంతువులతో పెళ్లిళ్లు చేశారు. నరసన్నపేటలో కాంగ్రెసు పెద్ద పొట్నూరు స్వామిబాబు వైశ్యుల్లో మళ్లీ పెళ్లికి పూనుకున్నప్పుడు ఆయనకు తోడుగా నిలిచారు. చివరి దశలో బరంపురంలో ఉపాధ్యాయునిగా ఉంటూ ఇటువంటి పెళ్లిళ్లు చేశారు. పునర్వివాహంపై తన వాదనలను వినిపిస్తూ 1934లో ‘వివాహతత్వం’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. కాశీనాధునివారు ముందుమాట రాసి పుస్తక ప్రచురణకు సహాయం చేశారు. మూడు ముద్రణలు పొందిన ఈ ప్రసిద్ధ గ్రంథం నేటికీ విస్మృతమే.

స్వాతంత్ర్యోద్యమంలో హరిజనోద్ధరణ ఎజెండామీదకు వచ్చింది. అంటరానితనం ధర్మశాస్త్రాలకు సమ్మతం కాదని, శాస్త్రాలు తెలియని మధ్యవాళ్లు తెచ్చిపెట్టినదని, ఆచారం పేరుతో సాగే అనాచారమనీ మల్లయ్యశాస్త్రి వాదించారు. 1933లో శ్రీకాకుళం జిల్లా బేసిరామచంద్రపురంలో పుల్లెల శ్యామసుందరరావు నిర్వహణలో జరిగిన గంజాం మండల చారుర్వర్ణ సభలో ఆయన ఈ అంశంపై వాదన చేశారు. అక్కడ అన్ని కులాలతో కలిసి భోజనం చేశారు. పత్రికల్లో కులఛాందసుల విమర్శలను ధర్మశాస్త్రాల ఆధారంగా ఎదుర్కొన్నారు. అంటరానితనం అంటే తోటిమానవులను అవమానించడమేనంటూ గంజాం, విశాఖపట్నం, గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో, మద్రాసులో సనాతన పండితుల సభల్లో వాదించారు. ఈ సభలూ వాదాలతో పాటు తిరువాన్కూర్ (కేరళ)లో చేపట్టిన అస్పృశ్యుల ఆలయప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నవారిలో చెరకువాడ నరసింహం, మాగంటి బాపినీడు, టంగుటూరి ప్రకాశం, కాశీనాధుని నాగేశ్వరరావుగార్లు కూడా ఉన్నారు. అంటరానివాళ్లకు ఆయన గాయత్రీమంత్రోపదేశం చేశారు. అంటరాని విద్యార్థులతోపాటు తన కుమారుల పెదవులకూ తాకించి తీర్థప్రసాదాలు ఇచ్చేవారు. కులాంతర వివాహం చేసుకుని వెలికి గురైన విద్యార్థుల్ని ఇంట్లోనే ఉంచుకుని చదువు నేర్పారు. వాళ్లకు ఉపాధినీ చూపించారు మల్లయ్యశాస్త్రి.

మాటల్లోనే కాదు, చేతల్లోనూ నిజాయితీ కలిగిన మల్లయ్యశాస్త్రిని గంజాం తాలూకా ‘ఆదిమ ఆంధ్ర సంఘం’ తన కార్యదర్శిగా ఎన్నుకున్నది. ఆదిమ ఆంధ్రులపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగం, పెత్తందార్ల అణచివేత విధానాలను మల్లయ్యశాస్త్రి పత్రికల్లో నిరసించేవారు. అంటరానితనం మీద ఆయన చేసిన వాదనలను ‘అస్పృశ్యత’ పేరుతో (1938లో) పుస్తకంగా ప్రచురించింది విజయనగరంలోని అస్పృశ్యతా నివారణా సంఘం.

బ్రాహ్మణ మత పీఠాధిపతులు, వాళ్ల అనుయాయులు ఆ మతానికి మూలాలైన వేదాల్లో ఏమున్నదో వివరించకుండా వల్లెవేస్తూ, జనాలను ఆచారాలను గుడ్డిగా అనుసరించే మూకగా చేస్తున్నారు, చూస్తున్నారు. అందుకే ఆ వేదాలను అనువదించడం ద్వారా వాటిని లోకానికి విశదం చేయాలని అప్పటి జాతీయోద్యమంలోని ఒక పక్షం భావించింది. జస్టిస్ పార్టీ లేవనెత్తిన బ్రాహ్మణ-బ్రాహ్మణేతర వివాదానికి తెరదించడానికీ, తగిన సమాధానం చెప్పడానికి వేదాల అనువాదం తోడ్పడుతుందని కూడా ఆ పక్షం భావించింది. అప్పుడు మాత్రమే స్వాతంత్ర్యోద్యమం చీలికల్ని అధిగమించి ముందుకు పోతుందని వేదాల అనువాదానికి పూనుకున్నారు. ‘వేదాల అనువాదాలు బయటకు వస్తే వాటినీ, అనువాదం చేసిన వాళ్లనూ తగలేస్తాం’ అని ఛాందసులు భయపెట్టారు. కానీ ఈ అనువాద ప్రయత్నానికి పూనుకున్న వినయాశ్రమం (కావూరు) వారికి బాసటగా నిల్చారు మల్లయ్యశాస్త్రి. మూడేళ్లపాటు కుటుంబంతోసహా ఆ ఆశ్రమంలోనే ఉండి రుక్, సామ వేదాలను అనువదించారు (1940). యజుర్వేదానికి సంపాదకులైనారు. ప్రతి రుక్కునూ ఎలాంటి వ్యాఖ్యానాలు లేకుండా సరళమైన తెలుగులోకి వచనంగా అనువదించే పద్ధతిని ఎన్నుకున్నారు.

మల్లయ్యశాస్త్రి పెద్ద కొడుకు సూర్యనారాయణ పర్లాకిమిడిలో జమీందారు కోటముందు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి విదేశీ వస్త్రాలను కాల్చారు. రాజా హైస్కూలులో ఉపాధ్యాయుడైన ఆయననూ, మల్లయ్యశాస్త్రినీ ఉద్యోగాలనుండి తీసేశారు. జస్టిస్ పార్టీ నాయకుడైన పర్లాకిమిడి జమీందారు కృష్ణచంద్ర జగపతి. సూర్యనారాయణతోపాటు మరో కొడుకు కృష్ణశాస్త్రి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. ఉద్యోగాలు పోయి కుటుంబం పేదరికంలో మగ్గిపోతున్నా చలించక, కొడుకుల పక్షాన్నే వహించిన నిలువెత్తు జాతీయతా స్ఫూర్తి ఆయన.

సంస్కరణోద్యమం, జాతీయోద్యమాల అచ్చమైన, అరుదైన కలయిక మల్లయ్యశాస్త్రి. ఈ రెండు ఉద్యమాల్లో సమాన నిమగ్నతతో కృషి చేశారు. సంప్రదాయాన్నే నమ్ముతూ చేతలద్వారా, ఆచరణద్వారా ఆధునికత దిశలో పరివర్తన చెందిన నిజాయితీపరుడు.

ఉర్లాం, పర్లాకిమిడి, నరసన్నపేట, బరంపురాల్లో 1947 వరకు జీవించిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి కాశీయాత్రనుండి తిరిగి వస్తూ ఖడ్గపూర్ లో సెప్టెంబర్ 26 (1947)న కాలధర్మం చెందారు. బ్రాహ్మణేతర విద్యార్థి ఒకరు చివరిదశలో సేవలు చేశాడు ఆయనకు. అంత్యక్రియలూ జరిపారు.

Scroll to Top