జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా
జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా
మంచుకమ్మిన బుర్రలను విదిలించుకొని పోరెందుకో –
ఎండిపోయిన ఆకు కొమ్మకు ఉండలేదని తెలిసినా
ఆగిపోయిన శ్వాస ముందుకు సాగిపోదని తెలిసినా.
కొమ్మపైనే నిలిచి నింగిని కొల్లగొట్టే కోరిక
ఒడ్డుపైనే నిలిచి కడలిని ఒడిసిపట్టే కోరిక
ఒరిమనిషీ నువ్వు మూరెడు; కోరికేమో బారెడు –
మూటవిప్పక దాతగా తెగమోగిపోయే కోరిక
త్యాగమంటక నేతగా ఊరేగిపోయే కోరిక
తవ్వగలిగితె గు౦డెపొరలను రవ్వలెన్నో యెదుట పడవా
ఇవ్వగలిగితె నాదలయలను మువ్వలెన్నో వె౦టపడవా
చెక్కుచెదరని లక్ష్యము౦టే చేతకానిది మనిషి కేదీ –
చూడగలిగితె పట్టపగలే చుక్కలెన్నో క౦టపడవా
కదపగలిగితె పెనుయెడారిని గ౦గలెన్నో బయటపడవా
వెళ్ళితే కాదనను కాగేకళ్ళ ఆవిరి చూసిపో
వీడితే కాదనను మూల్గేనాడి ఊపిరి చూసిపో
అన్నీ తెలిసే తె౦చుకొని పోతున్న నీకో విన్నప౦ –
నవ్వినా కాదనను మునిగే నావ అలజడి చూసిపో
కాల్చినా కాదనను మ౦టను కాస్త నిలబడి చూసిపో
ఉప్పెనలో తలఒగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవిత౦
ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవిత౦
చచ్చేదాకా బతికివు౦డట౦ జాతకాలలో ఉన్నదే —
ఒరిగిపోయినా తనక౦ఠ౦ నలుగురు మెచ్చేదే జీవిత౦
ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవిత౦
–డా. సి నారాయణ రెడ్డి