కృష్ణుడి లీలలను విస్తారంగా చెప్పిన భాగవతంలో రాధాకళ్యాణం చోటుచేసుకోలేదు. రుక్మిణి, సత్యభామ తదితరుల కళ్యాణాల గురించి చదువుకోవచ్చు. అంతెందుకు రాధ పేరు కూడా భాగవతంలో కనిపించదసలు. కానీ రాసలీలల్లో రాధే ప్రధాన దేవి. ఆశ్చర్యంకదూ….
అయినా బ్రహ్మవైవర్త పురాణం, గర్గ సంహిత వంటివి రాధ కల్యాణాన్ని వివరిస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకునే జయదేవుడు అనే కవి గీతగోవిందం రాశారు. అదొక రసమయ కావ్యం. అష్టపదులు సదా స్మరణీయం.
వ్యాసుడు రాధ గురించి భాగవతంలో రాయకపోవడంతో ఆయనే వంగదేశంలో జయదేవుడిగా అవతరించి ఉండవచ్చని పండితుల అభిప్రాయం. ఆయన పూరీ జగన్నాధుడి కటాక్షంతో ఈ అష్టపదులు రాశారు. కనుక పూరీ జగన్నాధుడికి ప్రియమైన ఈ అష్టపదులు రోజూ ఆ ఆలయంలో వినిపిస్తూ ఉంటాయి.
జయదేవుడు పుట్టిన రోజు వసంత పంచమి.
క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కళ దేశంలో ఒరిశా పూరీ జగన్నాధం సమీపంలోని బిల్వ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి భోజ దేవుడు. తల్లి రాధాదేవి. జయదేవుడు చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోయారు. ఆయన భార్య పద్మావతి. జయదేవుడు లక్షణశేన మహారాజుగారి ఆస్థానంలో కవిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందారు. భార్య మరణంతో భరించలేని బాధతో జయదేవుడు రాజుగారి ఆస్థానం నుంచి విడిచిపెట్టి కేందులు అనే గ్రామం చేరుకుంటాడు. ఇక్కడే జయదేవుడు సమాధి ఉంది.
ఈ కుగ్రామంలో జయదేవుడు ఉత్సవం, గీతగోవింద ఉత్సవం భారీఎత్తున జరుగుతాయి. ఆ సమయంలో గీతగోవింద గీతాలు ఆలపిస్తారు. సంబరాలు చేస్తారు. నృత్యాలు చేస్తారు. జయదేవుడు తన చివరి రోజులు ఇక్కడే గడిపారు.
జయదేవుడు అష్టపదులు దశావతార వర్ణన, కృష్ణ లీలలు, వసంత కాల వర్ణన, రాసలీలలు, గోపికలతో కృష్ణుడు ఉండటం, రాధ లేని రాసలీలలను కృష్ణుడు ఆస్వాదించకపోవడం, రాధను చూడటానికి పరితపించడం, రాసలీలల్లో తానూ లేకపోయానే అని రాధ బాధ పడటాన్ని ఆమె సఖి కృష్ణుడితో చెప్పడం ఇత్యాది విషయాలను చక్కటి చిక్కటి పదాలతో ఆకట్టుకుంటాయి.
జయదేవుడు అష్టపదులు రాసి పాడుతుంటే ఆయన భార్య పద్మావతి వాటికి తగ్గట్టు నాట్యం చేస్తుంది.
ఓ రోజు పూరీ జగన్నాధుడి ఆలయంలో ఆరాధనకు పూజారి వచ్చారు. స్వామివారి వస్త్రాలు అక్కడక్కడా చిరిగి ఉన్నాయి. విగ్రహంలో రక్తంకారుతున్నట్టుకనిపించింది. పూజారి విస్తుపోయారు. తెల్లబోయారు. రాజుకి విషయం చేరవేశారు. కారణం తెలుసుకోవడానికి రాజు ఆ రోజు రాత్రి ఆలయంలోనే నిద్రపోతారు. కలలో జగన్నాధుడు చెప్తాడు – “ఏమీ లేదు….ఒక చిన్న అమ్మాయి పదకొండవ అష్టపదిని ఆస్వాదించి పాడింది (ఈ అష్టపది ఇదే….
రతి సుఖసారే గాటమాభి సారె మదన మనోహర వేశం
నాకురునితంబిని ! గమన విలంబన మానుసారటం హృదయేశమ్
ధీరసమేరే యమునా తీరే వసతి వనే వనమాలీ
గోపీపీనా పయోధర మర్దన చంచల కారయుగశాలీ ….ఇలా సాగుతుంది) . నేనూ ఆ పాట విని మైమరచిపోయాను. ఆ పిల్ల వంకాయలు అమ్మే పిల్ల. వంకాయలు కోసుకుంటూ పోతోంది. నేనూ ఆమె వెనుకే పోయాను. వంకాయా చెట్లలో ఉన్న ముళ్ళు నా మీద పడ్డాయి. నా వొంటి మీదున్న బట్టలు చిరిగాయి.”
– ఈ మాటలు వినిపించడంతో రాజు చటుక్కున లేచి కూర్చుంటాడు. మరుసటిరోజు ఆ వంకాయలు అమ్మే అమ్మాయిని పిలిపించి ఆదరించి గౌరవించి తన భవంతిలో ఒక చోట కూర్చోబెట్టి గానం చేయి. జగన్నాధుడు ఆస్వాదిస్తున్నాడు ” అంటాడు రాజు.
అందుకే జయదేవుడు అష్టపదులు ఈ ప్రాంతంలో ఎప్పటికీ వినిపిస్తుంటాయి.
—————————
మహిమ