ప్రముఖ పద్య కవి, పండితులు, విశ్రాంత ప్రదానోపాధ్యాయులు డా.చింతలపాటి మురళీ కృష్ణ గారికి ఆస్ట్రేలియాలోని “తెలుగుమల్లి” సాంస్కృతిక సంస్థ “కావ్య కళా ప్రపూర్ణ” బిరుదుని వారు తెలుగు భాషకు, సాహిత్యపరంగా ఇక్కడి తెలుగువారికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రదానం చేసింది.
శ్రీ మురళీ కృష్ణ గారు ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని తెలుగు భాషాభిమానులకు “పద్య విజయం”, “పద్య వికాసం” సమూహాలను ఏర్పరచి ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయడం నేర్పిస్తూ, గత మూడు నెలలుగా “కావ్య సౌరభాలు” శీర్షికన ప్రతీ వారం “తెలుగు పంచ కావ్యాలు” విశ్లేషణతో కూడిన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు పద్య రచన నేర్చుకుంటున్నవారు వీరి అధ్వర్యంలో శతకాలను వ్రాస్తున్నారు.
అంతే కాకుండా గత సంవత్సర కాలంలో సుమారు 15 అవధానాలు నిర్వహణలో సంచాలకత్వమే కాకుండా ప్రుచ్చకులకు శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించారు. వారికి “తెలుగుమల్లి” ఆస్ట్రేలియా సాంస్కృతిక సంస్థ “కావ్య కళా ప్రపూర్ణ” బిరుదుతో సత్కరించడం ఇక్కడి తెలుగువారందరికీ గౌరవకారణమని తెలుగుమల్లి సంపాదకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు గారన్నారు.
డా. చింతలపాటి మురళీ కృష్ణ గారి గురించి:
డా. చింతలపాటి మురళీకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి శ్రీ లక్ష్మణయతీంద్రుల రచనలు- అనుశీలనం అనే అంశంపై పిహెచ్.డి. తీసుకున్నారు. ప్రముఖ పద్యకవి. అనేక ఖండకావ్యాలు, ప్రబంధాలు వ్రాశారు. ఇప్పటికి తెలుగులో 3,000 పైగా పద్యాలను వివిధ ఛందస్సులలో వ్రాశారు. అశ్వధాటీ వృత్తంలో జగదంబనుగూర్చి వారు వ్రాసిన పద్యాలు బహుళప్రచారాన్ని పొందాయి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చారిత్రకనేపధ్యంలో వారు వ్రాసిన ‘సిరికోవెల’ పద్యకావ్యం తెలుగునాట విస్తృతపఠనాన్ని పొందింది.
శ్రీవేంకటేశ్వర స్వామివారిపై 333 పద్యాలతో వీరు వ్రాసిన “సిరిమల్లెలు’ కావ్యం తెలుగు సాహిత్యంలో విశిష్ఠస్థానాన్ని పొందింది. ఘంటసాల జలధీశ్వరస్వామి వారి మహిమలను గురించి 650 పద్యాలతో వీరు వ్రాసిన 3 ఆశ్వాసాల పద్యప్రబంధం ఆధునికతెలుగు సాహిత్యానికి మకుటాయమానంగా వెలసింది. కేవలం పద్యాలే కాకుండా వీరు వచన కవితా సంపుటులను కూడా అందించారు. చీకటిలో సిరివెన్నెల దేశంలోని అక్రమాలను అన్యాయాలను తూర్పారబట్టింది. సిరిమువ్వలు కావ్యం తెలుగు పదాలవాడి, వేడి రుచిచూపిస్తూ ‘భీప్రద క్రకచోగ్ర దంష్ట్రా దవానలంలా విరుచుకుపడుతున్న నన్నుచూచి విశ్వవిశ్వంభరా మండలం క్రక్కదలి పోయింది…. ”అంటూ వచనకవితల్లో క్లిష్టసమాసాల్ని అతికింది. సామాజిక చైతన్యఝరిగా , పురివిప్పినకవి డా. చింతలపాటి. వీరు వ్రాసిన పలు కావ్యాల పేర్లు సిరి పదంతో కూడి ఉండటానికి కారణం వీరికి శ్రీకాకుళం(కృష్ణాజిల్లా)లోని ఆంధ్రమహావిష్ణు ఆలయంతో ఉన్న అనుబంధం. ఆ ఆలయంలోని ఆముక్తమాల్యద మండప పునర్నిర్మాణానికి స్థానిక ప్రముఖులను ప్రేరేపించి ఆ నిర్మాణం జరగటానికి కృషి చేసిన సాహితీమూర్తి వీరు.
అనేక శతకాలు, ఖండకావ్యాలు, ఆధ్యాత్మిక వచన గ్రంధాలు, కొన్ని కథలు, సాహిత్య వ్యాసాలు వీరి సాహిత్యకృషిలో భాగాలు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో దశాబ్దంపైగా ధర్మోపన్యాసాలు చెప్పారు. 20 సం.లపాటు గ్రామసీమల్లో సాహిత్యసభలు నిర్వహించి వందలాది రచయితలను తయారుచేశారు. అవధానాలు, భువనవిజయాలు, ఇంద్రసభలు, రేడియో ప్రసంగాలు, లెక్కలేనన్ని నిర్వహించారు. వీరు కృష్ణాజిల్లా ఘంటసాలలో పండితరత్న,లక్ష్మీనరసింహశాస్త్రి, కామేశ్వరీ దంపతులకు జన్మించారు. భారతీయ సాహిత్యపరిషత్తు, భారతీ కళాసమితి, వంటి సాహిత్యసంస్థల్ని వీరు స్థాపించి నిర్వహించారు. తెలుగు భాషా పండితులుగా వీరు కృష్ణాజిల్లా పరిషత్ పాఠశాలల్లో సేవలందించారు. ప్రౌఢపద్యకవిగా డా. మేడసాని మోహన్, డా.రాళ్ళబండి కవితాప్రసాద్, డా.గరికపాటి నరసింహారావు వంటి పండితుల అవధానాలకు సంచాలకులుగా వ్యవహ రించారు. టీటీడీ ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో రాయలసీమలో విస్తృతంగా ఉపన్యాసాలిచ్చారు. తెలుగుకావ్యాలగురించి అనేక సాహిత్యప్రసంగాలు చేశారు.