హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం
పూర్వం ఒకానొకప్పుడు దక్షప్రజాపతి కుమార్తె దితి సంతానం కోసం కశ్యప మహర్షిని కలిసింది. కశ్యపుడు కాస్సేపటి క్రితమే హోమం పూర్తి చేసి కూర్చున్నాడు. దితి తన మనసులోని మాటను చెప్పింది.
అప్పుడు కశ్యపుడు “ఇది సంధ్యాసమయం. పరమేశ్వరుడు తన గణాలతో తాండవం చేస్తున్న వేళ. ఇది రతికి తగిన సమయం కాదు” అని చెప్పాడు. కానీ ఆమె ఆ మాట పట్టించుకోకుండా తన కోరిక తీర్చవలసిందే అని పట్టుపట్టింది. ఆమె గర్భవతి అయ్యింది.
అంతట కశ్యపుడు “నీకు ఇద్దరు పుత్రులు పుడతారు. వాళ్ళు మహాబలవంతులు అవుతారు. కానీ వాళ్ళు దుష్ట స్వభావం కలిగి ఉంటారు. సాదువులను వేధిస్తారు. వారు పెట్టె బాధలను భరించలేక భక్తులు తమను కాపాడవలసినదిగా శ్రీహరిని వేడుకుంటారు. అప్పుడు శ్రీహరి వారిద్దరినీ సంహరిస్తాడు. అయితే ఇద్దరన్నదమ్ములలో పెద్దవాడికి ఓ కొడుకు పుడతాడు. అతను గోప్పహరిభాక్తుడు. భాగవతోత్తముడు..” అని అంటాడు.
కశ్యపుడి మాటలతో ఆమె సరేనంటుంది.
దితి గర్భం పెరిగి ఓ విచిత్రమైన తేజస్సు వ్యాపిస్తుంది. అది చూసి దేవతలు భయపడతారు. బ్రహ్మను కలిసి “ఆ తేజస్సుతో ఏది పగలో ఏది రాత్రో తెలియడం లేదు. విశ్వంలో ధర్మం కుంటుబడుతోంది” అని బాధపడతారు.
అయితే బ్రహ్మ ఇలా అంటాడు –“ఒకానొకప్పుడు నా మానసపుత్రులైన సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు శ్రీహరిని చూడాలనుకుని వెళ్తారు. అక్కడ ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు వారిని అడ్డుకుంటారు. దానితో ఆగ్రహించిన బ్రహ్మ మానసపుత్రులు జయవిజయులను భూలోకంలో తామసప్రవృత్తి కలవారై పుడతారని శపిస్తారు. దానితో జయవిజయులు బాధపడతారు.
ఈ విషయం తెలిసి శ్రీహరి అక్కడికి వచ్చి సనక సనంద సనత్కుమార సనత్సుజాతులకు దత్శానమిస్తాడు. హరి వెంబడే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. శ్రీహరిని చూసి సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు “మీ సుందరప్రదమైన మంగళ రూపాన్ని మేము చూడగలిగాము. మా జీవితం ధన్యమైంది. నువ్వు సర్వలోకైక నాయకుడివి. ధ్యాన నిమగ్నులైన వారికి వారి మనస్సులో కనిపిస్తావు. నిన్ను చూసిన వారు ధన్యులవుతారు. నిన్ను ధ్యానించే వాళ్ళు మరే కర్మలను పాతిమ్పారు…మమ్మల్ని అడ్డగించడం వల్లే నీ ఆశ్రితులైన జయవిజయులను శపించాం. నువ్వు అవిసె పూల కాంతి వంటి కాంతితో శోభిల్లుతున్నావు. నిన్ను చూసిన మా మెత్రాలు తరించాయి. నీకు తలవంచి మొక్కుతున్నాం” అన్నారు.
అంతట శ్రీహరి “మీరు శపించిన జయవిజయులు మీ పట్ల అపరాధం చేసారు. వీరిద్దరూ భూలోకంలో పుట్టినా వీళ్ళు ఏడు జన్మలలో మీ శాపఫలాన్ని అనుభవిస్తారు. మైత్రమో వైరమో ఏదేమైనా వీళ్ళు మీ ఆగ్రహానికి గురయ్యారు. వీరిద్దరూ ఏడు జన్మల తర్వాత తిరిగి నా సన్నిధికి చేరుకుంటారు. జయవిజయులే దితి గర్భంలో ఉన్నారు. వారి తేజస్సు మిమ్మల్ని బాధపెడుతోంది. దీనికంతటికీ మూలకారకుడు శ్రీమన్నారాయణుడు. కనుక శ్రీహరి మీకు మేలు చేకూరుస్తాడు…” అని చెప్పి బ్రహ్మ వారిని స్వర్గలోకానికి పంపుతాడు.
వంద సంవత్సరాల గర్భాన్ని ధరించిన దితికి ఒకే కాన్పులో ఇద్దరు కొడుకులు పుడతారు. వారు పుట్టినప్పుడు భూమి వనుకుతుంది. గిరులు గడగడలాడుతాయి. సముద్రాలు ఉప్పొంగుతాయి. ఆకాశం దద్దరిల్లుతుంది. నెత్తురు వాన కురుస్తుంది. పుట్టిన కొడుకుల్లో పెద్దవాడికి హిరణ్యకశిపుడు అని, చిన్నవాడికి హిరణ్యాక్షుడు అని కశ్యపుడు నామకరణం చేస్తాడు. వీరిద్దరూ బ్రహ్మను తలిచి తపస్సు చేస్తారు. అతనిని మెప్పించి చిత్రవిచిత్రమైన వరాలు పొందుతారు. హిరణ్యకశిపుడు అష్టదిక్పాలకులనూ ఓడించి ముల్లోకాలపై పట్టు సంపాదిస్తాడు. మరోవైపు హిరణ్యాక్షుడు ముల్లోకాలలో సంచరిస్తూ అందరినీ భయపెడుతూ ఉంటాడు.
(మిగిలిన భాగం తదుపరి అధ్యాయంలో)
యామిజాల జగదీశ్