తొలి గేయరచయిత…

తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి గేయ రచయితగా పేరుప్రఖ్యాతులు గడిచిన వారు చందాల కేశవదాస్. అయన 1876 లో జన్మించారు.

టాలీవుడ్ లో 1931 లో మొట్టమొదటిసారిగా విడుదల అయిన మూకీ చిత్రం భక్తప్రహ్లాద చిత్రంలో కేశవదాస్ మూడు పాటలు రాసారు. వాటిలో మొదటి పాటను సురభి కమలాబాయి ఆలపించారు. ఈ చిత్రంలో ప్రహ్లాదుడి తల్లి లీలావతి పాత్రలో నటించిన కమలాబాయి పాడిన పాట “పరితాప భారంబు భరియింప తరమా – కటకటా నేనిది గడువంగ జాలుదు”.ఈ పాటే టాలీవుడ్ చరిత్రలో నమోదయిన మొట్టమొదటి పాట.

ఈ విషయాన్ని కమలాబాయి తర్వాతి రోజుల్లో పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో కూడా చెప్పారు. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది. ఈ చిత్రానికిముందే సురభి నాట్యమయి వారు వివిధ ప్రాంతాలలో భక్త ప్రహ్లాద నాటకాన్ని వేదికలపై ప్రదర్శిసిస్తూ వచ్చారు. ఈ నాటకం కోసం రాసిన పాటలనే భక్త ప్రహ్లాద చిత్రంలో దర్స్షకుడు హెచ్ ఎం రెడ్డి గారు చందాల కేశవదాస్ తో మాట్లాడి తమ చిత్రంలో ఉపయోగించుకున్నారని చిత్రపరిశ్రమ పెద్దలు చెప్తూ ఉంటారు.

ఇలా ఉండగా 1935 లో వచ్చిన సతీ సక్కుబాయి చిత్రంలోనూ చందాల కేశవదాస్ మరోమూడు పాటలు రాసారు.
అదే ఏడాది వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోనూ కేశవదాస్ కలం నుంచి జాలు వారిన పాటలకు విశేష ఆదరణ లభించాయి. ముఖ్యంగా నారదుడు పాత్రపై చిత్రీకరించిన “బలే మంచి చౌక బేరము” పాటకు ఇంతా అంతా కాదు ఊహించలేనంత ఆదరణ లభించింది. ఈ పాట వస్తున్నప్పుడు సినిమా హాళ్ళు చప్పట్లతో మార్మోగేవి.
ఆ తర్వాత చందాల కేశవదాస్ రాసిన గీతాలు సతీ అనసూయ, లంకాదహనం, కనకతార, రాధాకృష్ణ,బాలరాజు తదితర చిత్రాల్లో చోటుచేసుకున్నాయి.
భక్త ప్రహ్లాద చిత్రానికి సంగీతం సరపరచినది హెచ్ ఆర్ పద్మనాభ శాస్త్రి గారు.
ఇలా ఉండగా హెచ్ ఆర్ పద్మనాభ శాస్త్రి గారు మరో ముగ్గురుసంగీత దర్శకులతో కలిసి ఒక రికార్డు సృష్టించారు. ఆ చిత్రం పేరు రామదాసు. చిత్తూరు నాగయ్య నిర్మించిన “రామదాసు” చిత్రం మరో విధంగా రికార్డు పుటలకు ఎక్కింది. ఈ చిత్రానికి ఏకంగా నలుగురు సంగీత దర్శకులు పని చేసారు. వారు -నాగయ్య, అశ్వత్థామ, ఓగిరాల రాచంద్ర రావు.హెచ్ ఆర్ పద్మనాభ శాస్త్రి. అయితే ఈ రికార్డును తిరగరాసిన చిత్రం వాలిసుగ్రీవ. ఈ చిత్రం 1950 లో వచ్చింది.ఈ చిత్రానికి దర్శకులు జంపన చంద్రశేఖర రావు. ఈ చిత్రానికి అయిదుగురు దర్శకులు సంగీతం సమకూర్చారు. వారు – ఎస్ రాజేశ్వర రావు. మాస్టర్ వేణు. పెండ్యాల నాగేశ్వర రావు. గాలిపెంచల నరసింహా రావు. ఘంటసాల వేంకటేశ్వర రావు.
————————-
జగదీశ్ యామిజాల

Scroll to Top