పురంజనుడు
పూర్వం పురంజనుడు అని ఓ రాజు ఉండేవాడు. అతనికో మిత్రుడు ఉండేవాడు. అతని పేరు అవిజ్ఞాతుడు. అతను విజ్ఞానఖని.
పురంజనుడికి కోరికలు ఎక్కువ. ఏ నగరం చూసినా అతనిలో కోరికలు రేకెత్తించేవిగా ఉండేవి. తనకు నచ్చిన నగరం కోసం వెతకడం మొదలుపెట్టేవాడు. కానీ అతనికి ఏ నగరమూ నచ్చలేదు. దాంతో భూమండలమంతా తిరిగి తిరిగి చివరకు హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ఓ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి ఓ అందమైన నగరం కనిపించింది. ఆ నగరం సామాన్యమైనది కాదు. దానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. వాటికి తలువులు, తగినన్ని కిటికీలు, తోరణాలు, గోపురాలు, వాకిళ్ళు ఉన్నాయి. అలాగే సంపదకు ఏ మాత్రం లోటుండేది కాదు. బంగారం, వెండి, రత్నాలు, మణులూ మాణిక్యాలు అపరిమితం. ఆ నగరాన్ని చూడగానే పురంజనుడి మనసు ఆగలేదు. అక్కడే ఉండిపోవాలనుకున్నాడు.
ఆ నగరానికి ఓవైపు ఓ అందమైన ఉద్యానవనం ఉంది. ఆ వనంలో ఓ సరస్సు. ఆ సరస్సు నిండా తామరపువ్వులు. చూడ్డానికి కన్నులపండువగా ఉంది. ఆ ఉద్యానవనం నిండా పక్షుల కిలకిలారావాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఆ వైపుగా వెళ్ళే వారినెవరినైనా అక్కడి రమణీయ దృశ్యాలు ఇట్టే కట్టిపడేసేవి.
ఆ ఉద్యానవనంలో ఓ అందాల సుందరి తన చెలికత్తెలతో విహరించడం పురంజనుడి కంట పడింది. ఆమెకు ఓ అయిదు తలల నాగ్రశేష్టుడు తోడుండి దారి చూపిస్తున్నాడు. ఆ అతిలోక సుందరి ఎవరా అని ఆలోచనలో పడ్డాడు. ఆమెమీద మోహం పెంచుకున్నాడు. ఆమెను సమీపించి ఆమె ఎవరు, ఏం చేస్తుంది వంటి వివరాలు అడిగాడు. ఈ నగరంలో ఇంతమందితో కలిసి ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించాడు. పైగా నీకు రక్షకుడిలా వ్యవహరిస్తున్న ఆ అయిదు తలల నాగశ్రేష్టుడెవడు అని అడిగాడు.
నీ అందం చందం నన్ను కట్టిపడేస్తున్నాయి. నిన్ను చూసినప్పటి నుంచి నాలో ఏదో తెలియని మోహం కలిగి మన్మధుడు తోచుకోనివ్వడం లేదన్నాడు. ఏ మాత్రం బిడియపడక తనవంక చూడమన్నాడు. చూడ్డానికి తామెంతో బాగున్నామని, లక్ష్మీనారాయణులలాగా ఉన్నామన్నాడు.
అతను చెప్పిన మాటలన్నీ విన్న ఆ సుందరి ఓ చిరునవ్వు నవ్వింది. తనకు తన తల్లిదండ్రులు ఎవరో తెలీదని చెప్పింది. తన వంశం పేరు కూడా తెలీదని చెప్పింది. చాలా కాలంగా తానిక్కడే ఉంటున్నానని తెలిపింది. ఈ నగరాన్ని ఎవరు ఏర్పాటు చేశారో ఎలా ఏర్పాటైందో కూడా తనకు తెలీదని నన్ను నీకు అర్పించాలనుకున్నానని, నువ్వు నన్ను ఏలుకోవడమే కాదు ఈ నగరానికీ నువ్వే ప్రభువై పాలించు అని చెప్పింది.
పురంజనుడు ఆమె మాటలకు సంతోషించాడు. తన నగరాన్వేషణ సత్ఫలితమిచ్చిందని ఆనందించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను పెళ్ళి చేసుకుని సగల భోగాభాగ్యాలు అనుభవించసాగాడు.
ఆ నగరానికి ఉన్న తొమ్మిది ద్వారాలలో అయిదు తూర్పు దిశలో ఉన్నాయి. దక్షిణ, ఉత్తరాలలో రెండు, పడమట రెండు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఈశ్వరుడు సాక్షీభూతుడై ఉన్నాడు. అటువంటి నవద్వారపురంలో పురంజనుడు ఎంతో స్వేచ్ఛగా గడుపుతున్నాడు. అయితో కాలక్రమంలో కామంమీద ఆసక్తి పెరిగి వివేకం కోల్పోతూ వచ్చాడు. ఎంత సేపూ తన సుందరిమీదే మనసు లగ్నం చేస్తూ ఆమె ఏది చేస్తే అదే తానూ చేస్తూ వచ్చాడు. విచక్షణాజ్ఞానం లేకుండా పోయింది. ఆమె చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడు.
ఓరోజు ఆరాజు ఓ రథంమీద వేటకు బయలుదేరాడు. అది అయిదు గుర్రాలు లాగుతున్న రథం. దానికో సారధి ఉన్నాడు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ధర్మశాస్త్రం ప్రకారం రాజులకు వేట అనేది కులధర్మమే. అయితే ప్రసిద్ధ శ్రాద్ధ దినాలు తప్పించి ఎంతటి రాజుకైనా మిగిలిన రోజులలో వేట నిషిద్ధం. జ్ఞానవంతుడైన వాడు ఆ రోజుల్లో తప్ప జంతు హింస చేయడు. కానీ పురంజనుడు అది మరచి వివేకం కోల్పోయి ధర్మాన్ని గాలికొదిలేశాడు. వినోదం కోసం వేటాడి అనేక జంతువులను చంపాడు. అలా వేటలో ఉన్న రాజుకి ఉన్నట్టుండి తన భార్య గుర్తుకు వచ్చింది. అంతే మధ్యలోనే వేటను ఆపేసి తన భార్య వద్దకు బయలుదేరాడు. ఆమె ఉంటున్న పడగ్గదికి చేరుకున్నాడు. అక్కడ అతనికి తన భార్య కనిపించలేదు. పరిచారికలను చూసి తన దేవి ఎక్కడని ప్రశ్నించాడు.
అప్పుడు పరిచారికలు తమరి విరహం భరించలేక రాణి నేల మీద పడి పొర్లుతోందన్నారు. పురంజనుడు వెంటనే ఆమె చెంతకు వెళ్ళి బుజ్జగించాడు. ఎంతో నచ్చచెప్పాడు. ఎట్టకేలకు ఆమెను ఒప్పించి తన కోరిక తీర్చుకున్నాడు.
(సశేషం)
– యామిజాల జగదీశ్