భాగవతంకథలు – 2

పరీక్షిత్తు జననం
————-

అశ్వత్థంగా శరాగ్ని నుంచి శ్రీకృష్ణుడి చక్రధారతో రక్షింపబడి ఉత్తర గర్భాన పుట్టాడు పరీక్షిత్తు. ధర్మరాజు ఆ బిడ్డకు జాతక కర్మాదులు జరిపించాడు. ఘనంగా విందుభోజనాలు ఏర్పాటు చేసి అతిధులనందరినీ సంతోషపరిచాడు. ఆ బిడ్డను అందరూ దీవించారు .

ధర్మరాజు వచ్చిన భూసురులతో “అందరికీ నమస్కారాలు. నేనో మాటచెప్పదలిచాను. వినండి దయయుంచి. మా పూర్వీకులందరూ దయామూర్తులు. ఇప్పుడపుట్టిన ఈ బిడ్డ కూడా వారిలా ప్రసిద్ధుడిగా పేరుప్రఖ్యాతులు పొందుతాడా? హరి భక్తుడు. మీరేమంటారు?” అని అడిగాడు.

అతని మాటలు విని వాళ్ళు ఇలా చెప్పారు “రాజా, మీ ఈ మనవడు మనుపుత్రుడైన ఇక్ష్వాకులా ప్రజలను రక్షించే వాడవుతాడు. శ్రీరాముడిలా మాట మీరడు. ఇచ్చిన మాట కాపాడుతాడు. దుశ్యంతుడి కుమారుడైన భరతుడిలా చంద్ర వంశం కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తాడు. అర్జునుడిలా కోదండ పండితుడు అవుతాడు. సముద్రుడిలా లోతైన వాడు. సింహమంతటి పరాక్రమంకాలవాడవుతాడు. ఓర్పుకి పెట్టిందిపేరవుతాడు. వసుదేవుడిలా అందరికీ హితుడవుతాడు. ప్రజల పట్ల తల్లిదండ్రుల్లా మెలగుతాడు. భక్తుల పట్ల శివుడిలా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సద్గుణాలకు మరోపేరు. పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటాడు. దుష్టులను శిక్షిస్తాడు. శిష్టులను రక్షిస్తాడు.అతను దీర్ఘకాలం జీవిస్తాడు. చివర్లో స్వయంకృతాపరాధం వల్ల . ఓ విప్రకుమారుడి శాపానికి గురవుతాడు. తక్షకుడి వల్ల తన మరణాన్ని తెలుసుకుంటాడు. దానితో సర్వసంగ పరిత్యాగి అయి హరి ధ్యానంతో శుకయోగీంద్రుడి వల్ల, భాగవత శ్రవణం వల్ల, ఆత్మ విజ్ఞాన సంపన్నుడవుతాడు. గంగా ఒడ్డున శరీర త్యాగం చేసి పరమలోకం పొందుతాడు” అని వాళ్ళు వెళ్ళిపోతారు.

ఆ తర్వాత ధర్మరాజు బంధువులను సంహరించడంతో కలిగిన దోషాన్ని నివారించుకోవడానికి అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పురుషోత్తముడి ప్రీతిగా మూడు యాగాలు చేస్తాడు. కృష్ణుడు అనంతరం ద్వారకకు తిరిగి వెళ్ళిపోతాడు.

మరోవైపు తీర్థ యాత్రలు చేసిన విదురుడు తిరిగొస్తాడు.

ధర్మరాజు అతనికి సమ్మానించి అతనితో తీర్థ యాత్రా విషయాలు తెలుసుకుంటాడు. దిక్పాలకులైన సోదరుల సహకారంతో రాజ్యపాలన చేస్తూ ధర్మరాజు పరీక్షితుడిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ చాలాకాలం సుఖంగా గడుపుతాడు.
——————————-
యామిజాల జగదీశ్

Scroll to Top