దేవహూతికి తత్వజ్ఞానం
దేవహూతికి కుమారుడు కపిలాచార్యుడు చేసిన తత్వ బోధ….
“అమ్మా! విను….మనస్సు బంధ మొక్షాలకు కారణం. అరిషడ్వర్గాలను జయించగలగాలి. అప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతుడే జీవుడికి పరమాత్ముడు అనే విశ్వాసం కలుగుతేనే భక్తి కలుగుతుంది. భక్తి వల్ల అతి సులువుగా ముక్తి లభిస్తుంది. భక్తి స్థిరంగా ఉండాలంటే భక్తుల సాంగత్యం అవసరం. కొందరు తమ తమ అభిరుచుల బట్టి భగవంతుని ఆరాధిస్తారు. కొందరు తమ హృదయంలో దేవుడికి గుడి కట్టి ధ్యానం చేస్తారు. ఇంకొందరు నిర్గుణ రూపాన్ని ఆరాధిస్తారు. ఏదేమైనా మోక్ష దాయకమే ఫల ప్రదాయకం. అంతేకాదు ఇహలోక సౌఖ్యాల పట్ల వైరాగ్యం ముఖ్యం.
ప్రకృతి పురుష సంయోగంతో సృష్టి జరుగుతుంది. అయితే ఆ పురుషుడే ప్రకృతి మాయకు లోబడి జీవుడవుతాడు. ఈ క్రమంలో కర్మ పాశంలో చిక్కుకుని ఆత్మా విస్మృతి పొందుతాడు. ప్రకృతిని అంటుకుని ఉన్నా తామరాకు పై నీటి బిందువులా అంటకుండా ఉండ గలిగిన వాడే ఆత్మా రూపుడవుతాడు. ఏ కర్మకు తానె కర్తనని అహంభావం చెందక సాక్షి మాత్రుడై సర్వ సృస్తినీ నిరాపేక్షగా చూస్తాడు. రాగ ద్వేషాలు అంటని అతనికే ఈ జగత్తు అంతా విష్ణు మయంగా కనిపిస్తుంది. ఆ సర్వాత్మ భావన ముఖ్యం. అదే మోక్షానికి దారి తీస్తుంది. సూర్యుడిని నేరుగా చూడకపోయినా ఎండను బట్టి ఎవరైనా సూర్యుడిని గుర్తిస్తారు. ఆ విధంగా సర్వ ప్రాణుల రూపాలు మాటలూ చేష్టలూ అన్నీ ఆ దేవుడి లీలలే. ఇది జ్ఞాని అయిన వాడే గుర్తించగలడు. జ్ఞాని సంసారాన్ని అనుభవించినా తాను శరీరం నుంచి వేరని గ్రహిస్తాడు. ఆ శరీరానికి చెందిన సుఖాలు, దు:ఖాలు తనవి కావని ఒక క్షణంలో గ్రహిస్తాడు. ఆ జ్ఞానమే మోక్షాన్ని సంపాదించి పెడుతుంది.
(తరువాయి భాగంలో జీవుడు భగవంతుడిని స్తుతించడం)
– యామిజాల జగదీశ్